Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !

September 3, 2026 by M S R

.

శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ? లేక రాంచరణ్? ఏదో ఓ సినిమాలో గెస్టుగా కాదు, ఫుల్ లెంత్… ఎవరు సూటవుతారు, ఎవరు ఈ పాత్ర చేస్తున్నారు..? కాస్త వివరాల్లోకి వెళ్దాం…

హనుమాన్ అంశ్ అనే సినిమా కోటిన్నరతో తీస్తే… 70, 80 కోట్ల వరకూ పరుగెడుతున్న తీరు చెప్పుకున్నాం కదా… మౌత్ టాక్, కథలో బలం ప్రధాన కారణాలు, సీక్వెల్‌కు రెడీ అయిపోతున్నారు నిర్మాతలు… యాపిల్, మెటా బాసులతోపాటు హాలీవుడ్ తారలు కూడా సందర్శించే ఓ ఆశ్రమం, ఆ గురువు నీమ్ కరోలీ బాబా గురించిన కథ అది…

Ads

సేమ్, ఇలాంటిదే మరో సినిమా… పేరు ‘లాలో’… మొదటి రోజు జస్ట్, 5 లక్షల వసూళ్లు… కానీ 50 లక్షలతోనే ఆ సినిమాను గుజరాతీ భాషలో తీశారు… అది ఏకంగా 100 కోట్ల దాకా వసూళ్లు సాధించింది తరువాత… స్టార్ లేడు… భారీ ప్రచారం లేదు… మొదట్లో ప్రేక్షకులే లేరు! మరి..?

మౌత్ టాక్… కథలో దమ్ము… ఇవీ కారణాలు… అసలు సినిమా అంటే భారీ బడ్జెట్ కావాలి… స్టార్ హీరో ఉండాలి… వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేయాలి… మొదటి రోజే థియేటర్లు నిండిపోవాలి… ఇవన్నీ సినిమా విజయానికి కొలమానాలుగా మారిపోయిన రోజుల్లో… గుజరాత్ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమా మాత్రం ఈ లెక్కలన్నింటినీ తలకిందులు చేసింది.

ఈ  ‘లాలో – కృష్ణ సదా సహాయతే’ గుజరాతీ సినిమా చరిత్రలోనే తొలి రూ.100 కోట్ల సినిమా. అసలు ‘లాలో’ కథ ఏమిటి? కథానాయకుడు లాలో… ఓ సాధారణ ఆటోరిక్షా డ్రైవర్. డబ్బు కష్టాలు… వ్యక్తిగత జీవితంలోని సమస్యలు… గతం తాలూకు బాధలు… తప్పులు… పశ్చాత్తాపం… ఇవన్నీ అతడి జీవితాన్ని వెంటాడుతుంటాయి.

ఓ సందర్భంలో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఓ ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన లాలో అక్కడే చిక్కుకుపోతాడు. బయటకు వెళ్లడానికి మార్గం లేదు. తన పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్న సమయంలో… అతడి ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. అక్కడి నుంచి సినిమా మరో మలుపు తీసుకుంటుంది.

కృష్ణుడు అతడికి అద్భుతాలు చేసి చూపించే దేవుడిగా కాకుండా… ఓ సాధారణ మనిషిలా అతడితో మాట్లాడతాడు. లాలో తన గతాన్ని ఎదుర్కొంటాడు. తాను చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుంటాడు. తన జీవితాన్ని తానే ఎలా నాశనం చేసుకున్నాడో అర్థం చేసుకుంటాడు. కృష్ణుడి మాటల ద్వారా భగవద్గీతలోని ఆలోచనలు అతడికి పరిచయమవుతాయి.

చివరకు లాలో బయటపడేది కేవలం ఆ ఫామ్‌హౌస్ నుంచి కాదు… తనలోని చీకటి నుంచి కూడా. ఇదే ఈ సినిమా అసలు పాయింట్. మరి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఎందుకైంది? ఇక్కడే ‘లాలో’ కథ ఆసక్తికరంగా మారుతుంది.

దర్శకుడు అంకిత్ సఖియా స్వయంగా చెప్పిన మాటల్లోనే దీని మంత్రం కనిపిస్తుంది. తాను మొదట పెద్ద బడ్జెట్ సినిమా చేయాలనుకున్నానని… అది ముందుకు వెళ్లకపోవడంతో “ఒక లొకేషన్, ఒక నటుడు, తక్కువ వనరులతో సినిమా ఎలా చేయాలి?” అని ఆలోచించి ఈ కథను రాశానని ఆయన చెప్పారు.

అంటే… బడ్జెట్‌కు తగ్గట్టుగా కథ రాయలేదు. కథను చెప్పడానికి అవసరమైనంత మాత్రమే ఖర్చు పెట్టాడు. ఒక ఆటో డ్రైవర్. ఒక ఫామ్‌హౌస్. కొంతమంది నటులు. ఒక కెమెరా. మిగతాదంతా కథ!

ఇది మన దగ్గర చాలామంది మేకర్లకు చెప్పాల్సిన పాఠం. ‘దేవుడి సినిమా’ అయినా… మూఢనమ్మకాల సినిమా కాదు! ఇది మరో ముఖ్యమైన విషయం. కృష్ణుడిని సినిమాలో చూపించారంటే ఇది పూర్తిగా భక్తి సినిమా అనుకుంటే పొరపాటే. దర్శకుడు అంకిత్ సఖియా స్పష్టంగా చెప్పాడు. తాము మూఢనమ్మకాలను చూపించలేదని.

కృష్ణుడిని సాధారణ మనిషిలా చూపిస్తూ, లాలో జీవితంలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా కథను చెప్పామని ఆయన వివరించాడు. సినిమా భగవద్గీత బోధనల ఆధారంగా ఉన్నప్పటికీ, “బ్లైండ్ ఫెయిత్”ను ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదని చెప్పాడు. అందుకే ఈ సినిమా భక్తుడికి మాత్రమే కాదు… తన జీవితంలో ఏదో ఒక దశలో ఓడిపోయిన ప్రతి మనిషికి కనెక్ట్ అయింది.

ప్రేక్షకుడు ఇందులో తనను తాను చూసుకున్నాడు! లాలో ఆటో డ్రైవర్. అతడు కోటీశ్వరుడు కాదు. పెద్ద ఉద్యోగం లేదు. హీరోయిజం లేదు. సూపర్ పవర్స్ లేవు. అతడికి ఉన్నది సమస్యలే. అందుకే తెరపై లాలో కనిపించినప్పుడు… “ఇది మనిషి కథ” అనిపించింది.

ఎవరికో డబ్బు సమస్య. ఎవరికో కుటుంబ సమస్య. ఎవరికో గతం. ఎవరికో చేసిన తప్పుల పశ్చాత్తాపం. ఎవరికో జీవితం మీదే విరక్తి. అందరికీ ఒకే ప్రశ్న. “ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి?” లాలో కథ ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంది.

laalo

అసలు ‘కృష్ణుడు’ ఎవరు? ఇక్కడే సినిమా విజయానికి సంబంధించిన అద్భుతమైన మరో కోణం ఉంది. దర్శకుడు అంకిత్ సఖియా చెప్పిన మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. “కృష్ణుడు ఏం చేయగలడు?” అని చాలామంది అడిగారని… తన సమాధానం మాత్రం “ఇదే కృష్ణుడు చేయగలిగింది” అన్నట్లుగా ఉందని చెప్పారు.

కానీ వెంటనే ఆయన మరో మాట అన్నారు. “అసలు కృష్ణుడు ప్రేక్షకులే.” ఎందుకంటే సినిమా చూసిన ఒక్క వ్యక్తి మరో 50, 100 మందికి చెప్పాడు. “ఈ సినిమా తప్పకుండా చూడాలి.” అదే మౌత్ టాక్‌ను విపరీతంగా పెంచింది. అదే ‘లాలో’ బాక్సాఫీస్ మిరాకిల్.

ప్రచారం నిర్మాత చేయలేదు. ప్రేక్షకుడే చేశాడు. ₹50 లక్షల సినిమా కోసం కోట్ల రూపాయల ప్రమోషన్ అవసరం లేకుండా పోయింది. ఇదే ‘లాలో’ ఇచ్చిన అతిపెద్ద ఇండస్ట్రీ పాఠం. సినిమాకు బడ్జెట్ అవసరం. కానీ ప్రేక్షకుడిని థియేటర్‌కు తీసుకురావడానికి బడ్జెట్ ఒక్కటే సరిపోదు. స్టార్‌డమ్ ఉండొచ్చు. భారీ సెట్లు ఉండొచ్చు. వందల కోట్ల విజువల్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు.

కానీ… “ఈ సినిమా తప్పకుండా చూడాలి” అని ఒక ప్రేక్షకుడు మరో ప్రేక్షకుడికి చెప్పేంత బలమైన కారణం లేకపోతే… ఆ ఖర్చంతా వృథానే. ‘లాలో’ దగ్గర ఆ కారణం ఉంది. రూ.50 లక్షలు… రూ.100 కోట్లు… లెక్క చూస్తే ఇది నిజంగానే పిచ్చెక్కించే నంబర్.

ఇప్పుడు తెలుగులోకి కూడా వస్తోంది! ‘లాలో’ విజయాన్ని చూసి తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్‌లో శ్రీకృష్ణుడి పాత్రను విజయ్ దేవరకొండ పోషించనున్నట్టు వార్తలు… తాజాగా రాంచరణ్ పేరు వినిపిస్తోంది… కాకపోతే ఇక్కడ ఓ సమస్య…

తెలుగు స్టార్ హీరో అనగానే ఇమేజ్ ప్రభావం పడుతుంది… రకరకాల కమర్షియల్ వాల్యూస్ పేరిట సహజమైన సినిమాను కాస్తా అసహజమైన రీతిలో చుట్టేస్తారు… అలా తీస్తే ఈ సినిమా ప్రేక్షకుడిని కనెక్ట్ కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…
  • Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!
  • ఇది మునుపటి ఇండియా కాదు ! రెండు బలమైన తాజా తార్కాణాలు !!
  • నెహ్రూకు ఓ ఆదివాసీ భార్య… ఆమెది కలిచివేసే ఓ విషాద కథ…
  • ప్రశాంత్ రెడ్డి ! అంతటి కేసీయార్‌కే హితవు చెప్పేంత ‘పెద్దరికమా !?
  • ఎడారిలో దారితప్పిన ఓ మనిషి… దూరంగా కనిపిస్తున్న ఓ శిథిల గుడిసె…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions