Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక పోచారం… ఒక జీవన్‌రెడ్డి… జవాబుల్లేని కొన్ని ప్రశ్నలు…

April 15, 2026 by M S R

.

ఒక పోచారం శ్రీనివాసరెడ్డి… ఒక జీవన్ రెడ్డి… ఒకరిది నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం, మరొకరిది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా… ఒకరు 77 ఏళ్లు… మరొకరు 75 ఏళ్లు… ఇద్దరూ 40 ఏళ్లకుపైబడి రాజకీయ జీవితంలో ఉన్నారు… ఇద్దరి పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా చర్చనీయాంశం… గతంలో స్పీకర్‌గా పనిచేసీ, పోచారం గెలిచిన బీఆర్ఎస్‌ను వీడి, అధికారం కోసం కాంగ్రెస్ వైపు చేరి, ఇప్పుడిక కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉరుముతున్నాడు…

ఓ పరిమిత ప్రాంతం మీద ఇన్నేళ్ల తన పెత్తనపు కోట పగిలిపోతుందనే ఉక్రోషంతో జీవన్‌రెడ్డి ఇన్నేళ్లుగా పదే పదే అవకాశాలిచ్చినా సరే, తన కాంగ్రెస్‌ను వదిలేసి, ఇన్నేళ్ల తన ప్రబల ప్రత్యర్థి కేసీయార్ గడీలోకి వెళ్తున్నాడు… ఈ ఉదాహరణలు రాజకీయాల్లో నిబద్ధత, విధేయత, కృతజ్ఞత, ఆధిపత్య ధోరణి, కొత్తరక్తం రాకుండా అడ్డుకునే వైఖరి, పదవులు, అధికారం అనే అంశాలను చర్చకు పెడుతున్నాయి…

Ads

75 ఏళ్లొచ్చినా సరే, ఇంకా నేనే, నేనే… కొత్తవాళ్లు రావద్దనే వైఖరి… ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ… ఏదో ఒకటి పార్టీ అవకాశాలిస్తూనే ఉండాలనేది జీవన్ రెడ్డి ధోరణి… రాజ్యసభ కావాలట, కోడలికి ఎమ్మెల్యే టికెట్ కావాలట… నేనూ, నా కుటుంబం, ప్రతి అవకాశమూ మాకే అనే వైఖరి… సో, పార్టీ పట్ల విధేయత, నిబద్ధత, కృతజ్ఞత ఎగిరిపోయాయి…

చివరకు దేవుడు పంపించాడు అనే ఓ భ్రమాత్మక వ్యాఖ్యతో… సీనియర్లను చేర్చుకునీ, తరువాత పట్టించుకోకుండా వదిలేసే ఆ కేసీయార్‌ను ఆలింగనం చేసుకున్నాడు… జీవన్‌రెడ్డి ఏ నాయకుడినైతే తనకు జగిత్యాలలో థ్రెట్ అనుకుంటున్నాడో, తనను జగిత్యాలలో దింపిందే కేసీయార్… ఈ అసలు నిజాన్ని మరిచిపోతే ఎలా..? రేప్పొద్దున అవసరమైతే ఆ సంజయుడే కేసీయార్‌కు కావల్సినవాడు… ఈ జీవన్‌రెడ్డి కాదు… చేదుగా వినిపించినా ఇదే రియాలిటీ…

సీన్ కట్ చేస్తే…

పోచారం మొన్నమొన్ననే కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది… అధికారం ఎటుంటే అటే… మాకియవెల్లియన్ ధోరణి’ (Machiavellianism)… పైగా తను స్పీకర్‌గా కూడా చేశాడు, సరే, కాంగ్రెస్‌లోకి వచ్చాడు, బీఆర్ఎస్‌కు ఇక భవిష్యత్తు లేదనుకున్నాడో ఏమో, వచ్చాడు… వచ్చాక ఇప్పుడు తిరుగుబాటు… వెంటనే సిద్దపూర్ రిజర్వాయర్ పనులు చేసే కంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోతే నిరసనలకు దిగుతాడట… (మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తాడానే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి… వెళ్లినా వెళ్తాడు, కేసీయార్ మళ్లీ ఆలింగనం కూడా చేసుకుంటాడు… వస్తే వద్దంటాడా..?)

ఫోన్లు ఎత్తరేమిటి..? నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా..? సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పాడు అంటున్నాడు… ఇన్నేళ్ల రాజకీయంలో సిస్టం ఎలా పనిచేస్తుందో తెలిసీ, మరిచిపోయాడా..? ఎంతసేపూ కంట్రాక్టర్లు- డబ్బులేనా..? మర్యాద తెలియని పార్టీ అంటున్నాడు… ఏం తక్కువ చేసింది కాంగ్రెస్… వ్యవసాయ సలహాదారు అనే పోస్టుతో కేబినెట్ హోదా ఇచ్చింది…

ఒక విజయశాంతి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్య చేసిందంటే… సరే, ఆమె రాజకీయ విజ్ఞత, జ్ఙానపరిధి అంతే అనుకోవచ్చు… ఒక కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏదో అంటున్నాడంటే అది మంత్రి పదవి కోసం సాగే ఒత్తిడి, బెదిరింపు ప్రయత్నాలు, ఆశలు అనుకోవచ్చు… కానీ 75 ఏళ్ల వయస్సులో కూడా రాజకీయ పరిణతి కనబరచకపోతే ఎలా అనేది పోచారం, జీవన్‌రెడ్డిలపై వినిపించే విమర్శ…

పదే పదే మీరు, మీ పోస్టులు, మీ పనులు, మీ కుటుంబాలు… మరిక కొత్త వర్గాలు, కొత్త తరం ఎప్పుడు రావాలి రాజకీయాల్లోకి..? ఎంతసేపూ మీరేనా..? సరే, గతంతో పోలిస్తే ప్రస్తుతం పార్టీల పట్ల విధేయతల్లేవు, నిబద్ధతల్లేవు… అవకాశాలు, అధికారమే పరమావధి అనే ధోరణి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పార్టీలోనూ కనిపిస్తోంది… ఇది నూతన రాజకీయ ఒరవడి అనుకుందాం… కానీ ఈ వయసులో కూడా అవిధేయత, అధికార లాలస, ఆధిపత్య ధోరణి, అనైతికత అవసరమా అనేదే అసలు ప్రశ్న..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక పోచారం… ఒక జీవన్‌రెడ్డి… జవాబుల్లేని కొన్ని ప్రశ్నలు…
  • అంజలి కడమ్..! హఠాత్తుగా తెరమరుగు… ఈరోజుకూ అజ్ఞాతమే…!!
  • ఐప్యాక్..! వ్యూహకర్తలు కారు… పక్కా స్కామర్లు… కోట్లకుకోట్ల దందాలు..!!
  • పూలు విసిరితే బాంబు అనుకుని… దళపతి భయంతో పరుగో పరుగు…
  • బీఆర్ఎస్ సైద్ధాంతిక శూన్యం..! కీలక బిల్లులపై ‘అనివార్య నిశ్శబ్దం..!
  • “మోదీ సరికొత్త గణితం..! 3 బిల్లులు – దేశ రాజకీయాల ‘గేమ్ ఛేంజర్’ ప్రణాళిక..!”
  • బీహార్ రాజకీయాల్లో మార్పు..? ఎవరు ఈ సామ్రాట్ చౌదరి..?!
  • తెలంగాణకు కేసీయార్ తీరని చారిత్రక ద్రోహం… ఇవిగో ఆనవాళ్లు…
  • ధో రో కో … ముక్కుతూ మూలుగుతూ… మ్యాచులకు దూరమవుతూ…
  • సినిమా ప్రసార హక్కులు … టీవీ చానల్స్ మధ్య పోటీ …

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions