Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలయ్యకు తెలుగు వర్శిటీ పురస్కారం- అసంబద్ధమేనా..?

November 22, 2026 by M S R

.

Mohammed Rafee …. నందమూరి బాలకృష్ణకే తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారం!’
– రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం!
– ఐదు దశాబ్దాల కళాకారుడిగా, క్యాన్సర్ ఆసుపత్రి సేవ పరిగణన లోకి తీసుకుని యూనివర్సిటీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం, తెలంగాణ అందించే 2026 సంవత్సరం ప్రతిష్టాత్మక విశిష్ట పురస్కారానికి హీరో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణను ఎంపిక చేసినట్లు వార్తలు రావడంతో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడక ముందే రచ్చ మొదలయ్యింది.

Ads

రాజకీయాల్లో వున్న టిడిపి పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు ఇవ్వాలని కొందరు, ఆంధ్రా నటుడికి ఎందుకివ్వాలని ఇంకొందరు, వివాదాస్పద హీరో అని మరికొందరు విమర్శిస్తున్నారు.

nbk

ఏటా కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి విశిష్ట పురస్కారాన్ని తెలుగు యూనివర్సిటీ అందిస్తూ గౌరవిస్తోంది. 2026 సంవత్సరానికి కళా సేవా రంగాల నుంచి బాలకృష్ణ పేరును విశ్వవిద్యాలయ వర్గాలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా తెలుగు సినీ రంగానికి ఆయన అందించిన సేవలు, తెలుగు భాషాభిమానంతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా ఆయన చేస్తున్న సామాజిక సేవలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే, దీనిపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తెలుగు విశ్వవిద్యాలయం ఇచ్చే పురస్కారాలు సాధారణంగా తెలుగు భాష, సాహిత్యం, జానపద కళలు, నాటకరంగం, శాస్త్రీయ కళల్లో విశేష పరిశోధన, కృషి చేసిన వారికి దక్కుతుంటాయి. కమర్షియల్ సినిమాల హీరోకు ఈ పురస్కారం ఇవ్వడం విశ్వవిద్యాలయ సంప్రదాయాలకు, ప్రమాణాలకు భిన్నమే కావచ్చు!

బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఇందులో రాజకీయ స్నేహపూర్వక సంబంధాలు పనిచేశాయని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. గతంలో బాలకృష్ణ కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించినప్పుడు కూడా ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు, బహిరంగ సభల్లో ఆయన ప్రవర్తనను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడూ అదే తరహా చర్చ జరుగుతోంది.

nbk

50 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతూ పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల ద్వారా తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పిన నటుడిగా బాలకృష్ణకు అర్హత ఉందని అభిమానులు, సినీ వర్గాలు సమర్థిస్తున్నాయి. అంతేకాకుండా, క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మంది పేదలకు వైద్యం అందించడం ఆయన సామాజిక బాధ్యతకు నిదర్శనమని అంటున్నారు.

విశ్వ విద్యాలయ పురస్కారాల ఎంపికలో ప్రజాదరణకంటే సాహిత్య, కళాత్మక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది విద్యావేత్తల వాదన. ప్రముఖ నటులకు ఇప్పటికే ప్రభుత్వం తరపున ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ వంటివి ఇస్తున్నందున, విశ్వవిద్యాలయ అవార్డులను తెర వెనుక ఉండే భాషా, సాహిత్య సేవకులకు కేటాయించడం సముచితమనే అభిప్రాయం వినిపిస్తోంది.

తెలుగు విశ్వవిద్యాలయం అందించే అత్యున్నత పురస్కారమైన ఈ ‘విశిష్ట పురస్కారం’ 1991లో ప్రారంభమైంది. గతంలో సంగీత పరిశోధకులు వీఏకే రంగారావు, దర్శకుడు బాపు, సింగీతం శ్రీనివాసరావు, సాహిత్యం ముదిగంటి సుజాతారెడ్డి, ఆంధ్ర నాట్యం కళాకృష్ణ, కూరెళ్ల విఠలాచార్య , భరత్‌భూషణ్, నందిని సిధారెడ్డి, బి. నర్సింగరావు, చుక్కా సత్తయ్య, కొలకలూరి ఇనాక్, సి.నారాయణరెడ్డి తదితరులు స్వీకరించారు.

గత జాబితాను పరిశీలిస్తే, సినీ రంగానికి చెందిన బి. నర్సింగరావు, వీఏకే రంగారావు, సింగీతం శ్రీనివాసరావు, బాపు వంటి వారికి ఈ అవార్డు దక్కింది. కానీ, పూర్తి స్థాయి వాణిజ్య సినీ హీరోలకు ఈ పురస్కారం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడంతో చర్చ జరుగుతోంది.

nbk

విశ్వ విద్యాలయం పంపిన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.
ఇప్పటి వరకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బాలకృష్ణకు ‘విశిష్ట పురస్కారం’ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి కూడా రాలేదు.

విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ లో గానీ, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి గానీ 2026 విశిష్ట పురస్కార గ్రహీతల తుది జాబితా ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం దాదా సినిమా షూటింగ్ లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు.

ఆయన ఈ పురస్కారం గురించి, వివాదాల గురించి స్పందించలేదు. ఆయన డేట్ కోసం యూనివర్సిటీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి ఈ ఏడాది పురస్కారం మరో రెండు మూడు రోజుల్లో బాలకృష్ణకే ప్రకటించే అవకాశం వుంది. నమస్తే తెలంగాణలో రాసినట్లుగా ఈ అవార్డుకు బ్రేక్ అయితే పడలేదు.
– డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాలయ్యకు తెలుగు వర్శిటీ పురస్కారం- అసంబద్ధమేనా..?
  • హరీశ్, నీకో నిజం తెలుసా..? పాలిటిక్స్‌లో జో జీతా వోయీ సికిందర్..!!
  • బిడ్డలూ.. ఎక్కడున్నారమ్మా? 40 ఏళ్ల ఒంటరి బతుకు చాలించింది మీ తల్లి!
  • మోదీ ఇమేజ్‌ పనిచేయలేదు- రాహుల్ గాంధీకి ఓ కొత్త ఊపిరి !
  • యముడినే ఎదిరించిన ఆ సావిత్రి… ఇక్కడ యముడి స్థానంలో ఓ లాయర్!
  • HIV రోగుల్లో పక్షవాతంపై కాకినాడ ప్రజావైద్యుడి మరో పరిశోధన!
  • రేవంత్ పాలనకు కేవలం 6.5 రేటింగ్ మాత్రమే ఎందుకంటే..?
  • “నో.. నో.. పి.వి. ఈజ్ ఓకే” అందామె! కానీ ఏడేళ్ల తరువాత..?
  • ఈఎన్ఈ రిపీట్ కాలేదబ్బా- అసలు ఈ తరుణ్ భాస్కర్‌కేమైంది..?
  • రాధిక ఆప్టే వెటకారం… బాలయ్యపైనా..? మేనరికాలపైనా..? కీర్తి వివరణ దేనికి.?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions