.
Mohammed Rafee …. ఈ ఎన్నికల్లో ఇద్దరు నన్ను అమితంగా ఆకర్షించారు. ఒకరు డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, ఇంకొకరు మన తెలుగు తేజం మల్లాడి కృష్ణారావు! మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలోని యానాం నుంచి వరసగా ఆరవ సారి విజయకేతనం ఎగురవేశారు. తమిళిసై నియోజకవర్గాలు మారుస్తూ ఈసారి తమిళనాడులోని మైలాపూర్ నుంచి పోటీ చేసి ఏడవ సారి ఓటమి చవిచూశారు.
మల్లాడి కృష్ణారావు చిన్ననాటి నుంచి సేవాభావంతో పెరిగారు. సొంత భూములు పేదలకు పంచిపెట్టారు! బ్లడ్ బ్యాంకులు, అనాధ, వృద్ధ ఆశ్రమాలు, పేదలకు వైద్య సౌకర్యాలు ఇలా ఎనలేని సేవ నిరంతరం చేస్తూనే వున్నారు! 1996లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కృష్ణారావు తొలుత రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వరసగా గెలుస్తూ వస్తున్నారు.
Ads
- ఆయన ప్రచారానికి వస్తే “ఎండలో తిరగవద్దు, ఆరోగ్యం జాగ్రత్త మిమ్మల్ని గెలిపిస్తాం” అంటూ ప్రజలే ఎదురు హామీలు ఇచ్చినట్లు సమాచారం! ఆ హామీకీ తగ్గట్లుగా ఆయన్ని మళ్ళీ గెలిపించారు! ఇది ఆయనకు ఆరవ విజయం!
ఇక మన గవర్నర్ గా పని చేసిన తమిళిసై సౌందర్ రాజన్ కు ఒక్కసారి అయినా ఎమ్మెల్యే కావాలని, ఎంపి కావాలనేది చాలా కాలం నుంచి కలగానే మిగిలిపోతోంది! ఐదు సార్లు ఓడిపోయారనే ఉద్దేశ్యంతో ఆమె కష్టాన్ని పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బిజెపి తెలంగాణ గవర్నర్ గా నియమించింది. కొన్నాళ్ళు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనంగా సేవలు అందించారు.
హడావిడిగా పదవీ విరమణ చేసి కిషన్ రెడ్డి నాయకత్వంలో తిరిగి బిజెపిలో చేరి 2024 ఎన్నికల్లో ఆరవ సారి పోటీ చేసి ఓడిపోయారు. ఏడవ సారి మైలాపూర్ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు. అయినా ప్రజలు కనికరించలేదు. ఓటమి తప్పలేదు! ఏడవ సారి 28 వేల భారీ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థిగా ఆమె గురించి చర్చించుకుంటున్నారు.
తీవ్రమైన ఎండలో సైతం ఆమె ఈసారి చావో రేవో అన్నట్లు ఉధృతంగా ప్రచారం చేసినా పరాభవం తప్పలేదు. 2005లో రాధాపురం, 2009లో చెన్నై నార్త్, 2011లో వెలచ్చేరి, 2016 విరుగంపాక్కం, 2019 తూత్తుకుడి, 2024 చెన్నై సౌత్, ఇప్పుడు మైలాపూర్ లో అలుపెరుగని పోరాటం చేశారు. ఇలా వరసగా నియోజకవర్గాలు మార్చడం ఒక కారణమైతే, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పని చేసిన ఆమె తండ్రి వారసత్వాన్ని కాదని బిజెపిలో చేరడం కూడా ఇంకో కారణమని విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి ఆమె డాక్టర్ అయినప్పటికీ విద్యార్థి రాజకీయాల్లోను చురుగ్గా వరస గెలుపులతో తన నాయకత్వాన్ని చాటుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోనే ఆమెకు గెలుపు అసాధ్యంగా మారింది! అయినా పట్టు వదిలే ప్రసక్తి లేదని, బిజెపిని తమిళనాడులో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకు రావడం, చట్ట సభల్లోకి తాను అడుగు పెట్టడం లక్ష్యంగా కృషి చేస్తామని ఆమె ప్రకటించారు. – డా. మహ్మద్ రఫీ
Share this Article