Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అజింక్యా అంటేనే అజేయుడు – స్థితప్రజ్ఞుడు… కానీ సరైన వీడ్కోలు లేదు!!

August 1, 2026 by M S R

.

రహానే ! ఈ అజేయుడికి, ఈ స్థితప్రజ్ఞుడికి సరైన వీడ్కోలు పలికామా ? ఈ ప్రశ్న ఎందుకంటే..? చాన్నాళ్లుగా కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ చర్చ జరుగుతూనే ఉంది… ఒక ధోనీ రిటైర్మెంట్ ఘనంగా జరిగింది… ఎవరు రిటైరవుతున్నా జట్టు, ప్రేక్షకులు, మీడియా సాదరంగా వీడ్కోలు పలుకుతున్నారు… మరి రహానేకు ఏం తక్కువ..? ఎందుకు మీడియా కూడా పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు..?

తనను మరీ ధోనీ, కోహ్లీ, రోహిత్ స్థాయిలో ఎత్తుకోలేం కదా అంటారా..? కానీ రహానే మన క్రికెట్‌కు చేసిన సేవ తక్కువేమీ కాదు… తను కెప్టెన్‌గా ఆడింది కొన్ని మ్యాచులే కావచ్చు, కానీ తనకు ఓటమి లేదు, టెస్టుల్లో, వన్డేల్లో… వ్యక్తిగా కూల్ మైండెడ్… అట్టహాసాలు, అలవిమాలిన ఉద్వేగ ప్రదర్శనలు ఉండవు… స్థితప్రజ్ఞుడు… వివాదరహితుడు… తన పేరులోని అజింక్యా అంటేనే ఓటమి లేనివాడని అర్థం…

Ads

సరే, ఓ క్లాసిక్ ఉదాహరణ… ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ (2020-21)ని గెలిచి స్వదేశానికి చేరుకున్నాక ముంబైలో కొంతమంది అభిమానులు రహానే ఇంటివద్ద కంగారూ బొమ్మతో ఉన్న ఒక ప్రత్యేకమైన కేక్‌ను తయారుచేయించి, దానిని కట్‌ చేయాలని కోరారు…

అప్పుడతను ఆ బొమ్మను తొలగిస్తేనే కట్‌ చేస్తానని చెప్పాడు… అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తాము గెలిచింది ఆటలో కానీ ఆ దేశానికి గర్వకారణమైన జాతీయ జంతువును అగౌరవపరచడం తమ అభిమతం కాదని అతడు చెప్పకనే చెప్పాడు… రహానే వ్యక్తిత్వం గురించి చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు.

భావోద్వేగాలకు నిలయమైన క్రికెట్‌లో ఎక్కడా తన ప్రశాంతతను కోల్పోకుండా తన తోటి ఆటగాళ్లకే గాక ప్రత్యర్థులనూ నొప్పించకుండా ఆటలో వారితోనే శభాష్‌ అనిపించుకున్న అతికొద్దిమంది గొప్ప క్రికెటర్లలో రహానే ఒకడు.

ఈ ముంబై క్రికెటర్‌ గురువారం తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు నిశ్శబ్దంగా, ఏ హడావుడి లేకుండా వీడ్కోలు పలికాడు. సోషల్‌ మీడియాలో ఓ వీడియో రిలీజ్‌ చేస్తూ… ‘నా కెరీర్‌లో వ్యక్తిగత స్వార్థం చూసుకోకుండా ఎల్లప్పుడూ నా దేశం, జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. పూర్తి నిజాయితీతో ఈ ఆట ఆడాను. అభిమానుల హృదయాల్లో నేను ఎప్పుడూ ఓడిపోలేదు’ అని చెప్పాడు. 2011 నుంచి 2023 దాకా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రహానే.. 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.

ఆ సిరీస్‌ ఎందుకు ప్రత్యేకం? 2020-21 బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ. ఆడేది ఆస్ట్రేలియా సొంతగడ్డపై.. తొలి టెస్టు జరిగిన అడిలైడ్‌లో కంగారూ పేసర్ల ధాటికి 36 పరుగులకే ఆలౌటైన భారత్‌కు అవమానకర ఓటమి… దీనికితోడు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ, బుమ్రా సీరీస్‌కు దూరమయ్యారు… ఎలాగోలా సీరీస్ ముగిస్తే చాలు అనుకునే టైమ్… ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్ భంగపడి, మళ్లీ పుంజుకున్న చరిత్ర కూడా లేదు మనకు…

అప్పుడు నాయకుడిగా రహానే ఓ కొత్త చరిత్ర రాశాడు… రెండో టెస్టు జరిగిన మెల్‌బోర్న్‌లో సారథిగా సెంచరీ (122) చేసి తన జట్టుకు స్ఫూర్తినిస్తూ టీమిండియా విజయానికి బాటలు వేశాడు. మూడో టెస్టు డ్రా. గబ్బాలో నాలుగో టెస్ట్‌. “హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, స్టార్క్‌ త్రయం.. భారత బ్యాటర్ల తలలను లక్ష్యంగా చేసుకుని సందిస్తున్న బౌన్సర్లను పుజారాతో కలిసి తట్టుకుని జట్టుకు ధైర్యం నూరిపోయడంలో రహానేది కీలకపాత్ర…”

  • అప్పటికీ అంతర్జాతీయ అనుభవం లేని సిరాజ్‌, శార్దూల్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌, పంత్‌, గిల్‌ వంటి యువకులతో ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించి సిరీస్‌ను చేజిక్కించుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు. యువ జట్టుతో ఇంతటి గొప్ప విజయాన్ని సాధించినా గబ్బాలో నిర్వహించిన సెలబ్రేషన్స్‌లో పంత్‌కు జాతీయ జెండాను అప్పగించి తాను రెండో వరుసలోకి వెళ్లిపోయి నిలుచోవడం రహానే నాయకత్వ లక్షణానికి మరో ఉదాహరణ…

రహానే ఎన్నడూ వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాడలేదు. స్టార్‌ అయిన తర్వాత కూడా దేశవాళీ క్రికెట్‌ను చిన్నచూపు చూడలేదు. జట్టుకు అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి తన విలువ ఏంటో నిరూపించాడు. విమర్శలు వచ్చినా ఎదురుతిరిగి మాట్లాడలేదు. ప్రశంసలు వచ్చినా వాటిని ఆడంబరంగా ఆస్వాదిస్తూ తిరగలేదు. సైలెంట్‌గా వచ్చి, తన పని పూర్తి చేసి, మళ్లీ నిశ్శబ్దంగానే పక్కకు తప్పుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలాంటి నిస్వార్థ సేవకులు చాలా అరుదు. అందుకే రహానే రిటైర్మెంట్ ఒక ఆటగాడి వీడ్కోలు మాత్రమే కాదు… ప్రచారానికి దూరంగా ఉండే ఒక గొప్ప వ్యక్తిత్వం నిష్క్రమణ కూడా. అభిమానుల మాటల్లో చెప్పాలంటే… రహానే అభిమానుల గుండెల్లో మాత్రం అతను ‘అజింక్య’గానే మిగిలిపోయాడు…

గౌతమ్ గంభీర్ వల్లే రహానే ఇక విసిగిపోయి సైలెంటుగా రిటైర్మెంట్ ప్రకటించాడని సెహ్వాగ్ విరుచుకుపడటం ఈ కథనానికి కొసమెరుపు... చాలామందిలో ఆ అభిప్రాయం ఉంది కూడా!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాష్‌రూంలోకి ఆ ఆరేళ్ల పాప… ఫ్లై దుబాయ్ కథలో అదే కీలకం !!
  • పార్టీలు చెప్పేవి శ్రీరంగనీతులు – అఖిలేషుడూ ఆ తానులో ముక్కే !!
  • Sigma – తమిళ సీఎం విజయ్ కొడుకు సంజయ్‌కు ఓ ఫ్లాప్ డెబ్యూ !!
  • ఆపదామపహర్తారం… ఆ ఆపదలో స్మిత్ ధైర్యం హనుమంతుడే!
  • ఏమిట్లు..? ఇంతకీ ఈ ఫ్లయింగ్ హీరో స్మిత్ మచ్చర్ మనోడేనా..?
  • ఇల్లు కూడా లేని ఓ నిరుపేద బుక్కెడు బువ్వకై స్టార్ హోటల్ కట్టుకున్నా తప్పేనా..?!
  • ఆ ఒక్కటీ తక్కువైంది షెకావత్తూ… అదే ఎమోషనల్ థ్రిల్! వెరసి ట్రబుల్!!
  • అనుకోని అనుకూలతలు – లేకపోతే మధ్యప్రాచ్యం మండిపోయేది!
  • కేటీయార్ స్టార్ హోటళ్లు ! రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అక్షరసత్యాలే !!
  • తమన్నా VVAAN – మౌత్‌టాక్ కోసం బొట్లు, ప్రసాదాల ప్రమోషన్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions