.
1,050 రోజుల అజేయ ప్రయాణానికి ముగింపు… ఐర్లాండ్ చేతిలో భారత్ ఓటమి చెప్పిన చేదు నిజాలు… సరిగ్గా 1,050 రోజుల పాటు భారత్ ద్వైపాక్షిక T20 సిరీస్‌లో ఓడిపోలేదు. 2023 ఆగస్టులో వెస్టిండీస్ చేతిలో 3-2తో సిరీస్ కోల్పోయిన తర్వాత వరుసగా 16 ద్వైపాక్షిక T20 సిరీస్‌ల్లో అజేయంగా నిలిచింది. ఆ ప్రయాణంలో 11 సిరీస్ విజయాలు సాధించింది. ఇదే కాలంలో వరుసగా రెండు T20 ప్రపంచకప్‌లను కూడా గెలుచుకుంది.
అలాంటి జట్టే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త పసికూనగా భావించే ఐర్లాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోవడం కేవలం ఒక పరాజయం కాదు. భారత T20 జట్టుకు ఇది గట్టిగా మోగిన అలారం. క్రికెట్ పెద్దలకు సంధిస్తున్న అనేక ప్రశ్నలు కూడా..!
Ads
ఈ సిరీస్‌లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… భారత్ బలహీనమైన జట్టుతో ఆడలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్… వీళ్లందరూ మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లే. ఐపీఎల్‌లోనూ, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ తమ ప్రతిభను ఎన్నోసార్లు నిరూపించారు. కానీ ఈ సిరీస్‌లో మాత్రం దాదాపు అందరూ ఒకేసారి విఫలమయ్యారు. ఒకరు కాదు… ఇద్దరు కాదు… దాదాపు మొత్తం బ్యాటింగ్ యూనిట్ తడబడింది. అదే భారత్‌ను భారీ మూల్యం చెల్లించేలా చేసింది.
ఆ పిచ్ పరిస్థితులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం కూడా స్పష్టంగా కనిపించింది. అక్కడి స్వింగ్, సీమ్, బౌన్స్‌కు తగ్గట్టు బ్యాటింగ్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. కానీ భారత బ్యాటర్లు చాలాసార్లు అదే దూకుడు కొనసాగించే ప్రయత్నం చేశారు. ఫలితంగా వికెట్లు వరుసగా చేజారిపోయాయి.
బౌలింగ్‌లో అనుభవం లోపించింది. ఒత్తిడి సమయంలో ఇన్నింగ్స్‌ను కట్టడి చేసే బౌలర్ కనిపించలేదు. కీలక ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో జట్టు విఫలమైంది. కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు. బౌలర్ల వినియోగం, ఫీల్డ్ సెట్టింగులు, మ్యాచ్ పరిస్థితులకు తగ్గ నిర్ణయాల్లో అతని నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి.
మిడిలార్డర్ వైఫల్యం మరో ప్రధాన కారణం. టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు జట్టును నిలబెట్టాల్సిన బాధ్యత మిడిలార్డర్‌పై ఉంటుంది. కానీ అదే విభాగం ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసింది.
ఈ సిరీస్ మరో ప్రశ్నను కూడా లేవనెత్తింది. ఐపీఎల్‌లో విజయం సాధించే దూకుడు, అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి పరిస్థితిలో పనిచేయదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం, ఇన్నింగ్స్‌ను నిర్మించే ఓర్పు, రిస్క్‌ను ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకునే పరిపక్వత అవసరం. ఈ సిరీస్‌లో భారత్ ఆ పరీక్షలో తడబడింది.
అయితే ఈ విజయాన్ని కేవలం భారత వైఫల్యంగా మాత్రమే చూడటం ఐర్లాండ్‌కు అన్యాయం చేసినట్టే. వారు అద్భుతమైన క్రికెట్ ఆడారు. అవకాశాలను వదలలేదు. బ్యాటింగ్‌లో ధైర్యం, బౌలింగ్‌లో క్రమశిక్షణ, ఫీల్డింగ్‌లో చురుకుదనం ప్రదర్శించి ప్రతి మ్యాచ్‌లో భారత్‌పై ఒత్తిడి పెంచారు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోలిక కూడా ఉంది. 2024 T20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓడింది. కానీ వెంటనే పుంజుకుని సిరీస్‌ను 4-1తో గెలిచింది. ఇప్పుడు 2026 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడిన తొలి ద్వైపాక్షిక T20 సిరీస్‌లోనే ఐర్లాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోయింది. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. కానీ ప్రపంచకప్ విజయాల తర్వాత వచ్చే ఆత్మసంతృప్తి, ప్రయోగాలపై అధిక దృష్టి లేదా సంసిద్ధతలో లోపాల గురించి ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి.
ఒక సిరీస్ ఓడిపోవడం వల్ల భారత క్రికెట్ ఏమీ కుప్పకూలిపోదు. కానీ ఈ ఓటమి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. పేర్లు పెద్దవైతే సరిపోదు. ఫామ్, పరిస్థితులకు అనుగుణంగా ఆడే సామర్థ్యం, సమష్టి ప్రదర్శన— ఈ మూడూ ఉంటేనే విజయాలు వస్తాయి. శ్రేయాస్ అయ్యర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ వంటి మ్యాచ్ విన్నర్లతో నిండిన జట్టు కూడా ఒకేసారి విఫలమైతే, ఐర్లాండ్ వంటి ప్రత్యర్థి కూడా సిరీస్ గెలవగలదని ఈ పరాజయం నిరూపించింది.
ఇప్పుడిక పొట్టి క్రికెట్‌లో చిన్న జట్టు, పెద్ద జట్టు, బలహీన జట్టు, బలమైన జట్టు ఏమీ లేవు… మ్యాచ్ రోజు ఎవడు బాగా ఆడితే వాడే తోపు..!! వాడిదే కప్పు!!
Share this Article