.
నిజమైన టీచర్ ఎప్పుడూ రిటైర్ అవడు..! భోపాల్‌లో నివసించే ఓ గౌరవనీయమైన పాఠశాల ఉపాధ్యాయుడు ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ఆయన తన భార్యతో కలిసి అపార్ట్‌మెంట్‌లో ప్రశాంతంగా జీవిస్తున్నాడు.
దసరా సెలవులు రావడంతో ఇద్దరూ తమ స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బయల్దేరే ముందు టీచర్‌కు ఒక ఆలోచన వచ్చింది. “మనం లేని సమయంలో ఎవరైనా దొంగ ఇంట్లోకి చొరబడితే? ఇంట్లో పెద్దగా డబ్బు, బంగారం ఏమీ లేకపోయినా అల్మారాలు పగలగొట్టి, ఇల్లంతా చిందరవందర చేసేస్తాడు!”
Ads
అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో టేబుల్‌పై ₹1,000 పెట్టి, పక్కనే ఓ లేఖ రాసి ఉంచాడు. “ప్రియమైన అపరిచిత దొంగగారికి, ముందుగా మా ఇంట్లోకి ప్రవేశించేందుకు మీరు చేసిన శ్రమకు అభినందనలు!
కానీ ఒక చిన్న నిరాశకరమైన విషయం చెప్పాలి. నేను పెన్షన్‌పై బతికే మధ్యతరగతి వ్యక్తిని. ఈ ఇంట్లో విలువైన వస్తువులు ఏవీ లేవు. మీ కష్టం వృథా కాకూడదనే ఉద్దేశంతో ఈ ₹1,000 మీకోసం ఉంచుతున్నాను. దయచేసి స్వీకరించండి.
అలాగే… మీ వృత్తిలో (దొంగతనంలో! ) మరింత ఎదగడానికి కొన్ని సూచనలు కూడా ఇస్తున్నాను.
8వ అంతస్తు – ఓ అవినీతి మంత్రి ఉంటాడు.
7వ అంతస్తు – ఓ తెలివైన రియల్ ఎస్టేట్ వ్యాపారి.
6వ అంతస్తు – సహకార బ్యాంకు ఛైర్మన్.
5వ అంతస్తు – పెద్ద పారిశ్రామికవేత్త.
4వ అంతస్తు – పేరున్న లాయర్.
3వ అంతస్తు – ఓ అవినీతి రాజకీయ నాయకుడు.
వాళ్లందరి దగ్గర బోలెడంత బంగారం, నగదు ఉంటుంది. మీ ‘వృత్తి విజయం’ వల్ల వారికి పెద్ద నష్టం ఏమీ ఉండదు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమూ తక్కువే! – ఒక రిటైర్డ్ టీచర్…”
దసరా తర్వాత టీచర్ ఇంటికి తిరిగి వచ్చాడు. టేబుల్‌పై ఈసారి ఓ పెద్ద బ్యాగ్ కనిపించింది. తెరిచి చూస్తే… అందులో ₹10 లక్షల నగదు! పక్కనే మరో లేఖ కూడా ఉంది.
“గౌరవనీయులైన గురువుగారికి, మీ మార్గదర్శకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చెప్పిన సూచనలను పాటించాను. ఆపరేషన్ విజయవంతమైంది! కృతజ్ఞతగా ఈ చిన్న కానుకను స్వీకరించండి. మీ ఆశీర్వాదం, మీ బోధనలు ఇకముందూ నాకు దారి చూపాలని కోరుకుంటున్నాను.
ఇట్లు, మీ శిష్యుడు… దొంగ!”
ఆ లేఖ చదివిన టీచర్ నవ్వుకుంటూ అన్నాడు… “అయ్యో! నేను రిటైర్ అయ్యాననుకున్నా… కానీ నా బోధనా సేవ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందే!” గురువు ఎప్పటికీ రిటైర్ అవడు… శిష్యులు ఉన్నంతకాలం!
(ఇంగ్లిషులో కనిపించిన ఓ కథకు స్వేచ్చానువాదం ఇది)
Share this Article