.
తమిళనాడు గవర్నర్ తప్పు చేస్తున్నాడా..? ప్రజాతీర్పును కాదంటున్నాడా..? మెజారిటీపై నన్ను కన్విన్స్ చేయాలంటూ టీవీకే విజయ్‌ను రాజ్యాంగస్పూర్తికి విరుద్ధంగా ఒత్తిడి చేస్తున్నాడా..? గవర్నర్ విచక్షణ పరిధిని దాటుతున్నాడా..? ఇదుగో ఇన్నిరకాల అభిప్రాయాలు కూడా వస్తున్నాయి కదా… కపిల్ సిబల్ వంటి లాయర్లు వెంటనే విజయ్‌కెు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నారు కదా…
సరే, ఓసారి ఆ గవర్నర్ ఎవరో ఓసారి చెప్పుకుని… ఆయన తన పరిధిని దాటాడా అనే అంశంపై ప్రఖ్యాత న్యాయకోవిదుడు హరీష్ సాల్వే ఏమంటున్నాడో కూడా చూద్దాం…
తమిళనాడు ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్… ఆయనది గోవా… దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు… చిన్నతనం నుంచే ఆరెస్సెస్ (RSS) భావజాలంతో పెరిగాడు… అత్యవసర పరిస్థితి (Emergency) సమయంలో తండ్రితో కలిసి జైలుకు కూడా వెళ్లాడు… రెండుసార్లు ఎమ్మెల్యే, ఒక టరమ్ స్పీకర్… గోవా ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు… హిమాచల్ ప్రదేశ్, బీహార్ గవర్నర్‌గా చేసి, ప్రస్తుతం కేరళ గవర్నర్… తమిళనాడు నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవిని బెంగాల్‌కు బదిలీ చేయగా ఏర్పడిన ఖాళీలో ఇప్పుడు అదనపు బాధ్యతల్లో ఉన్నాడు… రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాటు ఇప్పుడు తన పరిధిలో ఉన్న అంశం…
Ads

హరీష్ సాల్వే భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన, ఖరీదైన న్యాయవాదులలో ఒకరు… ఆయన 1999-2002 మధ్య అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో భారత సొలిసిటర్ జనరల్‌గా పనిచేశాడు… అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్ జాదవ్ కేసులో భారత్ తరపున వాదించి గెలవడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి… ప్రస్తుతం లండన్‌లో ‘కింగ్స్ కౌన్సెల్’గా ఉంటూనే, భారత రాజ్యాంగ, వాణిజ్యపరమైన కీలక కేసుల్లో అత్యున్నత స్థాయి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు…
గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్ధమే: హరీష్ సాల్వే విశ్లేషణ
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు… టీవీకే (TVK) అధినేత విజయ్‌ను మెజారిటీ నిరూపించుకోమని కోరడం గవర్నర్ పరిధిలోని అంశమేనని, అభ్యంతరకరంగా ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు… ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు…
అతిపెద్ద పార్టీ అంటే అధికారం కాదు… “రాజ్యాంగం ఎక్కడా అతిపెద్ద పార్టీనే (Single-largest party) ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని చెప్పలేదు… సభలో విశ్వాసాన్ని పొందగల వ్యక్తిని మాత్రమే ముఖ్యమంత్రిగా నియమించాలనేది రాజ్యాంగ నిబంధన” అని సాల్వే వివరించాడు… కేవలం సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన ప్రభుత్వం ఏర్పాటు చేసే హక్కు లభించదని, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలరా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యమని ఆయన పేర్కొన్నాడు…
లిఖితపూర్వక హామీ కోరడం సరైనదే… గవర్నర్ కేవలం ఓ నాయకుడి మాట మీద నమ్మకం ఉంచకుండా, మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంతకాలు లేదా ఇతర ఆధారాలు కోరడం తన విచక్షణ అధికారాల్లో భాగమేనని సాల్వే సమర్థించాడు…. “విజయ్ మద్దతుదారులు తమ మద్దతును లిఖితపూర్వకంగా ఇవ్వడంలో ఇబ్బంది ఏముంది? గవర్నర్ కేవలం నోటి మాట కంటే కొంత ఎక్కువ నిశ్చితిని (Certainty) కోరుకోవడంలో తప్పులేదు” అంటున్నాడు ఆయన… ఒకవేళ 50 శాతానికి పైగా ఎమ్మెల్యేలను భౌతికంగా హాజరుపరచాలని కోరితే అది అతి కావచ్చు, సరైంది కాకపోవచ్చు కానీ, ‘స్పష్టత’ కోరడం, స్థిరత్వం (స్టెబిలిటీ) చూడటం సమంజసమేనన్నాడు… పరిస్థితిని అనిశ్చితిలోకి తీసుకుపోవడం గాకుండా గవర్నర్ నిశ్చితి (సర్టెనిటీ) ఆలోచిస్తున్నాడు…
మహారాష్ట్ర ఉదాహరణ, సుప్రీంకోర్టు తీర్పు … గతంలో మహారాష్ట్ర శివసేన ఉదాహరణను ప్రస్తావిస్తూ… ప్రతి రాజకీయ పరిస్థితికి ఒకే పరిష్కారం ఉండదని అభిప్రాయపడ్డాడు… కొన్నిసార్లు ప్రజాదరణ చూసి అవకాశం ఇవ్వాలని ఒకరు వాదించవచ్చు, మరికొందరు స్థిరత్వం కోసం మరిన్ని ఆధారాలు కోరవచ్చు.. ఈ రెండు వాదనలు సహేతుకమే, అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులతో తాను వ్యక్తిగతంగా విభేదిస్తానని, కానీ చట్టం ప్రకారం వాటిని గౌరవించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాడు…
వ్యవస్థలపై విమర్శలు సరికాదు… కోర్టులు, ఎన్నికల కమిషన్ లేదా గవర్నర్ వంటి వ్యవస్థలు రాజకీయంగా ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వాటిపై విమర్శలు చేయడం ఒక అలవాటుగా మారిందని సాల్వే ఆవేదన వ్యక్తం చేశాడు… “మన రాజకీయ చర్చల్లో సభ్యతను తిరిగి తీసుకురావాలి… మనకు నచ్చని నిర్ణయం రాగానే రాజ్యాంగ వ్యవస్థలను తప్పుబట్టడం సరైన పద్ధతి కాదు” అన్నాడు ఆయన..!!
Share this Article