.
ఒకప్పుడు బాలూ మహేంద్ర దగ్గరకు ఓ కుర్రాడు వెళ్లాడట. “సార్.. మీతో మాట్లాడాలని వచ్చాను” అన్నాడట. సినిమాల్లో అవకాశం కావాలనుకుంటున్నావా అని అడిగితే.. “అబ్బే.. నాకు సినిమా అవకాశం వద్దు సార్. మీరు నాలుగు ఫోటోలు తీసిస్తే చాలు” అన్నాడట. ఆశ్చర్యపోయిన బాలూ మహేంద్రకు తన మనసులో మాట చెప్పాడట ఆ కుర్రాడు.
“నేనేమీ పెద్ద అందగాడిని కాదు సార్. కానీ మీరు తీసే ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది. మీ సినిమాల్లో కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. మీరు తీసే ఫోటోలతో నాకు సినిమా అవకాశాలు వస్తాయేమోనన్న చిన్న ఆశ. ఓ అమ్మాయి నాది ఫోటోజెనిక్ ఫేస్ అని చెప్పింది” అని వివరించాడట.
Ads
ఆ కుర్రాడి నమ్మకాన్ని చూసి బాలూ మహేంద్ర ఫోటోలు తీసిచ్చారన్నది ప్రచారంలో ఉన్న కథ. అయితే ఆ తర్వాత బాలూ మహేంద్ర అతడిలోని ఫోటోజెనిక్ ముఖాన్ని గుర్తించి నటన వైపు ప్రోత్సహించిన విషయం మాత్రం వాస్తవం. వాళ్లే చెప్పారు… బత్తా సినిమాలో తన పాత్ర, తన నటన చూశాక ఇది గుర్తొచ్చింది…
థాంక్ గాడ్… దీనికిముందు తెలుగు సినిమా జర్నలిస్టులను కలవలేదు తను, కలిస్తే మొహం అద్దంలో చూసుకున్నావా..? నిన్నెవడైనా చూస్తాడా..? నువ్వు హీరో మెటీరియలా..? అనే చెత్తన్నర ప్రశ్నలతో సగం చచ్చిపోయేవాడేమో…

ఆ కుర్రాడే విజయ్ సేతుపతి! అప్పట్లో చిన్న చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం.. ఎన్నో తిరస్కారాలు, ప్రయత్నాలు, అపజయాలు దాటుకుంటూ సాగింది. ఒకప్పుడు అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన అతడే.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా మారాడు. ’96’, ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్ వేద’, ‘మహారాజా’ వంటి సినిమాలతో తనదైన నటనను చూపించాడు. హీరోగానే కాదు, ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికీ వెనుకాడలేదు.
పాత్రకు గౌరవం.. నటనకు హద్దుల్లేవు! విజయ్ సేతుపతిలో నచ్చే మరో విషయం అతడి సున్నితత్వం. తెలుగులో ‘ఉప్పెన’ సినిమాలో కృతి శెట్టికి తండ్రిగా నటించాడు. ఆ సినిమా తర్వాత తమిళ చిత్రం ‘డీఎస్పీ’లో కృతినే తనకు హీరోయిన్గా అనుకుంటున్నారని తెలిసి ఆ అవకాశాన్ని తిరస్కరించాడు. కారణం? అప్పటికే ఆమెకు తండ్రిగా నటించాడు. ఆ అమ్మాయితో రొమాంటిక్ పాత్ర చేయడం తనకు ఇబ్బందిగా అనిపించిందని స్వయంగా చెప్పాడు. పైగా కృతి తన కొడుకు కంటే కొంచెం పెద్దదని కూడా వివరించాడు.
ఇదేదో ప్రచారం కోసం చేసిన ప్రకటన కాదు. ఒక పాత్రలో నటించిన తర్వాత ఆ పాత్రకు, ఆ అనుబంధానికి విలువ ఇవ్వడం. అందుకే విజయ్ సేతుపతి ప్రత్యేకం. ’96’ సినిమాలో ప్రేమను మనసులోనే దాచుకున్న రామ్ పాత్రలో అతడి నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. నటుడిగా అతడిలోని సున్నితత్వం ఎక్కడ కనిపిస్తుందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలు.
ఎనిమిది రోజులు.. ఒకే బాత్రూమ్! ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన అతడి కొత్త సినిమా ‘బత్తా’ (Baththa) గురించి మాట్లాడుకోవాలి. 1986 నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజయ్ సేతుపతి ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. అతడంటే అందరికీ భయం. అలాంటి వ్యక్తి అనుకోకుండా ఓ స్కూల్ బాత్రూమ్లో ఇరుక్కుపోతాడు. ఓ చిన్న పిల్లాడి వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడి నుంచి అతడి జీవితంలో జరిగే మార్పులే సినిమా కథ.
ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే.. ఎనిమిది రోజుల పాటు ఒకే బాత్రూమ్లో ఉండాల్సిన పరిస్థితిలో విజయ్ సేతుపతి చూపించిన నటనా వైవిధ్యం. మొదటిరోజు అతడిలో కనిపించే ఆవేశం, అహంకారం, భయం.. రోజులు గడిచేకొద్దీ మారే తీరు.. చివరకు అతడిలో వచ్చే అంతర్మథనం.. ఇవన్నీ గమనిస్తే ఒక నటుడు పాత్రను ఎలా జీవించాలో అర్థమవుతుంది.
ఒకే ప్రదేశం.. పరిమితమైన పరిసరాలు.. అయినా ఎనిమిది రోజుల ప్రయాణాన్ని ప్రేక్షకుడికి అనుభూతి చేయించాలి. ముఖంలో చిన్న మార్పు, చూపులో తేడా, మాటతీరులో మార్పు.. ఇలాంటి సూక్ష్మమైన అంశాలతో పాత్రలోని పరిణామాన్ని చూపించడం అంత సులభం కాదు. విజయ్ సేతుపతి అలాంటి సవాలునే స్వీకరించాడు.

నటనకు అందం అవసరమా? సినిమాల్లో హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉండాలి, మంచి రంగు ఉండాలి, కండలు తిరిగిన శరీరం ఉండాలి, తల నిండా జుట్టు ఉండాలి.. ఇలాంటి కొలమానాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. కానీ గొప్ప నటుడికి ఇవేవీ ప్రాథమిక అర్హతలు కావు. తనకు ఇచ్చిన పాత్రలో వంద శాతం జీవించగలగాలి. ప్రేక్షకుడికి హీరో కనిపించకూడదు.. ఆ పాత్ర మాత్రమే కనిపించాలి. అదే పరిపూర్ణ నటుడి లక్షణం.
ప్రతి పదేళ్లకో, పదిహేనేళ్లకో ఇలాంటి నటులు వస్తుంటారు. వాళ్లు సినిమాల విలువను పెంచుతుంటారు. విజయ్ సేతుపతి కూడా అలాంటి అరుదైన నటుల్లో ఒకడు. స్టార్డమ్ కోసం పాత్రలను ఎంచుకునే నటులున్న పరిశ్రమలో.. పాత్ర కోసం తన స్టార్‌డమ్‌ను పక్కన పెట్టగలిగే నటుడు అతడు.
బాలూ మహేంద్ర కెమెరా ముందు ఫోటోలు దిగాలనుకున్న ఓ కుర్రాడు.. ఇప్పుడు కెమెరా ముందు ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. ప్రయాణం అంటే ఇదీ!
Share this Article