Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరేమనుకుంటున్నారు…? అసలే ఓడిపోయిన ఎమ్మెల్యే తాలుక..!!

November 16, 2024 by M S R

.

ఓడిపోయిన ఎమ్మెల్యే తాలుక…అట!

కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. తిరుమల కొండమీది వెంకన్న కీర్తి ప్రభతో- వికారాబాద్ పక్కన అనంతగిరి కొండల్లో ప్రశాంతంగా ఉన్న అనంతపద్మనాభస్వామి ప్రభను పోల్చడానికి వీల్లేదు. ఎవరి కీర్తి వారిదే.

Ads

తిరుమల వెంకన్న అన్నమయ్య అంతటి మహామహుడిని పిఆర్ఓ గా పెట్టుకుని పోషించగలిగాడు. అనంతగిరి స్వామికి ఆర్థికంగా అంత వెసులుబాటు లేదేమో? లేక అన్నమయ్య లాంటి కారణజన్ముడు దొరకలేదేమో? మనకెలా తెలుస్తుంది? అది పెరుమాళ్లకే ఎరుక!

మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు, బిరుదులు, గండపెండేరాలు, ఉచితాసనాలు, ముందువరుస ప్రోటోకాల్, టోల్ గేట్లు కట్టకుండా, ఆగకుండా వెళ్లే విఐపి మర్యాదలు, విఐపి బ్రేక్ దర్శనాలు, ట్రాఫిక్ లో సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లగలిగే కాన్వాయ్ లు…

ఒక హోదా. ఒక అనుభవించి తీరాల్సిన వైభోగం. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా భారత దేశంలో పిండికొద్దీ రొట్టెలా- డబ్బు పెట్టే కొద్దీ గౌరవ డాక్టరేట్లు, బిరుదులు, అవార్డులు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు మనకు అనేక వాహనాల మీద రెడ్ కలర్ డేంజర్ స్టిక్కర్ మీద తెల్లటి అక్షరాల్లో చాలా హోదాలు కనిపిస్తుంటాయి. ఏబిసిడిలు కలిపి చదవడం వచ్చిన ఎవరికయినా అవి లేని హోదాలని, ఫేక్ అని తెలిసిపోతూ ఉంటుంది. కానీ- అవి నంబర్ ప్లేట్ గా తగిలించుకున్నవారికి అంత జ్ఞానం ఉండదు.

తమ అజ్ఞానాన్ని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని బహిరంగంగా అలా మెడలో పలకకట్టి పెట్టుకున్నట్లు ప్రదర్శించుకునే వారి ప్రకటన హక్కును మనం కాదనం. ట్రాఫిక్ ను పట్టించుకోవడానికే రెండు కళ్లు చాలని పోలీసుల కంట్లో ఇలాంటివి పడాలనుకోవడం అత్యాశ లేదా దురాశ అవుతుంది.

కొంతమంది నటులకు ఇంటిపేరు ముందు డాక్టర్ అని గౌరవంగా వచ్చి చేరుతుంది. అంతకుముందే అభిమానులు ఒళ్లు కోసుకుని రక్తాభిషేకంతో ఇచ్చిన బిరుదులు రెండో, మూడో ఉండి ఉంటాయి. ఖర్మ బలంగా కాలితే ఆ నటుడి తండ్రి బిరుదు కూడా ఒక ముక్క కొడుకుకు అతికించాల్సిన మర్యాద పాటించాల్సి వస్తుంది.

అప్పుడది మొత్తంగా-
డాక్టర్, విశ్వ అపఖ్యాతి, నటశూన్య, నట భయంకర, నట పక్షవాత కంపిత, నట రోగ పీడిత, నట తాడిత, నట రక్త బిందు చిందిత… ఇలా దండకంలో సమాసం ఆగని పదబంధ బంధురమై భాషకే గిలిగింతలు పెడుతూ ఉంటుంది.

ఇంటిపేరు తప్ప పేరు ముందు నిజానికి ఏవీ పెట్టుకోకూడదు. వృత్తిని బట్టి పేరు ముందు డాక్టార్, లాయర్, పోలీస్, టీచర్… అన్నది కూడా స్పష్టత కోసమే. చదువులో భాగంగా పిహెచ్డి చేసినవారు డాక్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు.

ఈమధ్య అది కూడా నామోషీగా ఫీలయి కొంతమంది పిహెచ్డి చేసినా డాక్టర్ అని పెట్టుకోవడం లేదు. వైద్య వృత్తిలో డిగ్రీ, పిజి పూర్తి చేసినవారిని, వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నవారిని మాత్రమే డాక్టర్ అనాలి.

వైద్యులు, పిహెచ్డి పూర్తి చేసినవారినే డాక్టర్ అనాలన్న మర్యాదలో సమానత్వం లోపించినట్లు తోచింది కొందరికి. ప్రజాస్వామ్యంలో ఒకరు ఎక్కువ- ఒకరు తక్కువ కాదు. తమ నటనతో ఎర్రగడ్డకు దారిచూపే నట దారి దీపాలకు డాక్టర్ బిరుదు ఇవ్వకపోతే డాక్టరేట్ కే మర్యాద దక్కదు.

యాభై వేలు, లక్ష, పది లక్షలకు డాక్టరేట్లు, బిరుదులు కొనుక్కునేవారు ఉన్నప్పుడు అమ్మేవారు కూడా ఉండాలి. లేకపొతే డిమాండ్- సప్లై మార్కెట్ సూత్రం తలకిందులవుతుంది. చేతిలో డబ్బులేక బిరుదులు కొనుక్కోలేనివారికి బ్యాంకులు ఉదారంగా వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. వాహనాలు కొనగానే ఫాన్సీ నంబర్లు ఆన్ లైన్ వేలంలో అందుబాటులో ఉంచినట్లు- మంచి మంచి బిరుదు భుజకీర్తులను ఆన్ లైన్లో పారదర్శకంగా వేలం వేయాలి.

అధికారికంగా వైట్లో చెక్కులిచ్చి కొన్న బిరుదులను ఐటి శాఖ వారు కూడా గుర్తించి గౌరవించాలి. ఇంటిపేరు ముందు కొన్న బిరుదులను తగిలించుకోవడానికి చట్టాల్లో సవరణలు చేయాలి. న్యాయస్థానాలు కూడా పెద్ద మనసుతో పెద్ద పెద్ద పెట్టుడు బిరుదులను అంగీకరించాలి!

కొస మెరుపు:-

“NGKL ఓడిపోయిన MLA తాలుక” అని బైక్ వెనుక రాయించుకున్న ఒకానొక అభిమాని వైరల్ ఫోటోను పంపుతూ ఒక పాఠకుడు దీనిమీద ఏదైనా రాయండి సార్! చూడలేక చస్తున్నాం! అని కోరితే ఈ నాలుగు మాటలు రాయాల్సి వచ్చింది.

తెలంగాణాలో NGKL అంటే బహుశా నాగర్ కర్నూల్ అయి ఉండాలి. ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల కలగలుపు తెంగ్లిష్ లో ఉన్న ఈ రాతలో తాలూక “తాలుక” కావడాన్ని ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే తలలో నాలుకగా ఉన్న ఈ అభిమాని తాలూక సగర్వంగా ప్రకటించుకున్న అక్షరాలుగానే చూడాలి కానీ… భాషాదోషాలు వెతకకూడదు. ఇందులో భావమే ప్రధానం- భాష కాదు!

“బానిసకొక, బానిసకొక బానిసవోయ్‌ బానిసా!” అని మహాకవి శ్రీశ్రీ ఎవరిని ఉద్దేశించి అన్నాడో పాపం ఈ నాలుకలేని తాలుకకేమి తెలుస్తుంది?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జస్‌ప్రీత్ బుమ్రా..! ఎంతకాలంలే అన్నారు… పదేళ్లుగా అదే జోరు ప్రయాణం..!!
  • ఆశ్చర్యమే… 9 వేల కోట్ల ఓ పెద్ద టాస్క్ రేవంత్ రెడ్డి సాధించాడు…
  • ప్రేమ భర్తలనే కాదు… కన్న తల్లులనూ క్రూరంగా చంపేస్తోంది…
  • అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
  • శుకపికముల కలరవముల స్వర లహరులలో… ఏదో రసాన్వేషణ..!!
  • ఎవరీ కొత్త రఘువరన్..? తెలుగు తెరకు కొత్త విలన్..! భలే పట్టుకొచ్చారు..!!
  • పాకిస్థాన్ వెళ్లడానికి మిల్కాసింగ్ ససేమిరా… నెహ్రూ ఒత్తిడి… ఎందుకు..?!
  • గానకోకిల… తెలుగు పాటను ఎందుకు ఇష్టపడలేదు..? ఎవరు కారణం..?
  • కడుపులా..? చెత్త కుండీలా..? వంటల వీడియోలతో బహుపరాక్..!!
  • కాజోల్ మీదొట్టు… రామోజీ ఫిలిమ్ సిటీ దెయ్యాలన్నీ పారిపోయాయ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions