.
డెస్క్ జర్నలిస్టులకే కాదు, ఫీల్డ్ రిపోర్టర్లకే కాదు… డిజిటల్ మీడియా వాళ్లకు, ఇండిపెండెంట్ క్రియేటర్లకు… అనగా వెబ్ జర్నలిస్టులు, యూట్యూబర్లు ఎట్సెట్రా అందరికీ సభ్యత్వం ఇస్తారట, గుర్తింపు కార్డులు ఇస్తారట, వెహికిల్స్ మీద అతికించుకునే స్టిక్కర్లు కూడా వాళ్లే ఇస్తారట… మీడియా కమ్యూనిటీ యాక్సెస్ అట…
జస్ట్, 1799 రూపాయలు చెల్లిస్తే చాలు… అవును, Indian Press Union యాడ్ ఇదే చెబుతోంది… అసలే ఫీల్డ్‌లో నకిలీ జర్నలిస్టులు, కుప్పలుతెప్పలుగా యూట్యూబర్లు, గొట్టాలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలర్లు, దొంగ వ్యాపారాలతో ఫీల్డ్ కంపు కంపు అయిపోయింది… ఇదుగో సందట్లో సడేమియాలాగా ఈ సంస్థ దందా మొదలుపెట్టింది…
Ads

ఈ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో, ప్రభుత్వ గుర్తింపు ఉన్న సాధికార సంస్థో, ప్రెస్ కౌన్సిలో, జర్నలిస్టుల అసోసియేషన్లో, ప్రెస్ క్లబ్బులో, ఎడిటర్స్ గిల్డో మరొకటో ఇచ్చేది కాదు… జస్ట్, ఇదొక వ్యాపార సంస్థ… ఈ యూనియన్ ఇచ్చే గుర్తింపు కార్డుకు ఏ విలువా లేదు, ఉండదు… దీనికోసం వెంపర్లాడే వాళ్లకు ఇదీ సూచన…
Indian Press Union (IPU) అనేది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక సంస్థ కాదు. ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ మాధ్యమాలలో కనిపిస్తున్న ఒక ప్రైవేట్ అసోసియేషన్ లేదా స్వచ్ఛంద సంస్థ (Non-Profit / Media Association)….
ఈ సంస్థ గురించి, వీరు జారీ చేసే ఐడీ కార్డుల వెనుక ఉన్న అసలు నిజాలు క్రింది విధంగా ఉన్నాయి…
1. ఇది అధికారిక సంస్థా? కాదు. భారతదేశంలో జర్నలిస్టులకు అధికారికంగా గుర్తింపు కార్డులను (Press Accreditation Cards) కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమాచార పౌరసంబంధాల శాఖ (I&PR) మాత్రమే జారీ చేస్తాయి.
-
అలాగే రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా (RNI) ద్వారా రిజిస్టర్ అయిన వార్తాపత్రికలు లేదా అధికారికంగా గుర్తింపు పొందిన మీడియా సంస్థలు తమ సిబ్బందికి ఐడీ కార్డులు ఇస్తాయి.
-
ఇటువంటి ‘Indian Press Union’ లాంటి ప్రైవేట్ పేర్లతో పుట్టుకొచ్చే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు గానీ, అధికారిక హోదా గానీ ఉండదు.
2. వీరు ఐడీ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నారు? ఇలాంటి ప్రైవేట్ యూనిట్లు లేదా సంఘాలు ప్రెస్ ఐడీ కార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వడానికి ప్రధానంగా కొన్ని వ్యాపార/స్వార్థ పూరిత కారణాలు ఉంటాయి…
-
సభ్యత్వాలు, వసూళ్లు: మెంబర్‌షిప్ ఫీజులు, ఐడీ కార్డులు, సర్టిఫికెట్ల పేరుతో ఆసక్తి గల వారి నుండి లేదా ఫ్రీలాన్స్ జర్నలిస్టుల నుండి డబ్బులు వసూలు చేయడం.
-
ఆకర్షణీయమైన ప్రచారం: సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తూ “అధికారిక ప్రెస్ ఐడీ, జీవితకాల సభ్యత్వం” అంటూ నమ్మించి అమాయకులను ఆకర్షించడం.
-
బోగస్ గుర్తింపు: చాలాసార్లు ఎలాంటి జర్నలిజం అనుభవం లేని వారు కూడా సులభంగా ప్రెస్ పేరుతో ఒక ఐడీ కార్డ్ పొందడానికి ఇలాంటి సంస్థలను ఆశ్రయిస్తుంటారు.
ఇలాంటి ప్రైవేట్ యూనిట్లు జారీ చేసే ప్రెస్ ఐడీ కార్డులకు ఎలాంటి చట్టపరమైన లేదా అధికారిక విలువ ఉండదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ మీట్లు లేదా పోలీసు తనిఖీల సమయంలో వీటిని చూపించడం వల్ల ఇబ్బందులు ఎదురుకావడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో ఇవి చట్టపరమైన సమస్యలకు కూడా దారి తీయవచ్చు. మీడియా పేరుతో చలామణి అయ్యే ఇలాంటి అనధికార సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండటం ఎప్పుడూ మంచిది….
- ష్… గుర్తింపు పొందిన మీడియా సంస్థలు జారీ చేసే ఐడీ కార్డులనే ఎవడూ దేకడం లేదు, విలువ లేదు, ఇక వీటి మాటెంత..?!
Share this Article