.
ఆర్థిక పెత్తనం ఎప్పుడూ ఒకచోట కేంద్రీకృతం కాదు… ప్రపంచాన్ని స్థూలంగా ఓ రెండొందల ఏళ్ల కాలం ప్రామాణికంగా పరిశీలిస్తే… ఓడలు బళ్లు – బళ్లు ఓడలు… పడాయి, లేచాయి కొన్ని దేశాలు… కానీ రెండు శతాబ్దాల తరువాత ఆసియా దేశాలే ఇప్పుడు ప్రపంచ ఆర్థిక స్థితిగతులను శాసించే స్థితికి వచ్చాయి… ఇంట్రస్టింగు !!
ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తి అంటే ఆసియానే. వాణిజ్యం కావాలన్నా… సుగంధ ద్రవ్యాలు కావాలన్నా… వస్త్రాలు కావాలన్నా… బంగారం కావాలన్నా… అందరి చూపూ భారత్, చైనాల మీదే ఉండేది. అప్పట్లో యూరప్ ప్రపంచాన్ని శాసించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆసియానే.
Ads
- కానీ చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. 18వ శతాబ్దం చివర్లో బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం మొదలైంది. ఆవిరి యంత్రాలు వచ్చాయి. కర్మాగారాలు పెరిగాయి. ఉత్పత్తి అమాంతం పెరిగింది. నౌకాదళం బలపడింది. ప్రపంచవ్యాప్తంగా వలస రాజ్యాలను స్థాపించింది. ఒక దశలో “బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడు” అనే మాట యాదృచ్ఛికంగా రాలేదు.
1845 నాటికి ప్రపంచ జీడీపీలో దాదాపు నాలుగో వంతు బ్రిటిష్ సామ్రాజ్యానిదే. ఆ సంపదలో భారతదేశం పాత్ర అత్యంత కీలకం. భారతదేశం నుంచి ముడిసరుకులు వెళ్లాయి… బ్రిటన్‌లో తయారైన వస్తువులు తిరిగి భారతదేశానికే అమ్ముడయ్యాయి. బ్రిటన్ సంపద వెనుక భారతదేశం చెమట కూడా ఉంది.
కానీ శక్తి శాశ్వతం కాదు. ఎకనామిక్ పవర్ అటూ ఇటూ మారుతుంది… రెండు ప్రపంచ యుద్ధాలు యూరప్‌ను ఆర్థికంగా దెబ్బతీశాయి. అప్పటికే అమెరికా పారిశ్రామికంగా, సాంకేతికంగా, ఆర్థికంగా బలపడుతోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ప్రపంచం కొత్త ఆర్థిక నాయకుడిని చూసింది.
- 1944లో ప్రపంచ జీడీపీలో దాదాపు 30 శాతం అమెరికాదే. ఆధునిక చరిత్రలో ఒకే దేశం సాధించిన అత్యధిక వాటా అదే. తరువాతి దశాబ్దాల్లో డాలర్ ప్రపంచ కరెన్సీగా మారింది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు, అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం… అన్నీ అమెరికా చేతుల్లోకి వెళ్లాయి. అందుకే 20వ శతాబ్దాన్ని చాలామంది “అమెరికన్ సెంచరీ” అంటారు.
కానీ చరిత్ర మరోసారి దిశ మార్చుకుంది. చైనా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. ప్రపంచానికి తయారీ కేంద్రంగా మారింది. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ప్రపంచ మార్కెట్లను తన ఉత్పత్తులతో నింపేసింది.
ఇక భారత్ కూడా 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత కొత్త ప్రయాణం ప్రారంభించింది. సేవారంగం, ఐటీ, ఔషధ పరిశ్రమ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ… ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది.
2025 నాటికి ప్రపంచ జీడీపీలో చైనా వాటా 21.8 శాతం. భారత్, చైనా కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు మూడో వంతు వాటాను కలిగి ఉన్నాయి. అంటే ప్రపంచ సంపదకు కేంద్రబిందువు మళ్లీ ఆసియా వైపు కదులుతోంది.

ఇది కేవలం సంఖ్యల మార్పు కాదు. పెట్టుబడులు ఎక్కడికి వెళ్తాయి… పరిశ్రమలు ఎక్కడ పెరుగుతాయి… ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి… సాంకేతిక ఆవిష్కరణలు ఎక్కడ జరుగుతాయి… ప్రపంచ రాజకీయాల్లో ఎవరి మాటకు బలం ఉంటుంది… ఇవన్నీ చివరకు ఆర్థిక శక్తిపైనే ఆధారపడతాయి.
అయితే దీనిని చూసి అమెరికా యుగం ముగిసిపోయిందని చెప్పడం కూడా తొందరపాటు అవుతుంది. నామమాత్ర జీడీపీ (Nominal GDP), ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, డాలర్ ఆధిపత్యం, ప్రపంచ దిగ్గజ కంపెనీలు… ఈ అన్ని రంగాల్లో అమెరికా ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.
మరోవైపు చైనా జనాభా క్షీణత, వృద్ధాప్య జనాభా, ఉత్పాదకత వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత్ ముందున్న అవకాశాల్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే తయారీ, నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల్లో మరింత వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంది.
అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండు శతాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక నాయకత్వం బ్రిటన్ నుంచి అమెరికాకు మారినట్లే… ఇప్పుడు ఆ కేంద్రం మెల్లగా ఆసియా వైపు కదులుతోంది.
చరిత్ర పూర్తిగా పునరావృతం కాకపోవచ్చు. కానీ 200 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని నడిపించిన ఆసియా… మరోసారి ప్రపంచ ఆర్థిక వేదికపై కేంద్ర స్థానాన్ని తిరిగి సంపాదించే దిశగా అడుగులు వేస్తోందన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇండియా- చైనా జీడీపీ వాటా 30 శాతం..!! ఒకవేళ బ్రిక్స్ కూటమి ఇంకా పుంజుకున్నా... లేక రిక్ (రష్యా, ఇండియా, చైనా) కూటమి ఏర్పడినా... ప్రపంచ ఆర్థికాధిపత్యం ఈ కూటమిదే !!
Share this Article