Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యుద్ధం ఒక డ్రామా… ఒక వ్యాపారం… అసలు చేదు నిజాలు ఇవీ…!

June 15, 2026 by M S R

.

యుద్ధాల వెనుక మీడియా చూపే కథ వేరు… తెర వెనుక నడిచే అసలు కథ వేరు. సాధారణ ప్రజలకు యుద్ధం అంటే చావులు, శవాల కుప్పలు, కన్నీళ్లు, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవ్వడం. కానీ ప్రపంచాన్ని శాసించే కొన్ని అదృశ్య శక్తులకు, కొన్ని ప్రభుత్వాలకు, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు మాత్రం యుద్ధం అంటే… లక్షల కోట్ల లాభసాటి బిజినెస్! అవును, యుద్ధం అక్షరాలా ఒక ప్రణాళికాబద్ధమైన వ్యాపారం.

డిఫెన్స్ మార్కెట్ బూమ్… ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ ఎవరికి లాభం? ఒకసారి మార్కెట్‌ను నిశితంగా గమనించండి. యుద్ధ వాతావరణం మొదలవ్వగానే ప్రపంచంలో ఏ వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది? అన్నం, బట్టలకు కాదు… తుపాకులు, మిసైల్స్, అత్యాధునిక డ్రోన్లు, ఫైటర్ జెట్లకు. అమెరికాలో లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin), బోయింగ్ (Boeing), రేథియాన్ (Raytheon), నార్త్‌రోప్ గ్రుమ్మన్ (Northrop Grumman) లాంటి పెద్ద ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఉన్నాయి.

Ads

వీటికి ప్రపంచవ్యాప్తంగా ‘మర్చంట్స్ ఆఫ్ డెత్’ (మృత్యు బేహారులు) అని పేరు. ఈ కంపెనీల మనుగడే యుద్ధాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో శాంతి ఉంటే ఈ కంపెనీలకు అశాంతి. అదే ఎక్కడైనా యుద్ధ మేఘాలు కమ్ముకుంటే… వీరికి వేల కోట్ల రూపాయల కొత్త ఆర్డర్లు వస్తాయి.

పాలసీలను శాసించే శక్తులు … అమెరికా ప్రభుత్వం నేరుగా ఆయుధాలు తయారు చేయదు. ఈ ప్రైవేట్ కంపెనీల దగ్గరే కొంటుంది. మరి అమెరికా యుద్ధానికి వెళ్లాలంటే ప్రభుత్వానికి అక్కడ పార్లమెంట్ పర్మిషన్ ఇవ్వాలి.

అమెరికాలో రక్షణ శాఖ నిర్ణయాలు తీసుకునే ఎంతో మంది కీలక నేతలకు, ఎంపీలకు ఈ డిఫెన్స్ కంపెనీల్లో సొంత వాటాలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఎన్నికల కోసం కోట్లాది డాలర్లు ఫండింగ్ చేస్తాయి. దీనినే ‘మిలిటరీ-ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ అంటారు. అంటే యుద్ధం జరిగేలా పాలసీలు డిజైన్ చేయడం వెనుక ఈ కంపెనీల ఒత్తిడి స్పష్టంగా ఉంటుంది. యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న దానికంటే, యుద్ధం వల్ల ఎవరు ధనవంతులు అవుతున్నారన్నదే ఇక్కడ ముఖ్యం.

మరోవైపు ఇరాన్ కథ ఏంటి? … ఈ బిజినెస్ కేవలం అమెరికాదే అనుకుంటే పొరపాటే. ఇటు ఇరాన్ కూడా ఇందులో తక్కువ తినలేదు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ తన సొంత డ్రోన్ మిసైల్ టెక్నాలజీని ఒక పెద్ద మార్కెట్‌గా మార్చుకుంది. రష్యాతో పాటు మిడిల్ ఈస్ట్‌లోని హౌతీలు, హిజ్బుల్లా లాంటి సంస్థలకు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా ఇరాన్ కూడా తన రక్షణ పరిశ్రమను ఒక బిజినెస్‌లా నడుపుతోంది. అంటే, మిడిల్ ఈస్ట్‌లో బాంబులు పడుతుంటే… అటు వాషింగ్టన్‌లో, ఇటు టెహ్రాన్‌లో కొందరి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వచ్చి పడుతుంటాయి.

భయంతో వ్యాపారం …. యుద్ధ వ్యాపారంలో మరొక లోతైన ఆర్థిక కోణం ఉంది. యుద్ధం అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక అనివార్యమైన దశ. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు ‘పెట్టుబడి’ తన మనుగడ కోసం కొత్త ప్రాంతాలను, కొత్త మార్గాలను వెతుక్కుంటుంది. ఆ సందర్భంలో రాజ్యం, కార్పొరేట్ సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయి.

ఇరాన్, అమెరికా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొనగానే గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఒక విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తుంది. సామాన్య ఇన్వెస్టర్లు భయపడి తమ షేర్లను అమ్మేసుకుంటారు. ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు కుప్పకూలుతాయి. కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్స్ (Hedge Funds) మాత్రం ఈ భయాన్ని క్యాష్ చేసుకుంటారు.

యుద్ధం జరుగుతుందనే భయంతో ‘షార్ట్ సెల్లింగ్’ (Short Selling) చేసే పెద్ద ముఠాలు మార్కెట్ పతనాన్ని వాడుకుని వందల కోట్లు సంపాదిస్తాయి. ఒకవైపు బాంబులు పడుతూ ఉంటే, మరోవైపు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆయుధ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి.

‘ప్రథమ కుటుంబం’ ట్రంప్ ఫ్యామిలీ డీల్స్ … ఏ యుద్ధం నుంచైనా ఎక్కువ లబ్ధి పొందేవారు ఎవరు? అధికార కేంద్రాలపై పట్టున్నవారే. దీనికి అత్యంత సమకాలీన, స్పష్టమైన ఉదాహరణ… అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం. ఇక్కడ తండ్రి అధికారంలో ఉండి యుద్ధ వాతావరణాన్ని లేదా వ్యూహాలను శాసిస్తుంటే, కొడుకులు ఆ భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ ఇద్దరు కుమారులు—డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ ఇటీవల రక్షణ రంగ వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.

ఇరాన్ తో యుద్ధ వాతావరణంలో మునిగి ఉన్న గల్ఫ్ దేశాలకు ‘డ్రోన్ ఇంటర్సెప్టర్లను’ విక్రయిస్తున్న ఒక డ్రోన్ తయారీ కంపెనీతో ఈ ట్రంప్ సోదరులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. వైట్ హౌస్ మాజీ లాయర్ రిచర్డ్ పెయింటర్ వ్యాఖ్యానిస్తూ—”యుద్ధం ద్వారా భారీగా లాభం పొందిన అమెరికన్ అధ్యక్షుల కుటుంబాల్లో డోనాల్డ్ ట్రంప్ కుటుంబం మొదటిది” అని బహిరంగంగానే విమర్శించారు.

ట్రంప్ కుటుంబం కేవలం హోటళ్లకే పరిమితం కాలేదు; వారిప్పుడు క్రిప్టో కరెన్సీ, రాకెట్ స్పేర్ పార్టులు, రోబోలు, మిలిటరీ టెక్నాలజీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇరాన్ పై అమెరికా వ్యూహాత్మక దాడుల ప్రారంభానికి కేవలం పదకొండు రోజుల ముందు… ఎరిక్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై పనిచేసే ఇజ్రాయెల్ డ్రోన్ కంపెనీలో భారీ పెట్టుబడులు పెట్టడం గమనార్హం.

ఆధునిక యుద్ధంలో AI … ఆధునిక యుద్ధంలో టెక్నాలజీ కంపెనీల పాత్ర వేగంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం తుపాకులు, బాంబులు తయారుచేసే సంప్రదాయ రక్షణ సంస్థలకే లాభం వచ్చేది. కానీ ఇప్పుడు సిలికాన్ వ్యాలీకి చెందిన టెక్ దిగ్గజాలు రంగంలోకి దిగాయి.

డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్లాట్ఫాంల ద్వారా శత్రువుల స్థావరాలను గుర్తించడం, డ్రోన్ దాడులను ఆటోమేట్ చేయడం వంటి పనుల కోసం రక్షణ విభాగాలతో టెక్ కంపెనీలు చేతులు కలిపాయి. యుద్ధ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఈ టెక్ కంపెనీల షేర్ల విలువ కూడా యుద్ధం మొదలైన తర్వాత విపరీతంగా పెరిగింది. నేడు రక్షణ ఒప్పందాలు బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని సృష్టిస్తున్నాయి.

క్రూడ్ ఆయిల్ పాలిటిక్స్ … ఇరాన్ ఉన్న మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచ దేశాల వాహనాలకు, పరిశ్రమలకు ఇంధనాన్ని ఇచ్చే గుండెకాయ లాంటిది. ముఖ్యంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) సముద్ర మార్గం ద్వారానే ప్రపంచంలోని 20 శాతానికి పైగా ఆయిల్ రవాణా అవుతుంది. దీని మీద ఇరాన్‌కు భౌగోళికంగా గట్టి పట్టు ఉంది.

అమెరికా, ఇరాన్ మధ్య చిన్న గొడవ జరిగి… ఆ రూట్ బ్లాక్ అవుతుందనే చిన్న రూమర్ వచ్చినా చాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆయిల్ రేట్లు పెరిగితే ప్రపంచంలోని పెద్ద ఆయిల్ కంపెనీలకు (ExxonMobil, Chevron, Shell), అలాగే ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉండి ఎగుమతి చేసే దేశాలకు లాభం.

భారతదేశం లాంటి దేశాల్లో లీటర్ పెట్రోల్ ధరలు పెరిగి సామాన్యుడు సంసారం గడవడం కష్టమని ఏడుస్తుంటే, గ్లోబల్ ఆయిల్ కంపెనీలు తమ ‘విండ్‌ఫాల్ ప్రాఫిట్స్’ (అయాచిత లాభాలు) చూసుకుని పండగ చేసుకుంటాయి.

కూల్చడం ఒక వ్యాపారం… కట్టడం మరో వ్యాపారం … యుద్ధం వల్ల నగరాలు, రోడ్లు అన్నీ నాశనమైపోతాయి కదా… మరి అక్కడ వ్యాపారం ఎలా సాధ్యం? అని అనుమానం రావచ్చు. అక్కడే అసలైన, అత్యంత క్రూరమైన పెట్టుబడిదారీ ట్విస్ట్ ఉంది. దీనిని ‘రీ-కన్‌స్ట్రక్షన్ బిజినెస్’ అంటారు.

యుద్ధంలో బాంబులు వేసి బిల్డింగులు, హాస్పిటల్స్, పవర్ ప్లాంట్లను పూర్తిగా నేలమట్టం చేస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత ఆ దేశాన్ని మళ్లీ నిర్మించడానికి (Reconstruction) బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు ఇస్తారు. ఈ కాంట్రాక్టులు మళ్లీ అమెరికా, పాశ్చాత్య దేశాలకు చెందిన ‘హాలిబర్టన్’ (Halliburton) లేదా ‘బెక్టెల్’ (Bechtel) లాంటి భారీ ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకే వెళ్తాయి.

ఒక దేశాన్ని కూల్చడానికి ఆయుధాలు అమ్మేది వీళ్లే, మళ్లీ ఆ కూలిపోయిన దేశాన్ని కట్టడానికి కాంట్రాక్టులు తీసుకునేది వీళ్లే! అంటే ఇటు కొట్టినా లాభమే, అటు పెట్టినా లాభమే.

కార్పొరేట్ దురాశకు సామాన్యుడే బలి … యుద్ధ రంగంలో ఏ రోజైనా ఏ దేశ అధ్యక్షుడి కొడుకైనా, లేదా ఏ బిలియనీర్ అయినా తుపాకీ పట్టుకుని ప్రాణాలు పణంగా పెట్టి నిలబడటం చూశారా? లేదు. యుద్ధ రంగంలో చనిపోయేది, కాళ్లు చేతులు కోల్పోయి రోడ్డున పడేది ఎప్పుడూ పేద లేదా మిడిల్ క్లాస్ కుటుంబాలకు చెందిన సాధారణ సైనికులు, అమాయక ప్రజలు మాత్రమే.

కానీ ఏసీ గదుల్లో కూర్చుని యుద్ధాన్ని నడిపించే ప్రభుత్వ పెద్దలకు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఇదొక లాభదాయకమైన ‘ఇన్వెస్ట్‌మెంట్’. దేశీయ సమస్యల నుంచి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కూడా పాలకులు యుద్ధాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు.

యుద్ధం వల్ల ధనిక దేశాలు, కార్పొరేట్ శక్తులు మరింత ధనికంగా మారతాయి; పేద దేశాలు మరింత పేదవి అవుతాయి. యుద్ధం ఒక వ్యాపారంగా ఇలా ఉన్నంత కాలం ప్రపంచశాంతి ఒక కలగానే మిగిలి ఉంటుంది…

( ఎకనమిక్ టైమ్స్ కథనానికి స్వేచ్ఛానువాదం.... పమిడికాల్వ మధుసూదన్    9989090018  )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యుద్ధం ఒక డ్రామా… ఒక వ్యాపారం… అసలు చేదు నిజాలు ఇవీ…!
  • Peddi Anantha Sriram … రాతలే కాదు, కూతలూ అలాగే ఉన్నయ్…
  • ఏం చేయాలో ఎటూ తేల్చరు… ఏటా కోట్ల మెయింటెనెన్స్ ఖర్చు…
  • కుట్రతో సంబంధం లేకపోతే… కుట్రదారులను కలిసే పనేముంది..?!
  • ఒక విలనీ అత్త… ఒక హీరో అల్లుడు… ఓ మాస్ మసాలా పల్లీ బఠానీ…
  • తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ సీటు..? నో వే…!!
  • కాలా హిరణ్..! పాపం, సల్మాన్ వ్యక్తిత్వ హక్కులకు విఘాతం అట..!!
  • రెండు కొప్పుల ‘సివిల్’ వార్‌… చివరకు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం..!!
  • ఆలియా భట్..! చెప్పే మాటలకూ చేసే పనులకూ ఎంత తేడా..?!
  • దృఢం..! జీతూ జోసెఫ్ మార్క్ ‘దృశ్యం’ లేదు… దృఢంగా లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions