.
Ramu Hyd Journo … మోదీ గారి ప్రతిష్ఠకు మరో పెద్ద గండి!
అప్పుడు రైతులు… ఇప్పుడు యువకులు!!
నరేంద్ర మోదీ గారి రాజకీయ ఎదుగుదల ఒక వీరోచిత విజయ యాత్రలాగా, అద్భుత గాథ లాగా అనిపిస్తుంది. ఆయన వండర్ఫుల్ పాలకుడు అని చెప్పలేం కానీ సూపర్ నాయకుడు అని తడుముకోకుండా చెప్పవచ్చు. తరచిచూస్తే ఆయన్ను ప్రధానంగా రెండు కారణాల రీత్యా హిందూ సమాజం ఆదరించి అక్కున చేర్చుకుంటున్నది.
ఒకటి, దేశాన్ని అస్థిర పరచే పాకిస్థాన్ ను సమర్థంగా డీల్ చేయగలడన్న నమ్మకం.
రెండు, దేశీయంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పటిష్ఠంగా అదుపు చేస్తాడన్న విశ్వాసం.
మీరు గమనించారో లేదో, ఈ రెండు అంశాల చుట్టూనే ఆయన ఎన్నికల ప్రచారం ఉంటుంది. అదేమి అదృష్టమోగానీ, ఎన్నికల సమయంలో ఈ రెండు కోణాల నుంచే ఆయనకు లాభం కలిగే పరిణామాలు సంభవిస్తాయి. పెట్టి పుట్టిన నేత ఆయన.
Ads
మీరు ఎందుకు మోదీ గారిని అభిమానిస్తారు? అన్న ప్రశ్నకు సాధారణ ప్రజల నుంచి కొత్త సమాధానాలు నాకైతే రాలేదు. తమ జీవన నాణ్యత పెంచేలా బ్రహ్మాండమైన పథకాలు ఆయన తెచ్చినట్లు ప్రజలు లిస్ట్ అవుట్ చేయడం నేను వినలేదు. బీజేపీ అభిమానులు, జాతీయ వాదులు ఆయన విజయాలు (అచీవ్మెంట్స్) అంటూ ఇచ్చే లిస్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అట్లనే ఉంటుంది.
INDI A వాళ్ళైనా, NDA వాళ్ళైనా సాధారణ జన జీవితాల్లో పెను మార్పులు తెచ్చే సీన్ లేదు. ఇంత పెద్ద దేశానికి కావలసిన పెద్ద మంత్రదండం ఎవరి దగ్గరా లేదు. పన్నులు, ధరలు, నిరుద్యోగం వంటివి అప్పుడూ, ఇప్పుడూ ఒకటే. కాకపోతే, సోషల్ మీడియా పెరగడాన మన ప్రధాని మనకు సూపర్ హీరో అన్న భ్రమ కలిగే ఏర్పాటు జరుగుతోంది. తనకు తాను దైవాంశ గల నేతను అన్న భ్రాంతి ఆయనకే కలిగే పరిస్థితి అవి సృష్టించాయి.
ఇట్లా రాయడం మోదీ గారిని అవమానించడంగా అనుకోకండి. ఒక నేత మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రధాన మంత్రిగా కావడం కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే అంశం. ఆయనకి ఉన్న ప్రబల శక్తికి, ప్రత్యేకతకు నిదర్శనం. మోదీ వేవ్ కు మంత్రముగ్ధులై… ఆయన సమ్మోహన శక్తికి పరవశులై, మాటల మహిమకు పడిపోయి బీజేపీ కి ఓటు వేసిన వారే ఎక్కువ.
ఇపుడు అసలు విషయం…
భూమిని నమ్ముకున్న రైతులను, మాతృభూమి పట్ల మమకారంతో ఉండే విద్యార్థులను, యువతను జాగ్రత్తగా డీల్ చేయకపోతే కష్టం. అధికారం ఇచ్చిన కిక్కు లో మోదీ గారు ఇక్కడ లెక్క తప్పుతున్నారు. అదెట్లనో చూద్దాం.
గత పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీ మంచి ఊపు మీద ఉంది. పాకిస్థాన్ కు ఎప్పటికపుడు ఝలక్ ఇచ్చారు. యావత్ భారత్ మెజారిటీ హిందువులను ఒక తాటిపైకి తెచ్చి రాజకీయంగా జన్మనిచ్చిన రామ జన్మభూమి కేసు గెలిచి, ఆలయ నిర్మాణం జరిగింది. కోవిడ్ సంక్షోభాన్ని ఆయన చక్కగా నిభాయించారన్న పేరు వచ్చింది. ప్రపంచానికి టీకాలు ఆయనే ఇచ్చారన్న పేరు పొందారు. ఇవన్నీ పెద్ద విజయాలు.
అందుకే చార్ సౌ పార్… అని గట్టిగా నమ్మారు వారు. కానీ ఏమయింది? అంచనాలు ఘోరంగా తప్పాయి. నితీశ్ కుమార్, నారా చంద్రబాబు గార్లు లేకపోతే హ్యాట్రిక్ కష్టం అయ్యేది.
కారణం: 2021 లో వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతుల సుదీర్ఘ ఉద్యమం. ఆ సందర్భంగా ప్రభుత్వ ధోరణి. అది ఖలిస్తాన్ ప్రేరేపిత ఉద్యమం అన్న ప్రచారం బాగా చేశారు. అయినా రైతు ఉద్యమ ప్రభావం ఆ ఎన్నికల్లో చూపింది. బీజేపీ పెట్టుకున్న అంచనాలను ఘోరంగా అది దెబ్బతీసింది.
రాహుల్ గాంధీ గారిని ఒక ప్రత్యామ్నాయంగా చూడలేకపోయానా ప్రజలు కాంగ్రెస్ కు ప్రాణం పోశారు. అధికారం కిక్కు ఎక్కి, కేవలం మతం చుట్టూ పోతున్న వారికి ఒక చెక్ ఉండాలని గట్టి విపక్షాన్ని ప్రజలు ఎంచుకున్నారు.
ఇక ఇప్పుడు, ఆనాడు రైతుల వల్ల జరిగిన నష్టం విస్మరించి ప్రభుత్వం యువతతో గోక్కున్నది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశంతో పాటు, మమతా బెనర్జీ అహంభావం కూడా కలిసివచ్చి పశ్చిమ బెంగాల్ లో ఘన విజయం సాధించాక బీజేపీ ప్రజల పల్స్ తో సంబంధం లేదన్నట్లు దూకుడు పెంచింది. క్రమశిక్షణగల పార్టీ…. విపక్ష నేతలను ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టుకొచ్చి ముఖ్యమంత్రులు చేయడం, తమను బూతులు తిట్టిన ఎంపీల మద్దతు కోసం తహతహలాడడం దేశభక్తిగల కాషాయ సేనకి కూడా మింగుడుపడని అంశం.
ఈ పట్టపగ్గాలు లేని ధోరణి పట్ల మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా సంతోషంగా ఉండదు. ఇది ఆర్గానిక్ గ్రోత్ కాదని, ఇది రేపైనా పుట్టి ముంచుతుందని సంఘ్ పెద్దలు లోలోపల కుములుతున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ పేరిట వచ్చిన ఉద్యమం నిజమైన జన్ జీ ఉద్యమం అనడానికి వర్తమాన కారణాలు ఉన్నాయి. మన పొరుగుదేశాల్లో యువత మాదిరిగానే మన దగ్గర యువత కూడా చాలా అసంతృప్తితో ఉంది. ఉదాహరణకు, భారత రాజకీయ చరిత్రలోనే సంచలనాత్మకమైన రీతిలో యువత తమిళనాడులో అనూహ్యమైన తీర్పు ఇచ్చారు. అక్కడి యువతను ఎవరు బయటి నించి స్పాన్సర్ చేసారు?
ప్రతి చోటా యువత తీవ్రమైన నిరాశతో ఉంది వివిధ కారణాల వల్ల. మోదీ గారి ప్రియ మిత్రుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక మనవాళ్ళ అంతర్జాతీయ అవకాశాలకు క్రమంగా గండి పండింది. ఇక్కడ పెద్దగా ఉద్యోగాలు లేవు. విద్య, వైద్యం ఖరీదై పోయాయి. ధరలు పెరిగి ఇళ్లలో డబ్బు కిటకిట అయ్యింది. ఇది యువత మీద ప్రభావితం చూపింది. కనిపించని ఆర్థిక మాంద్యాన్ని మతం సెంటిమెంట్ కప్పి పుచ్చలేకపోతున్నది. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు ఉంది.
నిజానికి ఎవరో ప్రభావితం చేస్తే రోడ్ల మీదకు వచ్చేంత దుర్బలురు కాదు మన పిల్లలు. సోషల్ మీడియా వల్ల కావచ్చు లేదా క్రికెట్ వల్ల కావచ్చు, మన పిల్లలు దేశభక్తి కలిగి ఉన్నారు.
యువతను ఎగదోసే విదేశీ సంస్థలు ఉన్నాయన్న అభియోగం నిజమో, కాదో మనకు తెలియదు కానీ ఎవరో ప్రేరేపిస్తే రెచ్చిపోతున్న యువకులు అని నమ్మి వారిని ఇగ్నోర్ చేయడం ఉత్తమం… అన్నది పిచ్చి వ్యూహం.
దాదాపు రెండు నెలలుగా అన్ని రాష్ట్రాల్లో జరిగిన యువజన సమీకరణను డీప్ స్టేట్ కు అంటగట్టి కూర్చోవడం బీజేపీ చేసిన పెద్ద తప్పిదం. అరుపుల అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు సృష్టించే నెరేటివ్స్ నమ్మితే ఇంతే సంగతులు. రైతుల ఉద్యమం సందర్భంగా మనవాడు చేసిన హంగామా, వాదన గుర్తుకు తెచ్చుకోండి. ఇది ఎలక్ట్రానిక్ భజనపరుల సంఘం.
జంతర్ మంతర్ దగ్గర పోలీసులు, సైన్యం చేసే ప్రతి చర్యా, వారి వల్ల కారే ప్రతి రక్తపు బొట్టూ ఈ ప్రభుత్వానికి నష్టం కలిగించేదే. నిరాయుధులైన విద్యార్థుల మీద, ముఖ్యంగా మహిళల మీద, విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించడం ప్రతి ఫోన్ ను, గుండెను చేరుతోంది. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసులు, RAF మీద దాడి చేయడమూ జరుగుతోంది.
ఇప్పటికే పెద్ద డ్యామేజ్ అయ్యిందని ప్రభుత్వం కొద్దిగా గుర్తించడం మంచి పరిణామం. నిన్నటి రోజున
ఢిల్లీలోకి రైతులు కూడా చేరుకున్నారు. పంజాబ్ రైతులు ఉన్నచోట బల ప్రయోగం బూమ్రాంగ్ అవుతుంది.
పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఈ పరిణామాల ప్రభావం కనపడబోతోంది.
(Note: ఈ అభిప్రాయాన్ని అంగీకరించొచ్చు లేదా ఎర్రిపప్ప లేదా ఖాన్ గ్రేస్ అన్న ముద్ర నాకు వేస్తారేమో, లాభం లేదు. నేను దేశభక్తి గల జర్నలిస్టును మాత్రమే. నేను ‘నమో’ వాచకాలు పలకలేను, నాకు ‘రాగ’ ద్వేషాలు లేవు…)
ఈ కథనంలోని అంశాలన్నీ రచయిత సొంత అభిప్రాయాలు మాత్రమే
Share this Article