Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!

October 14, 2026 by M S R

.

దేశంలోని పురాతన ఆలయాల విశిష్టత, చరిత్రను చెప్పే ఓ పాపులర్ సోషల్ పేజీలో ఓ పోస్టు కనిపించింది… అదెలా చెబుతోందంటే..? ‘‘ మహిళల కోసం ప్రత్యేకంగా శబరిమల ఉందని మీకు తెలుసా? ఇది తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలోని మందైకాడు భగవతి అమ్మన్ ఆలయం… దీనిని “మహిళల శబరిమల” అంటారు… ఇక్కడ, లక్షలాది మంది మహిళలు 41 రోజుల వ్రతం చేస్తారు, ఇరుముడి కెట్టును తలపై పెట్టుకుని దర్శనం కోసం వస్తారు – శబరిమల అయ్యప్పన్ భక్తుల మాదిరిగానే…’’

ఆశ్చర్యం వేసింది… శబరిమల అయ్యప్ప నైష్టిక బ్రహ్మచారి, ప్రత్యేక ‘తాంత్రిక ప్రతిష్ఠ’, ప్రతిష్ఠా నియమాల ప్రకారం స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉంటానని స్వామి ప్రతిజ్ఞ చేశాడనీ, అందుకే స్వామి బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలగకుండా గౌరవించడం కోసమే రుతు మహిళలను అనుమతించరనేది కదా మనం చదివింది…

Ads

ఏ గుడి విశిష్టత దానిదే… ఎక్కడి ఆచారం, ఎక్కడి సంప్రదాయం అక్కడిదే… కానీ తమకేదో ఆగమాలు తెలిసినట్టు సుప్రీంకోర్టు రుతుమహిళలకూ ప్రవేశం ఉండాలని ఏదో తీర్పు చెప్పింది కదా… మన సుప్రీంకోర్టు సున్నితమైన మతభావనలను ఎప్పుడు పట్టించుకున్నది గనుక…!!

తరువాత లెఫ్ట్ ప్రభుత్వం ఓవరాక్షన్, హిందూ మతవ్యతిరేక చర్యలు, ఆ తరువాత సీపీఐ లెంపలేసుకోవడం, ఇప్పుడు ఆ ప్రభుత్వమే కొట్టుకుపోవం, శబరిమల ధ్వజస్థంభపు బంగారం కిలోలకొద్దీ మాయం కావడం, మాజీ సీఎం పినరై విజయన్ మీద కేసు… ఇవన్నీ ఆ పాపఫలితాలే అని అయ్యప్ప భక్తులు తేల్చేయడం… అదంతా వేరే కథ…

మరి ఆ నైష్టిక బ్రహ్మచారిని ప్రత్యేకంగా రుతుమహిళలు కూడా… సేమ్, మరోచోట గుడిలో అదే ఇరుముడి తరహా సంప్రదాయంలో పూజించడం ఏమిటనే ప్రశ్న తలెత్తింది… ఫ్యాక్ట్ చెక్ చేద్దాం అనిపించింది… అసలు మహిళల శబరిమల ఏమిటి..? ఎక్కడుంది..? అని వివరాలు కనుక్కుంటే కథ పూర్తిగా వేరు… ఓసారి వివరాల్లోకి వెళ్దాం…

వాస్తవం ఏమిటంటే… అసలు ఇది అయ్యప్ప ఆలయమే కాదు! ఇక్కడ కొలువైన దైవం అయ్యప్ప స్వామి కూడా కాదు! మరెవరు? ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన భగవతి అమ్మవారు! ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? ఎందుకీ పేరు? ఇక్కడి ప్రత్యేకతలేమిటి?

mandaikadu

శబరిమల పేరు.. అమ్మవారి కొలువు! తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో, కొలచల్ సమీపంలోని మండైకాడు అనే తీరప్రాంత గ్రామంలో ఉంది ఈ భగవతి అమ్మవారి ఆలయం… కేరళ సరిహద్దులకు సమీపంగా ఉండటంతో ఇక్కడి ఆలయ నిర్మాణంలోనూ కేరళ సంప్రదాయపు ఛాయలు కనిపిస్తాయి… ఈ ఆలయాన్నే ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు…

ఎందుకని? శబరిమలకు పురుషులు అయ్యప్ప మాల ధరించి, 41 రోజుల మండల దీక్ష ఆచరించి, ఇరుముడితో వెళ్తారు… అలాగే మండైకాడు భగవతి అమ్మవారి దర్శనం కోసం కూడా మహిళలు దీక్ష ఆచరించి, తలపై ఇరుముడి ధరించి వస్తారు… ముఖ్యంగా వార్షిక మాసి కొడై ఉత్సవం సమయంలో మహిళా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పోలికే ఆలయానికి ‘మహిళల శబరిమల’ అనే పేరును తెచ్చిపెట్టింది…

విగ్రహం కాదు.. 15 అడుగుల పుట్టే దైవం! ఈ ఆలయంలో అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించే విశేషం ప్రధాన దైవం రూపం… సాధారణంగా ఆలయాలకు వెళ్తే రాతి విగ్రహాలో, లోహ విగ్రహాలో దర్శనమిస్తాయి… కానీ మండైకాడు ఆలయంలో ప్రధాన దైవంగా పూజలందుకునేది సుమారు 15 అడుగుల ఎత్తైన సహజసిద్ధమైన పుట్ట! దీనిని భగవతి అమ్మవారిగా, ఆదిపరాశక్తి స్వరూపంగా కొలుస్తారు…

మాసి కొడై.. పది రోజుల మహా ఉత్సవం! మండైకాడు ఆలయంలో జరిగే ప్రధాన పండుగ మాసి కొడై ఉత్సవం… తమిళ మాసమైన మాసిలో, సాధారణంగా ఫిబ్రవరి–మార్చి మధ్య ఈ ఉత్సవం నిర్వహిస్తారు… పది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు తమిళనాడుతో పాటు కేరళ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు…

వలియ పడుక్కై, ఒడుక్కు పూజ వంటి ప్రత్యేక ఆచారాలు ఈ ఉత్సవంలో భాగం… మహిళల శబరిమల అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది గానీ… శబరిమలకూ, ఆ దేవుడికీ… ఈ గుడికీ, ఈ అమ్మవారి పూజకూ ఏమాత్రం లింక్ లేదు… రెండూ వేర్వేరు… మహిళల ప్రత్యేక శబరిమల అని పిలిచే ఈ ఆలయం వెనుక ఉన్న అసలు కథ ఇదే!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహిళలకు ప్రత్యేకంగా వేరే శబరిమల..? నిజమేంటో చెప్పుకుందాం..!!
  • ఓ వెధవ ట్రోలర్‌కు వేణుస్వామి భార్య వీణశ్రీవాణి పర్‌ఫెక్ట్ కౌంటర్ !!
  • CJP – కూలీ ఇచ్చి మరీ తన్నించుకున్నట్టు అయిపోయింది !!
  • రైతు డిస్కమ్‌పై బీఆర్ఎస్ వక్రబాష్యాలు – పసలేని విమర్శలు
  • అసలే గతితప్పిన సంసారి… పైగా సమాజానికి బోడి ఉచిత సలహాలు…
  • పిచ్చి స్క్రిప్టుతో అభాసుపాలు – ఇప్పుడు దిద్దుబాటుకు మరో ప్రయాస
  • డియర్ చంద్రబోస్, ఓ నాలుగు రోజులు చల్లగరిగెలో ఉండి రావచ్చుగా…
  • Ellis Island – అమెరికా పారడాక్స్ వలస కథలకు అచ్చమైన సాక్ష్యం !!
  • నిషా నూర్‌..! ఈమెదీ సిల్క్ స్మిత కథేనా..? డర్టీ పిక్చర్‌-2 అదేనా..?
  • ఘర్షణ వద్దు – అదెటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేని రోజులివి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions