Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామాయణమా… రావణాయణమా ? కథలోని ఆత్మ -హత్య చేయబడుతోందా ?

August 15, 2026 by M S R

.

రామాయణమా… రావణాయణమా?
రాముడి కథ కంటే రావణుడి చుట్టూనే ఎక్కువ కథ నడుస్తోందా? …. పాత ఎన్టీయార్ సినిమాల్లో తన ఇమేజ్ కోసం భారత, రామాయణాల్లోని ప్రతినాయక పాత్రలకు కూడా హీరోయిజం లక్షణాల్ని రుద్దబడేవి… సేమ్, యశ్ ఇమేజ్ కోసం కొత్త రామాయణం, కాదు, రావణాయణం చూపించబోతున్నారా..?

రామాయణం అంటే ముందుగా గుర్తొచ్చేది రాముడు. ఆ తర్వాత సీత. లక్ష్మణుడు, హనుమంతుడు, అయోధ్య, అరణ్యవాసం, లంక… ఇవన్నీ ఆ మహాకావ్యంలోని కీలక ఘట్టాలు. కానీ ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ రామాయణం గురించి వస్తున్న ఒక్కో సమాచారం చూస్తుంటే మాత్రం ఒక సందేహం మొదలవుతోంది.

Ads

ఇది రామాయణమా?
లేక రావణాయణమా?

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. దానికి తోడు దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్ అంటూ నిర్మాతలు చెబుతుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇప్పుడు తాజాగా నటుడు చేతన్ హన్స్రాజ్ చెప్పిన విషయం ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మొదట ఆయనకు రావణుడి తల్లి కైకేసి తండ్రి, అంటే రావణుడి మాతామహుడు రాజా మాలి/ మాల్యవాన్ పాత్ర ఇచ్చారట. యశ్‌తో తన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ఆయన చెబుతున్నారు.

అక్కడితో ఆగలేదు. ఆ పాత్ర పూర్తయిన తర్వాత అదే నటుడికి మరో ఆరు మోషన్ క్యాప్చర్ పాత్రలు ఇచ్చారట. అందులో రావణుడి సోదరుల్లో ఒకరి పాత్రతో పాటు ఓ రాక్షసుడి పాత్ర కూడా ఉందట. (మోషన్ క్యాప్చర్ పాత్ర అంటే ఆ నటుడు ఆయా పాత్రల మేకప్ వేసుకుని నటించడు,  నిజమైన కదలికలు, హావభావాలను రికార్డ్ చేసి, వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG) ద్వారా డిజిటల్ పాత్రకు అందించడం…  “మోక్యాప్” (Mo-cap) అనీ పిలుస్తారు…

అంటే ఒక నటుడు… ఏడు పాత్రలు! ఇది విన్న వెంటనే తెలుగు ప్రేక్షకులకు పాత జ్ఞాపకం ఒకటి గుర్తుకు రాక మానదు.

1977లో వచ్చిన దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు… మూడు పాత్రలు పోషిస్తే, చలపతిరావు కూడా ఒకటి కాదు, పలు పాత్రల్లో కనిపించారు. ఇంద్రుడు, అధిరథుడు, జరాసంధుడు, దృష్టద్యుమ్నుడు వంటి పాత్రలను ఆయన పోషించారు.

అప్పట్లో అది నటుడి ప్రతిభకు నిదర్శనం. ఇప్పుడు రామాయణంలో ఒక నటుడే ఏడు పాత్రలు పోషించడం మాత్రం మరో కారణంతో ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ ఏడు పాత్రల్లో ఎక్కువ భాగం రావణుడి ప్రపంచానికి సంబంధించినవే.

ఇక ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం చూస్తే కూడా ఈ సినిమా కథలో రావణుడి పాత్రకు చాలా పెద్ద స్పేస్ ఉన్నట్టు అనిపిస్తోంది.

రావణుడిగా యశ్. రావణుడి మాతామహుడిగా చేతన్ హన్స్రాజ్. రావణుడి సోదరుల పాత్రల్లో మోషన్ క్యాప్చర్ నటులు. లంక, రాక్షసులు, రావణుడి కుటుంబం, అతడి సామ్రాజ్యం… ఇవన్నీ సినిమాలో ఎంత విస్తృతంగా చూపించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రాముడి కథలో రావణుడికి ఇంత స్పేస్ ఎందుకు?

ఇది ఒక సాధారణ విషయం కాదు. రామాయణంలో రాముడు కేంద్రబిందువు. కానీ రాముడి గొప్పతనం కూడా రావణుడి ప్రతినాయకత్వం నేపథ్యంలోనే మరింత బలంగా బయటపడుతుంది. అందుకే రావణుడిని బలమైన పాత్రగా చూపించడం తప్పేమీ కాదు. నిజానికి రావణుడి వ్యక్తిత్వం కూడా చాలా పొరలున్న పాత్ర.

విద్వాంసుడు.

శివభక్తుడు.

వైణికుడు

మహా పరాక్రమశాలి.

లంకాధిపతి.

అదే సమయంలో అహంకారి.

అధికార దాహంతో నిండినవాడు.

సీతను అపహరించినవాడు.

అంటే ఒక గొప్ప సినిమాటిక్ విలన్‌కు కావాల్సిన అన్ని లక్షణాలూ రావణుడిలో ఉన్నాయి. అందుకే ఒక భారీ అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎపిక్‌గా రామాయణం రూపొందిస్తున్నప్పుడు దర్శకుడు రావణుడి ప్రపంచాన్ని విస్తరించడం సహజమే.

కానీ అక్కడే అసలు ప్రశ్న.

రావణుడి కథను విస్తరించే క్రమంలో రాముడి కథ మరుగున పడుతుందా? ట్రైలర్‌పై విమర్శలు… మేకర్స్ సమాధానం ఏమిటి?

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఒక వర్గం విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల లుక్‌పై విమర్శలు చేసింది. మరో వర్గం మాత్రం నటీనటుల ఎంపిక, సినిమా స్కేల్‌ను మెచ్చుకుంది. దీనిపై నిర్మాత నమిత్ మల్హోత్రా కూడా స్పందించారు.

తాము కోట్లాది డాలర్లు ఖర్చు చేసి పెద్ద తెర అనుభవం కోసం సినిమా రూపొందిస్తున్నామని, ఫోన్‌లో లేదా తక్కువ నాణ్యత గల ఇంటర్నెట్‌తో చూసి సినిమా ఎలా ఉందని తీర్పు చెప్పడం సరికాదన్నది ఆయన వాదన.

రణ్‌బీర్ కపూర్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ, ఈ సినిమా కోసం నితీష్ తివారీ, నమిత్ మల్హోత్రా తదితరులు ఏళ్లుగా VFXపై పనిచేస్తున్నారని చెప్పాడు. అంటే మేకర్స్ చెప్పేది ఒక్కటే— ఫోన్‌లో చూసి రామాయణాన్ని అంచనా వేయకండి. థియేటర్‌లో చూడండి.

అది నిజమే కావచ్చు. కానీ ప్రేక్షకుడికి మరో హక్కు కూడా ఉంది. ట్రైలర్ చూసి ప్రశ్నలు అడిగే హక్కు. రూ.4,000 కోట్ల సినిమా అంటున్నప్పుడు అంచనాలు కూడా అంతే భారీగా ఉంటాయి.

రావణుడి మీద సినిమా కాదు… కానీ రావణుడి చుట్టూ మాత్రం పెద్ద ప్రపంచం! 

ఇక్కడే రామాయణంకు మరో ఆసక్తికరమైన కోణం కనిపిస్తోంది. ఇది రాముడి కథను మాత్రమే చెప్పే సినిమా కాకుండా… రాముడి ఎదురుగా నిలిచిన రావణుడి ప్రపంచాన్ని కూడా లార్జ్ స్కేల్‌లో నిర్మించే సినిమాగా కనిపిస్తోంది.

రావణుడి కుటుంబం…

రావణుడి సోదరులు…

రావణుడి మాతామహుడు…

లంక…

రాక్షస సైన్యం…

మోషన్ క్యాప్చర్ పాత్రలు…

హాలీవుడ్ యాక్షన్ నిపుణులు…

వేల కోట్ల బడ్జెట్…

ఇవన్నీ కలిపితే రామాయణం కంటే ముందు ప్రేక్షకుడి కళ్ల ముందు నిలిచేది లంకా సామ్రాజ్యమేనా? అన్న సందేహం రావడం సహజమే. అయితే సినిమా విడుదలయ్యే వరకు తుది తీర్పు ఇవ్వడం తొందరపాటు.

ఎందుకంటే ఒకవేళ దర్శకుడు రావణుడి ప్రపంచాన్ని అంత భారీగా చూపించి, దాని మధ్యలో రాముడి ధర్మాన్ని మరింత శక్తివంతంగా ఎస్టాబ్లిష్ చేస్తే… అదే ఈ సినిమాకు అసలు బలం కావచ్చు.

అప్పుడు పేరు మాత్రం… రామాయణమే.

కానీ తెరపై రావణుడి సామ్రాజ్యం అంతా చూసిన తర్వాత ప్రేక్షకుడు సరదాగా మరో పేరు పెట్టొచ్చు—

“రామాయణం కాదు బాబూ… రావణాయణం!”

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇటు రేవంత్ – అటు ఒవైసీ… ఇద్దరివీ తెలివైన ప్రసంగాలు
  • మహిళా జడ్జిలకు కూడా తప్పని లైంగిక వివక్ష – వేధింపులు !
  • వేణు ఊడుగుల – మరో కొత్త ఆలోచనాత్మక సినిమాకు శ్రీకారం !
  • ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!
  • మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!
  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!
  • మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!
  • గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!
  • అన్నీ మంచి శకునములే ! తలనొప్పులూ తలెత్తుకునేలా చేశాయి !!
  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions