వాల్మీకి రామాయణంలో కనిపించకపోవచ్చుగాక… వేలాది కళారూపాల్లోకి రామాయణం విస్తరించేకొద్దీ అనేక చిత్రవిచిత్రమైన ఉపకథలు వచ్చి చేరాయి… చాలామందికి తెలియని కథ, చాలా ఆసక్తికరమైన పాత్ర… రాముడి సోదరి శాంత..! ముందుగా దశరథుడు- కౌసల్య పరిణయం దగ్గర నుంచి మొదలుపెడదాం… నీ చెల్లెలి కొడుకే నిన్ను చంపుతాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్పినట్టుగా… రావణుడికి కూడా ఫలానా కౌసల్య కొడుకు చేతుల్లో నువ్వు మరణిస్తావు అని అశరీరవాణి ఏదో హెచ్చరిస్తుంది…
దాంతో రావణుడు కోసల రాజ్యానికి రహస్యంగా వెళ్లి కౌసల్యను అపహరించి, ఓ పెట్టెలో పెట్టేసి, ఓ నదిలో పారేసి, లంకకు వెళ్లిపోతాడు… ఎందుకో అటువైపే పర్యటిస్తున్న దశరథుడు దాన్ని గమనించి, ఆ పెట్టెను కష్టమ్మీద ఒడ్డుకు లాగి తెరుస్తాడు… తరువాత ఆమెను పెళ్లాడతాడు… వాళ్లకు ఓ బిడ్డ పుడుతుంది ఆమె పేరే శాంత… రకరకాల కథల్లో ఒరియా రామాయణంలోని ఒక కథకు మనం పరిమితమై శాంత మిగతా కథ చెప్పుకుందాం…
Ads
కౌసల్యకు ఓ సోదరి ఉంటుంది, పేరు వర్షిణి… ఆమె అంగదేశపు రాజు రోమపాదుడి భార్య… వాళ్లకు పిల్లల్లేరు… మరోవైపు దశరథుడు-కౌసల్యలకు శాంత పుట్టగానే రాజ్యంలో క్షామం నెలకొంటుంది… ఆమె జాతకం సరైంది కాదని పురోహితులు చెప్పడంతో ఖిన్నులవుతారు… ఈలోపు వర్షిణి వచ్చి మీ బిడ్డను నాకు దత్తత ఇవ్వండి, నేను పెంచుకుంటాను అని శాంతను తీసుకుపోతుంది… ముద్దుగా పెంచుకుంటుంది… వేదాలు చదువుతుంది ఆమె… పలు భాషలు, విద్యలు, కళలు నేర్చింది… యుద్ధవిద్యలు కూడా నేర్చుకుంది… మంచి అందగత్తె… ఈలోపు అంగదేశంలోనూ క్షామం ప్రబలుతుంది… ఇంద్రుడిని సంతృప్తిపరిచే యాగం ఒకటి చేయాలి… అది చేయించగలిగేది రుష్యశృంగుడు మాత్రమే అంటారు అర్చకులు… ఎవరీ రుష్యశృంగుడు..?
విభందక అనే రుషి కొడుకు రుష్యశృంగుడు… దట్టమైన అడవి మధ్యలో నివసించేవాళ్లు తండ్రీ కొడుకులు… అపూర్వమైన జ్ఞానసంపత్తి కొడుకుది… కానీ ఆడవాసన కాదు కదా, తను యవ్వనంలోకి వచ్చేవరకు కూడా ఆడరూపం తెలియదు తనకు… మరి అతన్ని అడవి నుంచి బయటికి రప్పించి యాగాలు చేయించుకునేది ఎలా..? విభందకుడు మహా కోపిష్టి… అడవి నుంచి బయటికి రాడు, కొడుకును పోనివ్వడు… శపించగలడు…
దాంతో తనను తీసుకురావడానికి నేను వెళ్తానంటుంది శాంత… రుషి లేని సమయాల్లో రుష్యశృంగుడి దగ్గరకు వెళ్లి, కవ్విస్తుంది… బ్రహ్మచర్య దీక్ష సడలి రుష్యశృంగుడు ఆమె మోహంలో పడిపోతాడు… తనకు నచ్చజెప్పి విభందకుడు లేని సమయంలో అడవి దాటించి తీసుకొస్తుంది… యాగం చేస్తాడు… వర్షాలు పడతాయి… శాంత కూడా రుష్యశృంగుడి స్వచ్ఛత, జ్ఞానం నచ్చి తననే పెళ్లిచేసుకుంటుంది… ఈ యాగానికి వచ్చిన దశరథుడు తనకు కొడుకులు లేరని, పుత్రకామేష్టి యాగం చేయించాలని అల్లుడిని కోరతాడు… అంటే రుష్యశృంగుడిని…
బావమరుదుల పుట్టుక కోసం అల్లుడు యాగం చేయించాలన్నమాట… దశరథుడు నిస్సంతు కాదు, అందుకే సంతానం కోసం యాగం అడగలేదు… తన మగ వారసుల కోసం పుత్రకామేష్టి అడిగాడు… దానికి రుష్యశృంగుడు అంగీకరించి, అయోధ్యకు వెళ్లి ఆ యాగం చేయిస్తాడు… తరువాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుల పుట్టుక కథ అందరికీ తెలిసిందే… తరువాత శాంత ఏమైంది..? ఆ ఒరియా రామాయణమూ ఇక ఆమె కథను పెద్దగా చెప్పదు…
కాకపోతే ఒరియా జానపద కథల ప్రకారం… శాంత అయోధ్య, అంగదేశ, కోసల దేశాల ప్రియబాంధవి… సీతాకల్యాణం అనంతరం అయోధ్యకు వచ్చిన శ్రీరామదంపతులకు సోదరిగా శాంత స్వాగతం పలుకుతుంది… చివరగా… రాముడు దూరమయ్యాక మనోవ్యధతో మంచం పట్టిన దశరథుడికి తన చివరి రోజుల్లో సేవ చేసింది కూడా ఆమే… ఇదీ రాముడి సోదరి కథ… అన్నట్టు చెప్పనే లేదు కదా… కర్నాటకలోని శృంగేరీ పీఠం తెలుసు కదా… అక్కడికి సమీపంలోనే కిగ్గా అనే చిన్న పట్టణం… అక్కడ ఈ రుష్యశృంగుడు, శాంత విగ్రహాలున్న గుడి ఉంది..!!
Share this Article