Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘టైటానిక్‌ ’తర్వాత ఓ చారిత్రక నేపథ్యంపై ఓ అందమైన ప్రేమకథ!

June 23, 2026 by M S R

.

Mohammed Khadeerbabu …. మనిషి కనీస వాగ్దానం ‘మై వాపస్‌ ఆవూంగా’ ….. ఆ పాకిస్తాన్‌ పట్టణంలో ఆ రాత్రి అల్లరి మూకలు చెలరేగి, అత్యాచారాలకు తెగబడటానికి ఆ ఇంటిలోకి అడుగుపెట్టినప్పుడు, కెమెరా ఆ కటిక చీకటిలో కూడా అందంగా, గుబురుగా పూసిన గులాబీ చెట్టును చూపిస్తుంది. అంతటితో సంతృప్తి చెందక, నేపథ్యంలో వినిపిస్తున్న ఆర్తనాదాలను లెక్కచేయక, మరో గుబురు గులాబీపొదను చూపిస్తుంది. మౌనంగా ఉన్న, పూర్తిగా వికసించి ఉన్న గులాబీపూలు.

‘ఏ గుల్‌సితా హమారా’ అన్నాడు కవి ఇక్బాల్‌ మన దేశాన్ని. పూలవనం ఇది. ఆ రాత్రి ఆ పూలవనం ఛిద్రమౌతోంది. చీలిపోతోంది. కాలిపోతోంది. కన్నీరుగా కారిపోతోంది.
‘అప్పుడు ఏం జరిగింది తాతయ్యా?’ అని మూడోతరంలో మనవడు అడిగితే తాతయ్య సమాధానం చెప్పడు. మళ్లీ మళ్లీ అడిగితే ‘ఏం చెప్పనురా. ఏం చెప్పినా మీరు దానిలో ద్వేషాన్ని వెతుకుతారు. ద్వేషాన్ని…’ అన్ని నిస్సహాయంగా మూల్గుతాడు.

Ads

చరిత్రను తవ్వేది ద్వేషాన్ని వెతకడానికీ నింపుకోవడానికీ కాదు. అలాంటిది మరోసారి జరక్కుండా మస్తిష్కం కడుక్కోవడానికి.
దేశవిభజనలో హిందువా ముస్లీమా సరే. సిక్కుల జీవితం ఏమైంది? వాళ్ల గుండెల మీద దొర్లిన కొండలు ఏమిటి? శిక్కుల సంస్కృతికి ఆయువుపట్టయిన లాహోర్, రావిల్పిండి, ముల్తాన్‌…. బుర్రా బుద్ధీ లేని అడ్డగీత వల్ల అటు వెళ్లిపోయాయి. ఐదునదుల గడ్డలోని మూడు– రావి, చినాబ్, జీలం అటు వెళ్లిపోయాయి. వారి ఆధ్యాత్మిక కేంద్రాలు అటు కొన్ని ఇటు కొన్ని. రక్త సంబంధాలు అటు కొన్ని ఇటు కొన్ని. ముక్కలైన ప్రేమ హృదయాలు? అటు కొన్ని ఇటు కొన్ని.

స్వతంత్రం రావడానికి కొద్దిగా ముందు…. కాలేజీలు కళకళలాడుతున్న ఆ ఊరిలో… హిందూ ముస్లిం సిక్కులు స్నేహపూర్వకంగా మసలుతున్న ఆ పాకిస్తాన్‌ పట్టణంలో ఒక సిక్కుల కుర్రవాడు, ముస్లిం అమ్మాయి… ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం అంటే? ఆ అమ్మాయి సమీపంగా కూచుంటే వాడి గుండె ఆగితుంది. వాడు కాసేపు కనిపించకపోతే ఆ అమ్మాయి ప్రాణాలు ఒదిలిపెట్టేస్తుంది. ఇద్దరివీ సంపన్న కుటుంబాలు. మతాలు వేరు కావచ్చు. అయితే మాత్రం? చదువుకున్న పిల్లలకు అవేం అడ్డుకావు.
మరేమిటి అడ్డం?

అహం. జాతుల అహం… నేతల అహం… ఆధిపత్యాల అహం.
కాలేజీ వేడుకలో అప్పుడే అందిన వార్త విని విషణ్ణవదనుడైన ప్రిన్సిపాల్‌ ‘శోకతప్త హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నాను. దేశం రెండు ముక్కలు కాబోతోంది. బెంగాల్, పంజాబ్‌ల గుండెలను చీల్చనున్నారు’…. అంటాడు.
ప్రేమికులకు ఇదంతా అర్థం కాదు. వారికి తెలిసింది ఏమిటి? కళ్లు చూసుకుంటే నవ్వే పెదాలు. హృదయాన్ని గాలిస్తే పలికే కవిత్వపు తునకలు. ఆడు.. పాడు… నర్తించు… యవ్వనపు హేల…

మనిషిలోని మృగం ఎప్పుడూ ఒకటి చేస్తూ ఉంటుంది. ‘వాడు’ అనే విషం తయారు చేస్తూ ఉంటుంది. ‘వాడు వద్దు’, ‘వాడు ఉంటే ప్రమాదం’, ‘వాడు పోతే అంతా మనదే’, ‘వాడి పూర్వీకులు ఎప్పుడో మన పూర్వీకులను ఏదో చేశారు’, ‘వాడి మతం వేరు’…. భయం తయారీ. భయం ఫ్యాక్టరీ.
భయపడ్డ మనిషి ఎంతటి క్రూరత్వానికైనా అంగీకరిస్తాడు. అది ప్రాథమిక సూత్రం.

ఆగస్టు 14న పాకిస్తాన్‌కు, 15న ఇండియాకు స్వతంత్రం ప్రకటించి, దేశ విభజన రేఖను ఆగస్టు 17న రుద్ది, ఈ రెండు రోజుల గ్యాప్‌లో బ్రిటిష్‌వారు తుర్రుమని, ఇక్కడ భారతీయులను రక్త సముద్రాల్లో ముంచాక తెగి పడిన తలలు ఎన్ని? కత్తులకు చిక్కిన మానాలు ఎన్ని?
మొదట అందరూ ఒకటి రెండు రోజుల గలాటా అనుకున్నారు. కాదు. ఈ గలాటా శాశ్వతం. ఈ సరిహద్దు శాశ్వతం. ఈ చీకటి శాశ్వతం. కాలిపోయిన ఈ పూలతోట ఆనవాలు శాశ్వతం. అటువైపు మిగిలిపోయిన అమ్మాయి… ఇటు వైపుకు వెలివేయబడ్డ అబ్బాయి శాశ్వతం.

ఆ అర్ధరాత్రి క్షతగాత్రులు, మృతదేహాలు నిండిన రైలులో ఎక్కిన అబ్బాయి అమృతసర్‌ వైపు రైలు సాగిపోతుంటే, ఆ మసక వెలుతురులో, నింగి సాక్షిగా, చీకటి సాక్షిగా, గాలి సాక్షిగా ఒక మాట ఇస్తాడు ‘నేను వెళ్లిపోవడం లేదు. తిరిగి వస్తాను నీ కోసం’….
అది జరగలేదు. 95 ఏళ్లు వచ్చి, మరణశయ్య మీద ఉన్నా జరగ లేదు. పాకిస్తాన్‌లోని ప్రియురాలిని కలవనే లేదు.
ప్రాణం కొట్టకలాడుతూనే ఉంది. ముక్తివాంఛ అతణ్ణి బంధించి పెట్టి ఉంది.

నాటి ఆ సిక్కుల కుర్రవాడు, నేటి ఢిల్లీలోని 95 ఏళ్ల వృద్ధుడిగా ఆ జ్ఞాపకాల నుంచి, ప్రియురాలికి ఇచ్చిన వాగ్దానం నుంచి, ఇంటికీ సొంత భూమికీ దూరమైన వేదన నుంచి ఎలా విముక్తమయ్యాడో కన్నీటి ఉప్పదనంతో, అదుపులేని ఉద్వేగంతో చెప్పిన సినిమా ‘మై వాపస్‌ ఆవూంగా’.
ఇందులో దర్శకుడు మతవిద్వేషం కలిగిన వారిని హిందువులో, ముస్లింలో అనలేదు. ‘మార్స్‌ గ్రహం వాళ్లు’ అన్నాడు. ప్రేమమయమైన ఈ గ్రహంలో విద్వేషానికి చోటు లేదు. అటువంటి వాళ్లందరూ ఈ గ్రహానికి చెందిన వాళ్లు కాదు అన్నాడు. వాళ్లను హిట్లర్‌ వారసులుగా పోల్చాడు.

బహుశా ‘టైటానిక్‌ ’తర్వాత ఒక చారిత్రక నేపథ్యాన్ని ఇంత అందమైన ప్రేమకథగా మరెవరూ తీయలేదు.
నసిరుద్దీన్‌ షా అనే నటుడి ముందు ఎన్ని ఆస్కార్లు దిగదుడుపో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.
ఈ సినిమా చూశాక నాలోని ప్రేక్షకుడికి జలపాత స్నానం చేసిన భావన.
సీట్లలో నుంచి బరువుగా లేస్తున్న తోటి ప్రేక్షకులను చూశాను.
కళ్లలో అశ్రుధార.

ద్వేషం వద్దని చేయవలసిన కనీస వాగ్దాన తలంపు.
ఒక సినిమాకు ఇంత కన్నా ఏం కావాలి?
పి.ఎస్‌: ‘ముక్తి వాంఛ’… సంవత్సరం క్రితం నేను రాసిన ‘వేయి అంబరాలలో నొకటి’ కథలో వృద్ధురాలు ముక్తివాంఛ తీరక మరణించదు. నేను ఈ కథ రాస్తుండగా ఇంతియాజ్‌ అలీ ఈ సినిమా తీస్తున్నాడు. నేను రాశాను. అతను తీశాడు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • 60 వేల కొలువు – కొడుకును అమెరికాలో చదివించడం ఏమంత కష్టం?
  • ఇక్కడ ఒక్క బొద్దింక కూడా మాట్లాడదు ! ఎందుకో మీకు తెలుసా !?
  • గంజి వంపేద్దాం ! ఇప్పుడు WHO చెప్పిందే మన బామ్మలూ చెప్పారు !!
  • తెలంగాణపై ఇదీ ‘పెద్దన్న’ ప్రేమ ! పెద్ద దొర చెప్పినట్టే అడుగులు !!
  • మళ్లీ హృతిక్ – కంగనా పంచాయితీ – వీళ్ల పాత కథ తెలుసా మీకు !
  • హీరోయిన్ల రెమ్యునరేషన్లలో పాత రికార్డులన్నీ బద్దలు ! ఈమె టాప్ !!
  • ఎవరి తప్పో, ఎవరి పొరపాటో – నవ్వులపాలైంది మాత్రం పత్రికే !!
  • ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!
  • ఇండియన్ సినిమా మునుపెన్నడూ ఎరుగని అత్యంత భారీ పందెం !!
  • GenZ – ఇది జంతర్‌మంతర్ బ్యాచ్ కాదు – దేశం తలెత్తుకునే టార్చ్ బేరర్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions