.
మా మామ తరచూ చెబుతుంటాడు… ‘‘వర్తమాన సమాజంలో మనల్ని కన్నవాళ్లు, మనం కన్నవాళ్లు తప్ప ఇంకెవరూ… ఎవరికీ ఎవరూ ఏమీ కారు…’’ మిగతావన్నీ అవసరార్థం బంధాలే అని… కానీ అదీ తప్పే… కన్నవాళ్ల చేతుల్లో ఖతం అవుతున్నారు, కన్నవాళ్లూ హతం అయిపోతున్నారు… మానవబంధాలు కాదు, నెత్తుటి బంధాలూ నమ్మలేం ఇప్పుడు…
రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగుచూసిన ఒక ఘటన మరీ క్రూయల్… ఇది దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొదట అందరూ దీన్ని సాధారణ రోడ్డు ప్రమాదంగానే నమ్మారు. కానీ, లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు తెలిసిన నిజాలు చూసి విస్మయానికి గురయ్యారు. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లే అడ్డుగా మారిందన్న దుర్బుద్ధితో కూతురే ఈ దారుణానికి తెరలేపింది.
Ads
అసలేం జరిగింది? జూలై 3వ తేదీన నీరజ్ శర్మ (45) తన దివ్యాంగ కుమారుడిని కోచింగ్‌కు తీసుకెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ప్రతాప్‌నగర్ ప్రాంతంలో అతి వేగంగా వచ్చిన ఒక స్కార్పియో కారు వారిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నీరజ్ సుమారు వంద అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు వేగం గంటకు 130 కిలోమీటర్లు ఉన్నట్లు తేలింది.
కుట్ర వెనుక అసలు కారణాలు… నీరజ్ భర్త మరణించడంతో కారుణ్య నియామకం కింద ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగం తల్లికి కాకుండా తనకు రావాలని కూతురు ఆయుషి తీవ్రంగా ఆశించింది. తల్లి అడ్డుగా ఉందనే కోపంతో ఆమెపై కక్ష పెంచుకుంది. ఉద్యోగంతో పాటు కుటుంబ ఆస్తులను కూడా పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలనే దురాశ ఈ హత్యకు మరో ప్రధాన కారణమని తేలింది.
మూడు నెలల పక్కా ప్లాన్… ఇది ఆకస్మికంగా జరిగిన ప్రమాదం కాదని, ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు తేల్చారు. కూతురు ఆయుషి, ఆమె పెదనాన్న మోహన్ స్వరూప్, బంధువు బలరామ్ కలిసి సుమారు మూడు నెలలుగా ఈ హత్యకు ప్రణాళిక వేసారు.
ఏడు లక్షల సుపారీ… నీరజ్‌ను హత్య చేయడానికి హేమంత్ శర్మ అనే వ్యక్తికి ఏడు లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు. హేమంత్ మరో నలుగురితో కలిసి పథకం ప్రకారం స్కార్పియో కారుతో నీరజ్‌ను ఢీకొట్టి, దానిని యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
తమ్ముడి అనుమానంతో బయటపడిన నిజాలు తన కూతురు ప్రవర్తన సరిగ్గా లేదని, తన ప్రాణాలకు ముప్పు ఉందని నీరజ్ తన సోదరుడు రాకేష్ కుమార్‌కు ముందే చెప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత రాకేష్‌కు పోలీసులపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఇది ముమ్మాటికీ హత్యేనని రుజువైంది.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూతురు ఆయుషితో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. కన్నపేమను మరిచి డబ్బు, ఉద్యోగం కోసం ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం మానవ సంబంధాలకే మచ్చ తెస్తోంది… సో, క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే!
Share this Article