Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!

October 9, 2026 by M S R

.

(  రమణ కొంటికర్ల  – 99126 99960 ) …. నాల్గు దశాబ్దాల క్రితం వెండితెరపై ఒక ఊపులూపిన పాట… మళ్లీ నాల్గు దశాబ్దాల తర్వాత వేదికపై ఉర్రూతలూగించింది. నాడు సోవియట్ యూనియన్ ను ఆకట్టుకున్న ఆ క్రేజ్.. ఇప్పటికీ రష్యాలో కొనసాగుతూనే ఉంది. ఏకంగా ఆ పాటలో హీరో అయిన మిథున్ చక్రవర్తి ఈ మధ్యే రష్యాలో ఆ పాటకు మళ్లీ డ్యాన్సులు వేయడంతో ఇప్పుడీ పాట మళ్లీ చర్చల్లోకొచ్చింది.

చదివితే అర్థమయ్యేది సాహిత్యమైతే… జస్ట్ వింటే చాలు ట్యూన్ బాగుంటే భాష, భావం కూడా అక్కర్లేకుండానే ఉర్రూతలూగించేది పాట. అలాంటి మిథున్ చక్రవర్తి పాటలెన్నో. పాటలకు భాష, ప్రాంతీయత ఉండొచ్చునేమోగానీ.. కొన్ని పాటలు వాటిని దాటి సరిహద్దులు కూడా చెరిపేసి ముద్ర వేసుకుంటాయి. జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా కూడా అలాంటిదే.

Ads

నాల్గు దశాబ్దాల క్రితం పాటకు.. ఇప్పుడు మళ్లీ మిథున్ చక్రవర్తి రష్యన్ టెలివిజన్ ఛానల్ లో మరోసారి డ్యాన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు తెరపైకొచ్చాయి. మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ కు ప్రత్యేక అతిథిగా వెళ్లిన మిథున్.. ప్రముఖ రష్యన్ టీవీ షో ప్రివెట్ ఆండ్రీలో తన జిమ్మీ జిమ్మీ పాటకు స్టెప్పులేశాడు. వైరలవుతున్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చూడొచ్చు.

disco

1984లో రష్యాలో మొదలైన పాట ప్రభంజనం!

మిథున్ చక్రవర్తి నటించిన డిస్కో డ్యాన్సర్ 1982లో విడుదలైంది. బప్పీలహరి సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లో ఓ సంచలనం. యువతను ఉర్రూతలూగించాయి. ఇండియాలో క్రేజీ సాంగ్స్ గా ఎక్కడ చూసినా వినిపించిన ఆ పాటలు.. మరో రెండేళ్లయ్యేసరికి అంతర్జాతీయంగా ఆకట్టుకోవడం మొదలెట్టాయి. అలా 1984లో సోవియట్ యూనియన్ లో డిస్కో డ్యాన్సర్ సినిమా విడుదలైంది.

అప్పటికి అది ప్రచ్ఛన యుద్ధకాలం. వాస్తవానికి ప్రాశ్చాత్య దేశాల పాప్ కల్చర్ కు సోవియట్ యూనియన్ సమాజంలో అంత సులభంగా ప్రవేశం లభించేది కాదు. అలాంటి సోవియట్ యూనియన్ కు, భారత్ కు మధ్యనున్న సత్సంబంధాలతో.. అలాంటి సమయంలో భారతీయ సినిమాలు మాత్రం అక్కడ ఎంటరయ్యాయి. అవే అక్కడి ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని చూపించాయి.

రంగురంగుల దుస్తులు, కలర్ ఫుల్ మేకప్, సెట్టింగ్స్, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు వెరసి… సోవియట్ ప్రేక్షకలోకాన్ని కట్టిపడేశాయి. ఇక మిథున్ నటించిన పూర్తి డ్యాన్స్ ఓరియెంటెండ్ సినిమా అయిన డిస్కో డ్యాన్సర్ ఆ క్రేజును మరో దశకు తీసుకెళ్లింది.

 రష్యన్ రేడియో, టెలివిజన్, పెళ్లిళ్లు, పార్టీలు, వీధుల్లో ఎక్కడ చూసినా ఒక భారతీయ పాటే ఎక్కువ వినిపించిన రోజులు 1984 కాలంలో కనిపించేవి. అంతటి క్రేజును ఆ కాలంలో కూడగట్టుకున్న జిమ్మీ జిమ్మీ గురించి రష్యాలో పలు కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. జిమ్మీ జిమ్మీ పాటలో హిందీ పదాలేం రష్యన్లకు అర్థమై కాదు.. కానీ, ఆ సంగీతం నచ్చింది. బీట్ ఆకట్టుకుంది. మిథున్ చక్రవర్తి డ్యాన్స్ మాయ చేసింది.

అదే సంగీతానికున్న గొప్పదనం. భాషతో పనిలేకుండా పాట వెంట పరుగెత్తడమంటే ఇదేనేమో. జిమ్మీ జిమ్మీ విషయంలో సోవియట్ యూనియన్ లో అదే జరిగింది. అందుకే సోవియట్ డ్యాన్సర్స్ కూడా జిమ్మీ జిమ్మీకి నృత్య ప్రదర్శనలివ్వడం పెద్ద పెద్ద వేదికల్లో కనిపించేది. (అలాంటి ఓ వీడియో కింద పోస్ట్ చేశాను. చూడొచ్చు.)

మిథున్ చక్రవర్తిని కాస్తా.. మిథున్ దాగా మార్చిన పాట! డిస్కో డ్యాన్సర్ విడుదలయ్యాక సోవియట్ యూనియన్ ప్రేక్షకులు మిథున్ చక్రవర్తి పాత్రకు కనెక్టయ్యారు. పేదరికం నుంచి ఎదిగిన ఓ యువకుడు అవమానాలను భరించి ప్రతిభతో పెద్ద స్టార్ గా ఎదగడం.. అడుగడుగునా అడ్డుపడే అడ్డంకులను ఎదుర్కొనే తీరు.. చివరకు సాధించే విజయం ఇవన్నీ రష్యన్ ప్రేక్షకులను మిథున్ చక్రవర్తికి అభిమానగణంగా మార్చాయి.

మిథున్ పాత్ర, డ్యాన్సులు.. బప్పీలహరి సంగీతం.. కథలోని భావోద్వేగాలు వెరసి.. డిస్కో డ్యాన్సర్ కు సోవియట్ యూనియన్ లో కాసులు కురిపించాయి. భారీ విజయంగా మల్చాయి. ఈ సినిమా 1984లో సోవియట్ బాక్సాఫీస్ లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిల్చింది. 1980ల దశకంలో అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా… సోవియట్ యూనియన్ టాప్ 25 చిత్రాల్లో ఒకటిగా నిల్చిందనీ కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

నాయకుడి కూతురికీ మిథునే అభిమాన హీరో! మిథున్ చక్రవర్తికి సోవియట్ యూనియన్ లో ఏర్పడ్డ క్రేజుకు మరో ఉదాహరణ ఇంకా ఆసక్తికరమైంది. 1986లో సోవియట్ నాయకుడైన మిఖాయిల్ గోర్బచెవ్ భారత్ ను సందర్శించాడు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆయనకు అమితాబ్ బచ్చన్ ను చూపి… ఇతనే భారతదేశ సూపర్ స్టార్ అని పరిచయం చేశారట. కానీ, గోర్బచెవ్ మాత్రం తన కుమార్తెకు మిథున్ చక్రవర్తి అంటే ఇష్టమని.. అతడు మాత్రమే తమకు తెలుసన్నారట. అంటే, అక్కడ మిథున్ చక్రవర్తి సంపాదించుకున్న స్టార్ డమ్ కు గోర్బచెవ్ మాటలు ఓ ఉదాహరణ.

నాల్గు దశాబ్దాల తర్వాత కూడా తగ్గని క్రేజ్! మారుతున్న కాలానికి తగ్గట్టు.. నేటి జెన్ జీ, జెన్ ఆల్ఫాకు తగ్గట్టు సినిమాల నిర్మాణం.. పాటల కంపోజిషన్స్, డ్యాన్సుల స్టైల్ అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా భారత్ లో ఇప్పటి తరానికి నాటి తరం పాటలపై ఎంత పట్టుంది.. ఎంత ఆసక్తి ఉందో కూడా తెలియదు.

ఇంకోవైపు, ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు. ప్రచ్ఛన్న యుద్ధకాలమూ కాదు. ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇంటర్నెట్ సరిహద్దులను చెరిపేసింది. ప్రపంచంలోని ఏ సినిమా అయినా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో చూసేయొచ్చు. కొత్త కొత్త సినిమాలు, సీరిసులు ఎన్నో వస్తున్నాయి. అయినా.. రష్యాలో ఇంకా నాల్గు దశాబ్దాల తర్వాత కూడా నాటి తరం వాళ్ల యాదిలో జిమ్మీ జిమ్మీ జ్ఞాపకాలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి.

అందుకే రష్యన్ టీవీ స్టూడియోలో 2026లోనూ మిథున్ మరోసారి జిమ్మీ జిమ్మీ పాటకు డ్యాన్స్ కట్టాడు. అందుకే, ఆ టీవీ షో జస్ట్ అన్ని ప్రదర్శనల్లాగానే మిగిలిపోలేదు. ఒకప్పుడు భారతీయ సినిమాకు తలుపులు తెరిచిన పాట.. నాల్గు దశాబ్దాల తర్వాత కూడా అంతే సజీవంగా అక్కడ ఎలా యాదికుందో గుర్తు చేసింది. ఇప్పుడు మిథున్ వయస్సు మీద పడవచ్చు. కానీ, తన స్టెప్పులతో నాటి తరానికి తమ యవ్వనాన్ని గుర్తు చేస్తూ.. మళ్లీ జిమ్మీ జిమ్మీ పాటను చర్చల్లోకి తెచ్చాడు మిథున్ దా.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!
  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!
  • ఆ ఆశ్రమ సందర్శనకు కోహ్లీ 5 కోట్లు ఫీజు..? అదీ వ్యాపారమేనా..?
  • SIR – ఈ ఆందోళనల అసలు లక్ష్యం దేశంలో అశాంతి – కల్లోలం !!
  • నూకలు బాకీ ఉంటే… యముడే దిగొచ్చినా ప్రాణాలు తీయలేడు !!
  • బ్లడీ రోమియో – కాదు, బ్లడ్ రోమియో – మరో బ్లడీ ప్యారడైజ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions