.
Subramanyam Dogiparthi …. చినుకు చినుకు అందెలతో
చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని
జారవిడిచి ఒళ్ళు మరచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు చల్లింది సింగారంగా
జొన్నవిత్తుల ఏ మాయ చేసాడో కానీ ఈ సినిమా సక్సెస్ స్టోరీలో ఈ పాటకు చాలా పాత్ర ఉంది . వాన జాణ , నీళ్ళ పూలు !! ఏం పదప్రయోగాలండి బాబూ !! ఇది సాహిత్యపరంగా . ఇంకా చాలా పుటలు ఉన్నాయి ఈ సక్సెస్ పుస్తకంలో .
Ads
అది బాబూమోహన్ , సౌందర్యల మీద ! వినేవారికి ఆశ్చర్యం కలుగుతుంది . కమేడియన్ , హీరోయిన్ల మీద ఇంతటి రొమాంటిక్ సాంగా అని . ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ పాట వినేందుకు/ వినేందుకే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుక్కొని పాట టైంకు వచ్చేవారట .
ఓ ఇంటర్వ్యూలో బాబూమోహనే చెప్పారు . బహుశా హైదరాబాద్ థియేటర్ అయిఉండవచ్చు . మార్నింగ్ షోల మీద 365 రోజుల పోస్టర్ ఆడి ఉంటుంది . ఆఖరి రోజున బాబూమోహన్ ఆ థియేటరుకు వెళ్ళాడట . హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టబడిందట . థియేటర్లో వంద మంది కన్నా ఎక్కువ మంది లేరట . ఇదంతా ఏంటని మేనేజర్ని అడిగితే కాసేపు ఆగండి అన్నాడట . ఈ పాట టైంకు హాల్ నిండిపోయిందట .
మనం తినే ప్రతీ గింజ పైన మన పేరు ఉంటుందట . లేకపోతే మన దాకా రాదట . అలాగే ఈ పాట రాజేంద్రప్రసాద్ , సౌందర్యల మీద తీయవలసినదట . రాజేంద్రప్రసాదుకు టైం లేకపోవటంతో చివర్లో బాబూమోహన్ని పెట్టి తీసారట . మరో కధ కూడా చక్కర్లలో ఉంది . రాజేంద్రప్రసాద్ , కృష్ణారెడ్డిల మధ్య ego clashes రావటంతో పంతానికి డైలాగ్స్ డబ్బింగ్ పూర్తయ్యాక ఈ పాటను బాబూమోహన్ని పెట్టి తీసారట . ఇవన్నీ ఈ ఒక్క పాట చుట్టూ ఉన్న కధలు .
(కృష్ణారెడ్డిని రాజేంద్ర ప్రసాద్ తన అహంకారంతో ఎంత ఏడిపించాడో కృష్ణారెడ్డే స్వయంగా వివరించాడు ఓ ఇంటర్వ్యూలో… బాబూమోహన్ పక్కన సాంగ్ చేస్తే నీ కెరీర్ ఖతం అని కూడా సౌందర్యను బెదిరించారు అప్పట్లో పలువురు… అబ్బో, రాజేంద్ర ప్రసాద్ మామూలోడు కాదు, తనూ మాయగాడే సారీ, మాయలోడే… ఇదీ ముచ్చట క్లారిటీ…. ఇదుగో ఆ ఇంటర్వ్యూ లింక్…)
అదంతా ఏమయినా 1993 జూలైలో వచ్చిన ఈ మాయలోడు సినిమా బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ గా నిలిచింది . కృష్ణారెడ్డి , రాజేంద్రప్రసాద్ , సౌందర్య కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ఇది . మొదటిది రాజేంద్రుడు గజేంద్రుడు .
కధను తయారు చేసిన నిర్మాత అచ్చిరెడ్డిని , దర్శకుడు యస్ వి కృష్ణారెడ్డిని ముందుగా మెచ్చుకోవాలి . చాలా చిక్కగా నేసుకున్నారు . కనికట్టు మాస్టారిగా రాజేంద్రప్రసాద్ పాత్రని బాగా మలిచారు . కాస్ట్యూమ్స్ తో సహా . ఇంక సంభాషణలు . హాస్యరస సినిమాలకు అద్భుతమైన డైలాగులను అందించే మా గుంటూరు వారయిన దివాకర్ బాబు గారు చాలా బాగా వ్రాసారు .
ఈ సినిమాలో మూడు కాంబోలు ఉన్నాయి . ఒకటి రాజేంద్రప్రసాద్- గుండు హనుమంతరావు , రెండోది కోట శ్రీనివాసరావు- బాబూమోహన్ , మూడవది బ్రహ్మానందం- ఆలీ . వీరి మధ్య డైలాగులు సినిమాను వేగంగా ముందుకు నడిపిస్తాయి .
అలాగే రాజేంద్రప్రసాద్ , బేబీ నికిత , నిర్మలమ్మ , గుండు హనుమంతరావుల మధ్య చాలా ఎమోషనల్ సీన్లు ఉన్నాయి . ఆ సీన్లలో కూడా చక్కటి డైలాగులను వ్రాసారు . కోట శ్రీనివాసరావు సీరియస్ కం హిలేరియస్ విలన్ . ఫాస్ట్ ఫాస్టుగా డైలాగ్స్ డెలివరీ శైలి మారుతుంటుంది . దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు .
కధ టూకీగా ఏంటంటే కోట శ్రీనివాసరావు ఆస్తి కోసం చెల్లెల్ని , బావను చంపేస్తాడు . వాళ్ళ బిడ్డ పారిపోయి గారడీ ఆటగాడు రాజేంద్రప్రసాదుకు దొరుకుతుంది . వారిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది . దురదృష్టవశాత్తు పాప కంటి చూపు పోతుంది . ఆ సర్జరీ కొరకు తాను దాచుకున్న డబ్బుని ఇవ్వమని పద్మనాభాన్ని అడిగితే తన కూతురు సౌందర్యని ప్రేమించటం ఆపితే ఇస్తానంటాడు .
మాటా మాటా పెరిగి రుబాబుగా డబ్బు తీసుకుని రాజేంద్రప్రసాద్ వెళ్ళిపోతాడు . దానిని అవకాశంగా తీసుకుని కోట శ్రీనివాసరావు పద్మనాభాన్ని చంపేసి ఆ నేరాన్ని రాజేంద్రప్రసాద్ మీద మోపి జైలుకు పంపుతాడు . పాప సర్జరీ ఆగిపోతుంది .
పాప సంరక్షణ నిర్మలమ్మ , హనుమంతరావులకు షిఫ్ట్ అవుతుంది . ఇక్కడ నుండి విలన్ , అతని గేంగ్ పాప కోసం వెంటపడటం , పాపని రాజేంద్రప్రసాద్ కాపాడుకుంటూ ఉండటం , క్లైమాక్సులో కోట కోర్ట్ ముందు తానే హత్యలను చేసానని ఒప్పుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .
వెరైటీ కధ . హీరో కనికట్టు , గారడీ విద్యల్లో నిష్ణాతుడు . వాటితో కావలసినంత హాస్యాన్ని పండించుకున్నారు . క్లైమాక్సులో జైల్లో మాయం కావటం , పాప సంరక్షణ విలన్ల శిక్షణ కాస్త fantasize చేసారు . ప్రేక్షకులకు నచ్చింది .
కనక వర్షం కురిపించారు . రెండు నంది అవార్డులు కూడా వచ్చాయి . బేబీ నికితకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ , సినిమాకు ఉత్తమ కుటుంబ కధా చిత్రం అవార్డు వచ్చాయి . చాలా సెంటర్లలో వంద రోజులు , కొన్ని చోట్ల రజతోత్సవం , కొన్ని చోట్ల 252 రోజులు , ఒక చోట 365 రోజులు ఆడింది . బహుశా వీటిల్లో చాలా షిఫ్టుల మీద , మార్నింగ్ షో లతో రన్ అయో ఉంటుంది . మొత్తం మీద బ్లాక్ బస్టరని చెప్పుకోవచ్చు .
సినిమాకు యస్ వి కృష్ణారెడ్డే సంగీతాన్ని కూడా నిర్ళహించాడు . BGM చాలా బాగుంటుంది . ఆ తర్వాత పాటలకు కూడా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . నీ మాయలోడిని నేనే , చలాకి చిలిపి అంటూ సాగే డ్యూయెట్లు రాజేంద్రప్రసాద్ , సౌందర్య మీద బాగా చిత్రీకరించబడ్డాయి .
ఛూ మంతర్ కాళీ రోడ్ మీద గారడీ పాట హుషారుగా ఉంటుంది . కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం , బిబూమోహన్ , రౌడీల మీద సాగే ఉడతా ఉడతా ఊఛ్ ఎక్కడికెళతొవోఛ్ చాలా హిలేరియస్ గా ఉంటుంది .
భువనచంద్ర , సిరివెన్నెల , జొన్నవిత్తుల , గూడూరు విశ్వనాధ శాస్త్రి మంచి పాటలను అందించారు . బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు .
సినిమాలో బాబూమోహన్ ఎముకలు కనపడటం , ఆలీ నాలిక బయటపెట్టి బ్రహ్మానందాన్ని అల్లరిపెట్టడం హాస్యాన్ని అందించాయి . ఇతర పాత్రల్లో శ్రీలక్ష్మి తదితరులు నటించారు.
ఆరోగ్యకరమైన వినోదాత్మక సినిమా . బోర్ లేకుండా సాగిపోతుంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడండి . చూసినవారు టైం ఉన్నప్పుడు కాలక్షేపానికి చూడొచ్చు . An excellent emotional , sentimental entertainer .
Share this Article