Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…

September 24, 2026 by M S R

.

Mohan Goteti  …. జేడీ చక్రవర్తితో రెండు ఫొటోల కథ!
జేడీ చక్రవర్తిని చూస్తే మొదట్లో ఆశ్చర్యమేసేది!
అంటే.. శివ రిలీజైన టైంలో అన్న మాట.
ఇంత పొగరుగా ఉంటాడు.. ఎవర్నీ లెక్కచేయడు.. ఇక్కడెలా సక్సెస్ అవుతాడురా బాబూ? అనుకునేవాడిని.
‘మనీ’, ‘వన్ బై టు’ సినిమాల సమయంలో తను పరిచయమయ్యాడు..
అప్పటికే నేను సీనియర్ జర్నలిస్టుని.. కొత్తగా వచ్చే వాళ్లంతా మమ్మల్ని ‘సార్’ అంటూ ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు.
మనోడు అదేమీ లేదు.. చాలా క్యాజువల్ గా “హాయ్” అన్నాడు మొదటి పరిచయంలోనే!
అదో పెద్ద షాక్!

1995లో ఓ రోజు మా స్నేహితుడు, చక్రవర్తి మేనేజరూ అయిన గిరిధర్ ఫోన్ చేసి “మోహన్.. మన చక్రీతో అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ సినిమా తీస్తోంది” అన్నాడు.
“వెళ్లవయ్యా.. చక్రీ తప్ప అమితాబ్ కి ఇంకెవరూ దొరకలేదా? లేకపోతే ఏమిటీ.. చక్రీతో అమితాబ్ సినిమా తీయడమేమిటి?” అన్నాను తేలిగ్గా తీసిపారేస్తూ.
“ఒక్క నిమిషం లైన్ లో వుండు.. చక్రి మాట్లాడతాడు” అన్నాడు.
“మోహన్.. అమితాబ్ నాతో తీయకూడదని నీ ఉద్దేశమా? లేక నాకంత సీన్ లేదని నీ ఉద్దేశమా?” అన్నాడు చక్రి.
“రెండోదే కరెక్ట్” అన్నాను.
“అయితే, నువ్వు తప్పు.. అమితాబ్, రామూ గారు కలిసి నాతో సినిమా చేస్తున్నారు” అన్నాడు.
తనంతలా చెప్పడంతో నమ్మక తప్పలేదు..

Ads

అదే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ సినిమా!
ఆ సినిమాతో మనోడు కెరీర్లో కూడా బైక్ మీద రివ్వున దూసుకుపోయాడు.
వరుసగా సినిమాలు వచ్చేశాయి..
రాఘవేంద్రరావు గారితో ‘బొంబాయి ప్రియుడు’ చేశాడు..
పాటలు సూపర్ హిట్.. సినిమా మాత్రం ఫట్..
చక్రీకి అలాంటి సినిమాలు నప్పవు..
కృతకంగా వుంటుంది అలాంటి కథ అతనికి..

ఆ తర్వాత రామూ గారి దర్శకత్వంలోనే వచ్చిన ‘అనగనగా ఒక రోజు’ పెద్ద హిట్!
అది అతనికి నప్పే కథ.. అలాంటి కథలు అతనికి కావాలి..
తర్వాత మరి కొన్ని సినిమాలు చేశాడు..
అంతగా క్లిక్ అవలేదు అవి..
ఆ తర్వాత మళ్లీ రామూ గారే హిట్ ఇచ్చారు..
అదే ‘సత్య’.. తెలుగులోనూ, హిందీలోనూ రెండు చోట్లా హిట్టే!

అలాంటి నేచురల్ కథలు అతనికి సూట్ అవుతాయి..
ఎందుకంటే, ప్రతి క్యారెక్టర్ కీ, ప్రతి కథకీ అతని ఫేస్ మౌల్ద్ కాదు..
పర్టిక్యులర్ గా కొన్ని వుంటాయి.. అలాంటివే అతను చేయాలి.. అలాంటివి ఊదిపారేస్తాడు!
ఏ క్యారెక్టర్ పడితే అది అతను చేయలేడు..
అసలు ఏదిపడితే అది అతనకి నప్పదు కూడా!

సినిమా రంగానికి సంబంధించి నాకున్న మంచి స్నేహితుల్లో చక్రీ ఒకడు!
మొదట్లో అతను ఎవరికీ అర్థం కాడు..
అలా అతనితో జర్నీ సాగుతున్న కొద్దీ మనకి బాగా అర్థమవుతాడు.
అతని మాట తీరు చూసి.. కొంతమంది అతన్ని పొగరుబోతు అంటారు..
అది అతని వ్యక్తిత్వం..
స్టయిల్ గా ఉంటాడు.. రెక్లెస్ గా ఉంటాడు.. ఎవరికీ వంగివంగి దండాలు పెట్టడు!
ఎవరికీ.. ఎంత పెద్ద వాళ్లయినా సరే.. పాదాభివందనాలు చేయడు..
అతి వినయం ప్రదర్శించడు.. ఊరికే పొగడడు.. అది అతని వ్యక్తిత్వం.
దానిని పొగరు అనుకుంటే ఎలా?

chakri

ఇంటర్వ్యూలో మీరు ఏదైనా సరే అడగండి.. ‘నో’ అనకుండా దానికి బోల్డ్ గా సమాధానం చెబుతాడు.
ఎవరేమనుకున్నా సరే .. తను చెప్పాలనుకున్నది చెబుతాడు.
ఇది చెప్పచ్చు.. ఇది చెప్పకూడదు అన్నది అతనికి తెలియదు.
అందుకే, సినిమా ఫీల్డులో నాకు తను విచిత్రమైన వ్యక్తిలా కనిపిస్తాడు!

హిందీ సినిమాలు చేస్తూ ముంబైలో ఉంటున్న రోజుల్లో అర్థరాత్రో.. అపరాత్రో ఫోన్ చేసేవాడు.
ఒసారలాగే రాత్రి గాఢ నిద్రలో వున్నాను.. ముంబై నుంచి ఫోన్ చేశాడు.
‘మర్రిచెట్టు’ (హిందీలో ‘వాస్తుశాస్త్ర’) సినిమా షూటింగులో వున్నానని చెప్పాడు.
“నా పక్కనే సుస్మితా సేన్ వుంది.. మాట్లాడతావా?” అన్నాడు.
అసలే అప్పటివరకు మాంచి నిద్రలో వున్నాను..
నిద్ర మత్తు ఇంకా వదలలేదు..
అప్పటికే అతనితో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు.,
ఇక ఆమెకు ఫోన్ ఇస్తే ఏం మాట్లాడతానోనని చెప్పి “వద్దులే బాబూ.. తర్వాత ఎప్పుడైనా మాట్లాడిద్దువు గాని” అన్నాను.
అలా వుంటుంది చక్రీతో..!

96లో అనుకుంటా.. ఉన్నట్టుండి అమెరికా వెళ్లాడు..
ఎందుకంటే ‘మెథడ్ యాక్టింగ్’ నేర్చుకోవడానికన్నాడు.
అమెరికా నుంచి రెండు రోజులకోసారి ఫోన్..
ఆ రోజు క్లాసులో ఏం చెప్పారో.. అంతా వివరించేవాడు.
“ఈ నేర్చుకోవడం నేను ఎప్పుడో చేసి వుండాల్సింది మోహన్” అన్నాడు.
అంతలా ఆ క్లాసుల్ని తను ఇష్టపడ్డాడు!
మళ్లీ కాలేజీకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతోందని కూడా చెప్పాడు.

మా చక్రీ అమ్మకూచి!
అమ్మంటే ప్రాణం.. అమ్మని విడిచి ఉండలేడు..
అమ్మ ఎవరో తెలుసు కదా.. ప్రముఖ సంగీత విద్వాంసురాలు కోవెల శాంత గారు!
‘తూర్పు పడమర’ సినిమాలో సుశీలతో కలిసి “తూర్పు పడమర ఎదురెదురూ..” పాట పాడారావిడ!
వాళ్లింటికి వెళితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెబుతారు..

మా ఇంటికి కూడా చాలా సార్లు వచ్చారు..
మా అమ్మ చేసిన పులిహోర అంటే చక్రీకి, వాళ్లమ్మ గారికి బాగా ఇష్టం..
ఈమధ్య కూడా ఆ విషయాన్ని తనే గుర్తుచేశాడు.
అప్పుడప్పుడు అమ్మను తీసుకుని లాంగ్ డ్రైవ్ కి వెళుతుంటాడు.
ఊళ్లో వుంటే కనుక సాయంకాలాలు అమ్మని కారులో తీసుకుని అలా.. ఓ రౌండ్ వేసి తీసుకొస్తుంటాడు. .
తన అక్క అంటే.. అతనికి మరో ప్రాణం..

“చిన్నప్పటి నుంచీ మాకు బంధువులతో అంతగా సఖ్యత లేదు.. దాంతో ఇంట్లో అక్కా, నేనే.. స్నేహితుల లాంటి వాళ్లం” అంటాడు.
చిన్నప్పుడు మా అమ్మాయికి తను ‘సుబ్బమ్మ’ అని నిక్ నేమ్ పెట్టాడు.
ఎప్పుడు ఫోన్ చేసినా “మా సుబ్బమ్మ ఎలా వుంది మోహన్?” అంటుంటాడు సరదాగా.
గతేడాది మా అబ్బాయి పెళ్లి వేడుకకు వచ్చినప్పుడు కూడా.. మా అమ్మాయిని చూసి.. “ఏం సుబ్బమ్మా.. ఎలా వున్నావ్?” అంటూ పలకరిస్తే.. దాని ఫ్రెండ్స్ అంతా నవ్వుతూ ఆశ్చర్యంగా చూశారు.
అసలు విషయం మనోడే చెప్పి మళ్లీ వాళ్లని నవ్వించాడు!

చక్రీకి మరో ధ్యాస అంటూ వుండదు..
ఎప్పుడూ సినిమా.. సినిమా.. సినిమా..
కొత్త సినిమాలు చూస్తుంటాడు..
కొత్త కథలు రాసుకుంటూ ఉంటాడు..
సినిమా నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకుంటూ ఉంటాడు..
ఇంతే.. తన సమయాన్ని అంతా సినిమా మీదే వెచ్చిస్తాడు!
తనకి సినిమా అంటే ప్రేమ అనుకోండి.. పిచ్చి అనుకోండి.. అదంతే!

చక్రీకి రామూ గారంటే పిచ్చి ప్రేమ..
ఆయనేం చెప్పినా అదే వేదం అంటాడు..
అసలు ఆయనంతటి జ్ఞాని లేడంటాడు..
ఇంకా చెప్పాలంటే ఆయనొక్కర్నే గౌరవిస్తాడు!
కొత్తా లేదు.. పాతా లేదు.. తను ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతాడు..
మహా ఎక్స్ ట్రా వర్ట్..
మీరు కదిలించాలి అంతే.. ఏ టాపిక్ గురించైనా మాట్లాడేస్తాడు.
దేని మీదైనా సరే అడ్డంగా వాదించి, నిలబడతాడు!

మా చక్రీలో మరో లక్షణం కూడా వుంది..
మనం ‘సార్’ అని పిలిచామనుకోండి.. మనల్ని కూడా ‘సార్’ అంటాడు.
మనం ‘మీరు’ అన్నామనుకోండి.. మనల్నీ ‘మీరు’ అంటాడు..
మనం ‘నువ్వు’ అన్నామనుకోండి.. మనల్ని కూడా ‘నువ్వు’ అంటాడు..
మనం ‘ఏరా’ అన్నామనుకోండి.. మనల్నీ ‘ఏరా’ అంటాడు సింపుల్ గా..
ఇంకేమీ ఆలోచించడు.. అది అతని నేచర్..
అందుకే నేను ‘నువ్వు’ అనడం దగ్గరే ఆపేశాను!.
-మోహన్ గోటేటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రేక్షకుడి సహనంపై ‘సవారీ… మసాలాలు ఎక్కువై రుచి కుదరని ‘బిర్యానీ’…
  • జేడీ చక్రవర్తి ఎవరికీ అర్థం కాడు – అర్థమైతే ఆ దోస్తీ వదలలేం…
  • దిక్కుమాలిన సంత – యాణ్నుంచి పట్టుకొచ్చార్రా వీళ్లను ?
  • ఆ సంధ్య థియేటరే దేనికి..? సొంత హైటెక్ థియేటర్లు ఉన్నాయిగా..!!
  • నాని పైత్యం ! పెంటపెంట… జవహర్‌నగర్ డంపింగ్ యార్డు దుర్వాసన !!
  • ఒవైసీ చెప్పిన ఈ పేరు వెనుక ఓ చరిత్ర’… అసలెవరు ఈ ‘మౌల్వీ?
  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!
  • చిన్న సినిమా అంటే చిన్నతనం కాదు… చిల్లరతనం అసలే కాదమ్మా…
  • హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!
  • చచ్చీ చెడీ… చావు దప్పి… ఓ అవమానకరమైన విజయం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions