.
ప్రస్తుతం సాయిబాబా వివాదం నడుస్తోంది కదా… సాయి భక్తులకు, అసలు తను దేవుడే కాడు అనే సనాతన ధర్మ భక్తులకు నడుమ వాదోపవాదాలు సాగుతూనే ఉన్నాయి కదా… మరీ ప్రత్యేకించి ఆయనెవరో రమణానంద మహర్షి మరీ శివుడే సాయి, సాయే శివుడు అంటూ… సాయి ముస్లిం కాదు, బ్రాహ్మణుడని చెబుతూ… తనను తాను సిద్దగురువు అని చెప్పుకుంటూ… సనాతనుల ఆగ్రహంలో ఆజ్యం పోస్తున్నాడు..!
కప్పట్రాళ్లకు చెందిన ఈయన యాదగిరిగుట్ట సమీపంలో సాయి అనుగ్రహ పీఠం అని స్థాపించి, అందులో వందల శివలింగాలను ప్రతిష్టించాడు, లింగాల నడుమ సాయిబాబా ఉంటాడు… ఇలాంటోళ్లు ఏమైనా చేయగలరు, చెప్పగలరు కదా…
Ads
ఈ వివాదం తాలూకు వార్తలు గట్రా చదువుతూ ఉంటే… ఓ పాట గుర్తొచ్చింది… అప్పట్లో, అంటే 1986లో విజయచందర్ సాయిబాబాగా నటించిన శ్రీ షిర్డి సాయిబాబా మహత్యం సినిమాలోనిది ఈ పాట… గీత రచయిత రంగసామి పార్థసారథి (కొందరు ఆత్రేయ రాశాడంటారు), సంగీతం ఇళయరాజా, గానం జేసుదాసు… చాలా హిట్ పాట అప్పట్లో…
సాయిబాబా మీద చాలా సినిమాలు వచ్చినా విజయచందర్ నటించిన ఈ సినిమాయే హిట్, తరువాత నాగార్జున నటించిన సాయిబాబా సినిమా పాపులర్… విజయచందర్ తన పరిణత నటనతో సాయిబాబాను తలపింపజేస్తాడు… సరే, ఈ పాట విషయానికొద్దాం…
అందులో సాయిబాబాను ఏకంగా పాండురంగడిగా, వినాయకుడిగా, దత్తాత్రేయుడిగా, ఆంజనేయుడిగా, విష్ణురూపుడిగా, సకల దేవుళ్లకు ప్రతిరూపంగా చూపిస్తారు, కీర్తిస్తారు. ఇదీ ఆ పాట…
హే..! పాండురంగా…
హే..! పండరి నాథా…
శరణం శరణం శరణం…
సాయీ శరణం… బాబా శరణం శరణం
సాయీ చరణం… గంగా యమున సంగమ సమానం…
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే…
మా పాండురంగడు… కరుణామయుడు సాయే…
ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే…
మా పాండురంగడు… కరుణామయుడు సాయే…
విద్యా బుద్ధులు వేడిన బాలకు… అగుపించాడు విఘ్నేశ్వరుడై
పిల్లా పాపల కోరిన వారిని… కరుణించాడు సర్వేశ్వరుడై…
తిరగలి చక్రం తిప్పి వ్యాధినే… అరికట్టాడు విష్ణు రూపుడై
మహల్సా, శ్యామాకు మారుతి గాను… మరి కొందరికి దత్తాత్రేయుడుగా…
యద్భావం తద్భవతని… దర్శనమిచ్చాడు, ధన్యుల జేసాడు…
పెను తుఫాను తాకిడిలో… అలమటించు దీనులను,
ఆదరించె తాననాథ నాథుడై…
అజ్ఞానం అలముకొన్న… అంధులను చేరదీసి,
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై…
వీధి వీధి బిచ్చమెత్తి… వారి వారి పాపములను పుచ్చుకొని
మోక్షమిచ్చే పూజ్యుడై…
పుచ్చుకున్న పాపములను… ప్రక్షాళన చేసికొనెను
దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై…
అంగములను వేరు చేసి… ఖండయోగ సాధనలో
ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై…
జీవరాశులన్నిటికి సాయే శరణం… సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం… సాయే శరణం
ఆస్తికులకు సాయే శరణం… నాస్తికులకు సాయే శరణం
భక్తికీ సాయే శరణం… ముక్తికీ సాయే శరణం
సరే, భక్తులు అపారమైన భక్తి విశ్వాసాలతో దేవుళ్లందరినీ నీలోనే చూసుకుంటున్నాం అని కీర్తించడం వరకూ, ఆ పాటలో తన లీలలు, మహత్తులు చూపడం వరకూ వోకే, అది భక్తి సినిమా కాబట్టి…! కానీ గంగాయమున సంగమ సమానం అంటే ఏమిటో…? పైగా ఏ క్షేత్రమైనా సాయే అనడంలో అర్థమేమిటి..? ఒక్కో క్షేత్రానికి, ఒక్కో తీర్థానికి ఒక్కో దేవుడుంటాడు, అన్నింట్లోనూ సాయే అనడం ఏమిటి..?
ఈ రచయిత ఎవరో అప్పటి రమణానంద మహర్షి అయి ఉంటాడు… అన్నింటికన్నా పీక్స్ ఏమిటంటే… ఆస్తికులకు సాయే శరణం వరకూ వోకే, కానీ నాస్తికులకూ సాయే శరణం ఏమిటో..!!
Share this Article