Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కదిలే రైలులో కంట్రాక్ట్ కిిల్లర్ ! ఢాం ఢాం ! మరో ‘మొగుడు’ ఖతం !!

July 20, 2026 by M S R

.

భర్త కష్టపడి చదివించాడు… ఉన్నత ఉద్యోగంలో చూసి గర్వపడ్డాడు. కానీ అదే చదువు ఆమెకు వివేచనను, విజ్ఙతను, సంస్కారాన్ని నేర్పలేదు. చివరకు భర్తనే అంతం చేయాలనే క్రూరమైన ఆలోచనకు దారి తీసింది. సినిమా విలన్‌ను తలపించే ప్లాన్ వేసింది. కానీ పోలీసుల ముందు ఆ ప్లాన్ నిలవలేదు.

బీహార్‌లోని సుపాల్ డివిజన్‌లో సమిత అనే మహిళ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిచేస్తోంది. మంచి ఉద్యోగం, సమాజంలో గౌరవం, మంచి కుటుంబం… అన్నీ ఉన్నాయి. ఆమె భర్త దేవకుమార్ గుంజన్ రైల్వే శాఖలో ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నీషియన్. భార్యకు దగ్గరలోనే ఉంటూ, విధి నిర్వహణ కోసం ప్రతి నాలుగు రోజులకోసారి రైలులో ప్రయాణించేవాడు.

Ads

అంతా సాఫీగా సాగిపోతున్నట్టే కనిపించింది. కానీ ఆ కుటుంబంలోకి అజిత్ కుమార్ అలియాస్ ధీరజ్ ప్రవేశించిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. పరిచయం ప్రేమగా, ప్రేమ అక్రమ సంబంధంగా మారింది. ఆ బంధానికి భర్త అడ్డుగా కనిపించాడు. భర్తను తొలగిస్తేనే తమ జీవితానికి అడ్డంకి తొలగిపోతుందని సమిత నిర్ణయించుకుంది.

ఇక్కడే ఆమె వేసిన ప్లాన్ పోలీసులనే గందరగోళానికి గురి చేస్తుందని భావించింది.

“ఇంట్లో చంపితే స్థానిక పోలీసులు వెంటనే దర్యాప్తు చేస్తారు. రోడ్డుపై చంపినా తప్పించుకోవడం కష్టం. కానీ రన్నింగ్ ట్రైన్లో హత్య చేస్తే? అది రైల్వే పోలీసుల కేసా? స్థానిక పోలీసుల కేసా? అనే గందరగోళంలో దర్యాప్తు ఆలస్యమవుతుంది. అప్పటికే ఆధారాలు మాయమవుతాయి…”

ఇదే ఆలోచనతో ప్రియుడు ధీరజ్ చేత కాంట్రాక్ట్ కిల్లర్‌ను రంగంలోకి దించింది.

జూన్ 11.

ఎప్పటిలాగే దేవకుమార్ డ్యూటీకి వెళ్లేందుకు రైలెక్కాడు. రైలు వేగంగా దూసుకెళ్తోంది. అదే సమయంలో బోగీలోకి వచ్చిన కాంట్రాక్ట్ కిల్లర్ తుపాకీ బయటకు తీశాడు.

“ఢాం… ఢాం…”

ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే దేవకుమార్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. నిందితులు క్షణాల్లో అదృశ్యమయ్యారు.

ప్లాన్ సక్సెస్ అయిందని సమిత, ఆమె ప్రియుడు ఊపిరి పీల్చుకున్నారు. రైలులో జరిగిన హత్య కావడంతో కేసు చిక్కుముడిగా మారుతుందని, తాము సులభంగా తప్పించుకుంటామని భావించారు.

కానీ అక్కడే వారి లెక్క తప్పింది.

ఈ కేసును రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రైలు మార్గంలోని సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. చివరకు దేవకుమార్ భార్య సమిత కాల్ డేటా రికార్డులను పరిశీలించారు.

అక్కడే అసలు కథ బయటపడింది.

ఒకే నంబర్‌కు ఆమె తరచూ ఫోన్ చేయడం పోలీసులకు అనుమానం కలిగించింది. ఆ నంబర్ వెనుక ఉన్న వ్యక్తి ధీరజ్ అని తేలింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఇతర సాంకేతిక ఆధారాలు కలిపి చూసిన పోలీసులు సమితను అదుపులోకి తీసుకున్నారు.

మొదట ఏమీ తెలియనట్లు నటించిన సమిత… ‘గట్టి విచారణ’లో చివరకు తానే హత్యకు సూత్రధారిణి అని ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు ధీరజ్‌తో పాటు కాంట్రాక్ట్ కిల్లర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

రైల్వే అధికారులకే చిక్కు పెట్టాలని వేసిన ప్లాన్… చివరకు అదే పోలీసులకు నేరస్తుల వరకు దారి చూపించింది.

సినిమా క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా హత్యకు స్కెచ్ వేసిన ఆ ఉన్నతాధికారిణి… ఇప్పుడు ప్రియుడితో కలిసి జైలు ఊచలు లెక్కిస్తోంది.

ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంపత్య బంధంలో విభేదాలు వచ్చినప్పుడు చట్టబద్ధంగా విడిపోవడం ఒక మార్గం. కానీ ప్రాణాలు తీయడమే పరిష్కారమని భావించే మనస్తత్వం చివరకు జీవితాలను నాశనం చేస్తోంది. ఒకప్పుడు జీవిత భాగస్వామిగా ఉన్న వ్యక్తే… ఇప్పుడు హత్యకు లక్ష్యంగా మారుతున్న ఘటనలు పెరుగుతుండటం సమాజానికి ప్రమాదకర సంకేతమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?
  • ఓ చేతిలో మొబైల్, మరో చేతిలో మైక్ ఉంటే… జర్నలిస్టేనా..?!
  • సత్యశ్రీ సోదరి ! నటి కాదు… నిన్నటి విక్రమ్ రాకెట్ ప్రాజెక్టులో సైంటిస్టు !!
  • బాలీవుడ్ పొగరు vs దక్షిణాది ప్రతిభ … సాయిపల్లవిపై వివక్ష వ్యాఖ్యలు
  • కదిలే రైలులో కంట్రాక్ట్ కిిల్లర్ ! ఢాం ఢాం ! మరో ‘మొగుడు’ ఖతం !!
  • వరల్డ్ కప్ ఫైనల్ కవరేజీలో… ఆ పత్రికలు అర్జెంటీనాలాగే ఓటమిపాలు!!
  • ఈ తేజస్విని మరణం – సమాజం ఎదుట కొన్ని కీలక ప్రశ్నలు !!
  • వాంగ్‌చుక్ ప్రతి అడుగు వెనుక ఆమె… నిజమైన సహచరి !!
  • నిజం చెప్పాలంటే., కొన్నిసీన్లలో మమ్ముట్టి ముందు రజనీ తేలిపోయాడు..!
  • పెళ్లి లేకపోతేనే శాంతి ! అవివాహిత తారల్లో ఈ ‘పంచదార’ చిలక కూడా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions