Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెళ్లి తంతు కూడా ముఖ్యమే! రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు!!

July 2, 2026 by M S R

.

చాలాకాలం కాలేదు… మూణ్నాగేళ్ల క్రితమే… మా బంధువే… డిపెండెంట్ వీసా కోసం యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లింది… స్లాట్ వోకే, భర్త తాలూకు కొలువు, సాలరీ, వీసా కేటగిరీ ధ్రువీకరణలతోపాటు పెళ్లి సర్టిఫికెట్ ఒరిజినల్, కాపీ తీసుకెళ్లింది… లోపలకు వెళ్లేముందు చెప్పాను… ఎందుకైనా మంచిది, మీ పెళ్లి బాపతు ఫోటోలు, అంటే తాళి కట్టేది, దండలు వేసుకుని మీరిద్దరూ నిలబడి ఉన్నది, హాజరైన బంధుగణం, భోజనాల ఫిజికల్ ఫోటోలు తీసుకెళ్లు అని చెప్పాను…

అవేమీ అడగరు, పెళ్లి సర్టిఫికెట్ చాలు అంటూనే… ఎందుకైనా మంచిదని ఫోటోలు కూడా తీసుకుపోయింది… వీసా విండో దగ్గర కాన్సులేట్ ఆఫీసర్ అన్నీ చూసి, మీ పెళ్లి ఫోటోలేమైనా ఉన్నాయా అనడిగాడు… ఆమె చూపించింది… వోకే, గుడ్ అంటూ స్టాంప్ వేశాడు ఆయన… ‘నీ మాట విని అవి తీసుకుపోవడమే నయమైంది అని నాతో చెబుతూ తేలికగా నిట్టూర్చింది ఆమె…

Ads

అవును, పెళ్లి సర్టిఫికెట్ అన్నిచోట్లా అందరూ నమ్మేస్తారని ఏమీ లేదు… సందేహమొస్తే రిజెక్షన్… దీనికితోడు బోలెడు ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుని, ఎవరెవరినో భర్తగా చూపించి, అమెరికాకు వెళ్లి, సొంతంగా కొలువులు వెతుక్కుని బతుకుతున్న కేసులు బోలెడు…

హిందూ వివాహాలకు సంబంధించి గుజరాత్ హైకోర్టు రీసెంటుగా ఇచ్చిన ఓ తీర్పు చదవగానే నాకు నా పాత అనుభవమే గుర్తొచ్చింది… ఈ తీర్పు ఒకరంగా మంచిదే, ఫేక్ సర్టిఫికెట్ల తంతుకు చెక్ అనిపించింది… పెళ్లికి రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు అని కోర్టు తేల్చిచెప్పింది… సరే మరి,, స్టేజ్ మ్యారేజీలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లిళ్లు, గుళ్లో పెళ్లిళ్ల మాటేమిటి అంటారా..? అదొక చిక్కు ప్రశ్న ఇప్పుడు..! వాటిని పెళ్లిళ్లు కావని అనలేం, సంప్రదాయిక తంతు మాత్రమే పెళ్లికి ధ్రువీకరణగా చూడలేం… కానీ సహజీవనాన్ని మాత్రం అసలు హిందూ వివాహ చట్టం గుర్తించదు (వాళ్లకు వివాహం తాలూకు ఏ రక్షణ లభించదు)…

వివాహం అనేది కేవలం పాటలు, నృత్యాల వేడుక మాత్రమే కాదని కోర్టు పేర్కొంది… సప్తపది వంటి సంప్రదాయ ఆచారాలను పాటించకుండా ఒక జంట కేవలం రిజిస్ట్రేషన్తో ఒక్కటైతే అది చట్టబద్ధమైన వివాహంగా పరిగణించలేమని వెల్లడించింది… అవును, విడాకులకైనా, మనోవర్తికైనా, భరణానికైనా విహిత పద్ధతిలో జరిగే వివాహం, ఎంత నిరాడంబరంగా జరిగినా సరే… సంప్రదాయం మేరకు జరగాలనేదే కోర్టు ఉద్దేశం…

జూన్ 23న వచ్చింది ఈ తీర్పు… సహజంగానే దీనిపైనా బోలెడు వాదోపవాదాలు… తిరోగమనం అంటూ వ్యాఖ్యలు… దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలకు సంబంధించి భౌగోళిక, సాంస్కృతికపరమైన వైవిధ్యాలు ఉన్నప్పటికీ… పెళ్లి తంతులో సంప్రదాయ ఆచారాలు, పద్ధతులు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్వభావాన్ని శుద్ధి చేసి, పరివర్తన చెందేలా చేస్తాయని కోర్టు వెల్లడించింది…

మూడు ముళ్లు, ఏడు అడుగులు వంటి ఆచారాలను పాటించడమే హిందూ వివాహానికి పునాది అని తేల్చిచెప్పింది… ఇవి వివాహానికి ఒక పవిత్ర సంస్కారాన్ని, ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది…

wedding

ఏమిటీ కేసు?
తాను ఎవరినీ పెళ్లి చేసుకోకపోయినా ఓ యువతి తన భార్యగా చెలామణి అయ్యేందుకు ప్రయత్నించిందని యూకేలో నివసించే కౌశల్ సోనార్ ఆరోపించాడు. ఆ యువతి అహ్మదాబాద్ లో నివసిస్తోందని, ఆమె తన తల్లిదండ్రులను సంప్రదించి, తనను వివాహం చేసుకున్నట్లుగా ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిందని చెప్పాడు… ఆ తర్వాతే ఆమె గురించి తనకు తెలిసిందని అన్నాడు… చట్టబద్ధంగా జరిగిందని యువతి చెబుతున్న ఈ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టును కోరాడు…

అసలు ఆమెను తాను వివాహం చేసుకోలేదని, ఎలాంటి హిందూ ఆచారాలు, వేడుకలు నిర్వహించలేదని, ఆమెతో భర్తగా ఎప్పుడూ కలిసి జీవించలేదని పేర్కొన్నాడు… తన సమ్మతి లేకుండా, మోసపూరితంగా వివాహ పత్రాలపై తన సంతకం తీసుకున్నారని ఆరోపించాడు… తమ మధ్య ఎటువంటి వివాహ సంప్రదాయాలు, వేడుకలు జరగలేదని, తాము ఎప్పుడూ భార్యాభర్తలుగా జీవించలేదని ప్రతివాది అయిన యువతి కూడా ఫ్యామిలీ కోర్టు ముందు అంగీకరించింది కూడా…

ఇది హిందూ కుటుంబాలకు సంబంధించి… మరి ఇతర మతస్థులైతే… అదయినా సరే ఆయా మత, సమూహాల సామాజిక, సంప్రదాయిక తంతు నిర్వహించబడాలనేదే కోర్టు భావన..! మొత్తానికి ఇంట్రస్టింగ్ అండ్ డిబేటబుల్ తీర్పు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లి తంతు కూడా ముఖ్యమే! రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే సరిపోదు!!
  • అంతటి స్టార్ డైరెక్టర్ దాసరి ఆ హీరో కాళ్లు ఎందుకు మొక్కాడు..?!
  • డర్టీ మొగుడు- కామ ఖాకీ…! చామెట్ యాప్‌లో బరిబాతల దందా!
  • Unsung Hero – అమెరికన్ గడ్డ మీద ఓ ఇండియన్ గదర్!
  • ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర! – సూత్రధారి ఈ సెంథిల్ బాలాజీ..?
  • H-Fast – హైదరాబాద్‌ కడుపుకి చికిత్స – ఫుడ్ సేఫ్టీ హల్‌చల్ !!
  • మావిగన్! ఆంధ్రుల రాజధాని ఇక ఎప్పటికీ ఓ ప్రశ్నార్థకమే!!
  • గోల్డ్ మార్కెట్! మన ‘బంగారు తల్లుల’ కొత్త పాఠాలు – అనూహ్య మార్పు!!
  • ‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!
  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions