.
అవును, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పదవీకాలం ముగుస్తోంది… చంద్రబాబు ఆలోచన విధానాలు తెలిసిన వారెవ్వరూ ఆయన్ని కొనసాగిస్తారంటే నమ్మలేరు… అసలు ఆయన్ని టీటీడీ చైర్మన్‌ను చేయడమే పెద్ద విస్మయం… తన చానెల్‌ను పూర్తిగా చంద్రబాబుకు అంకితం చేశాడు కాబట్టి కృతజ్ఞతగా ఆ పోస్టు ఇచ్చాడనేదీ నమ్మలేం, ఎందుకంటే, చంద్రబాబు డిక్షనరీలో విధేయత, కృతజ్ఞత వంటి అర్థరహిత, లాభరహిత పదాలు ఉండవు… తన సమీకరణాలు చాలాసార్లు చాలామందికి అర్థం కావు కూడా..!
సరే, లోగుట్టు తిరుమల పెరుమాళ్లకెరుక… ఆయన తన పదవీకాలంలో ఉద్దరించింది ఏమీ లేదు, తన ముద్ర వీసమెత్తు లేదు, ఉండదు, అదీ ఊహించిందే… తనతో టీటీడీ ఉన్నతాధికారులకూ పొసగలేదు… పూర్ అడ్మినిస్ట్రేటర్ అంటారు మరి… కానీ ఎవరు నెక్స్ట్..? ఆసక్తికరం… ఎందుకంటే..? అది కేబినెట్ పోస్టుకన్నా పవర్‌ఫుల్… దేవుడి సేవకన్నా దేశవ్యాప్తంగా హైప్రొఫైల్ సర్కిల్‌తో పరిచయాలకు ఉపయుక్తం కాబట్టి… ఇంకా చాలా…
Ads
ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం ఏమిటంటే… చంద్రబాబు ఈసారి ఆ చైర్మన్ పదవిని ఓ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాస రామానుజంకు ఇస్తాడని! నిజంగా తను ఓ ఆధ్యాత్మిక వేత్తా..? అసలు పేరు కూచి లోకాద్రినాయుడు అట… చాలా వివరాలను సైట్లు రాసుకొస్తున్నాయి… అందులో ఓ పేరా అమితంగా ఆశ్చర్యపరిచింది…
- తిరుమల బ్రహ్మోత్సవాలకు లోకాద్రినాయుడు భార్య, ఇతర కుటుంబ సభ్యులు వెళ్లారు… టీటీడీ ఉన్నతాధికారి ఒకరు పదే పదే ఫాలోఅప్ చేస్తూ, అత్యంత ఘన స్వాగతం పలికాడు… 15 మందితో భద్రత కల్పించారు… హైలెవల్ ప్రొటోకాల్ మర్యాదలు చేశారు… దేవుని తర్వాత రెండో హారతి శ్రీనివాస కుటుంబ సభ్యులకే ఇచ్చారు…
ఈ రెండో హారతి అనేదీ ఆశ్చర్యం కలిగించలేదు, టీటీడీ అధికార వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టించిందీ అంటే, తమకు కావల్సిన ప్రముఖుడు వస్తే, అవసరమైతే ఉత్సవ విగ్రహాలను అలిపిరి దాకా తీసుకొస్తారేమో అని మనం వైరాగ్యంతో అనుమానించేంత..!!
సరే, ఎవరు ఈ లోకాద్రి… నిజాలో అబద్దాలో… సగం సగమో… తెలియదు గానీ… పైపైన ఓసారి పరికిస్తే మరింత విస్మయం తప్పనిసరి… తనది చిత్తూరు జిల్లా, పూతలపట్టు… తిరుపతిలో ఉండేవాడు… రిలయెన్స్ పీఆర్ఓ… తిరుపతిలో వ్యాపారాలు చేసినప్పుడు కోట్ల అప్పులు… తరువాత నష్టాలు… దీంతో 2011లోనే తిరుపతిని వదిలి వెళ్లిపోయాడు…
పదేళ్లు తిరిగేసరికి… సినిమాటిక్‌గా… సీన్ మారిపోయింది… కరోనా వేళకు అప్పులిచ్చినోళ్లందరికీ మిత్తీతో సహా చెల్లించేశాడట… 125 కోట్లు… ఏం చేసి సంపాదించాడు..? పెద్ద మిస్టరీ… ఆయన తండ్రి జ్యోతిష్కుడట… సో, ఇంట్లో ఓ స్పిరిట్యువల్ వాతావరణం ఉండేదేమో… తరువాత చినజియ్యర్ ద్వారా వైష్ణవం స్వీకరించి లోకాద్రి కాస్తా శ్రీనివాస రామానుజం అయ్యాడు…
- ఆర్ఎస్‌ఎస్‌తో బంధాలు, బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు… మైనింగ్, పాలవ్యాపారం… ఒంగోలులోని ఓ ప్రముఖ డెయిరీ తనదేట… ఏకంగా మోడీ షాలకు ఫోన్లు చేసి మాట్లాడేంతగా ఎదిగాడని ప్రచారం… జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర..? అంత పవర్‌ఫుల్ ‘స్వామి’గా ఎలా రూపాంతరం చెందినట్టు..?
అసలు ప్రచారంలో మరింత విస్మయం కలిగించింది మరొకటి ఉంది… ఆ మధ్య విజయవాడలో అతని పెద్ద కుమారుడు జశ్వంత్ వివాహానికి సీఎం చంద్రబాబుతో సహా 95 మంది ఎమ్మెల్యేలు, డీజీపీ, సీఎస్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు… ప్రస్తుతం తాడేపల్లి నివాసం… సొంత విమానం… మొన్నటి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉండవల్లి నివాసంలో హోమం నిర్వహణ మొత్తం ఈయనే చూసుకున్నాడట… ఐతే ఆ రేంజ్ ‘పవర్ సెంటర్’ జస్ట్, టీటీడీ చైర్మన్ పోస్టులో బందీ అవుతాడా..? అదీ అసలు ప్రశ్న..!!
ఐతే… తన గురించి వినిపిస్తున్న ఈ సమాచారం అంతా కేవలం ప్రచారమేనా… లేక సాంతం నిజమేనా..? ఏమో… చదవడానికి, చెప్పుకోవడానికి మాత్రం చాలా ఆసక్తికరంగా… ఓ సినిమా కథలా బాగుంది..!!
Share this Article