.
Bhavanarayana Thota ……. నక్కీరన్ గోపాల్ హీరో ఎలా అయ్యాడు? తమిళనాట నక్కీరన్ గోపాల్ ఒక సంచలనం. వీరప్పన్ ను చాలాసార్లు కలుసుకున్న జర్నలిస్టుగా, ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం నడిపిన వాడిగా, మూడున్నర దశాబ్దాల క్రియాశీల వృత్తి జీవితంలో 261 ఎఫ్‌ఐఆర్‌లు మరియు 213 పరువు నష్టం కేసులను ఎదుర్కున్నవాడిగా అందరికీ తెలిసినవాడే.
ఇండియాటుడే లాంటి సంస్థతో గొడవపడి ప్రెస్ కౌన్సిల్ కి వెళ్ళి ఒక సారి గెలిచినా, మరోసారి మాత్రం అదే ఇండియాటుడే అతడి తప్పును నిరూపించింది. ఇంకోవైపు మధ్యవర్తిత్వం పేరుతో వీరప్పన్ దగ్గరికి డబ్బు సంచులు మోసుకెళ్ళాడన్న విమర్శలకు సూటిగా సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇన్నిరకాల మెరుపులు, మరకలు కనబడే నక్కీరన్ గోపాల్ కథేంటో చూద్దాం.
Ads
ఆర్ రాజగోపాల్ అలియాస్ నక్కీరన్ గోపాల్ మొదట్లో ఒక లే ఔట్ ఆర్టిస్ట్. ఎమ్జీఆర్ సారధ్యంలో నడిచే ‘తాయ్’ అనే పత్రికకు ఎడిటర్ గా ఉన్న వలంపురి జాన్ అతనికి ఆ అవకాశమిచ్చాడు. ఇంకాస్త మెరుగైన పత్రికలో పనిచేయాలన్న లక్ష్యంతో ‘తరాసు’ అనే రాజకీయ వారపత్రికలో చేరాడు. అతడి లే ఔట్ వల్ల తరాసుకు బాగా పేరొచ్చింది. అలా పనిచేస్తూ సంపాదించిన అనుభవం అతణ్ణి సొంత పత్రిక పెట్టాలన్న ఆలోచనవైపు నడిపించింది. సుబ్బు అనే రాజకీయ నాయకుడి దగ్గర ఉన్న ‘నక్కీరన్’ టైటిల్ బాగా నచ్చింది.
- నక్కీరన్ అంటే ఎవరు..? ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యంలో ఉన్న నక్కీరుడనే కవి కథ. ఒక పేద బ్రాహ్మణుడి దీనావస్థకు జాలిపడి శివుడే ఒక పద్యం ఇచ్చి రాజు దగ్గరకు పంపుతాడు. ఆ పద్యం విని రాజు గారు బహుమానం ఇస్తే అతడి కష్టాలు తీరతాయన్నది శివుడి ఆలోచన. కానీ రాజుగారి ఆస్థాన కవి నక్కీరుడు మాత్రం ఆ పద్యం తప్పు అంటాడు. చేసేదేం లేక ఆ పేద బ్రాహ్మణుడు తిరిగివచ్చి మారువేషంలో ఉన్న శివుడికి చెబుతాడు. కోపం కట్టలు తెంచుకున్న మారు వేషపు శివుడు ఆ బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకొని ఆస్థానానికి వచ్చి వాదనకు దిగుతాడు. నక్కీరుడు ససేమిరా అంటాడు. శివుడు తన నిజ స్వరూపం చూపిస్తాడు. నువ్వు శివుడివైనా,మూడోకన్ను తెరిచినా సరే తప్పుతప్పేనంటాడు నక్కీరుడు. తట్టుకోలేనంత కోపంతో నక్కీరుణ్ణి శపించినా, ఆ తరువాత శాప విమోచనం చెబుతాడు శివుడు.
నక్కీరన్ గోపాల్ … ఆ కథ సంగతలా ఉంచితే నక్కీరుడి పేరు ఆకట్టుకోవటంతో ఆ పేరుతో 1988 లో పత్రిక పెట్టిన ఆర్ రాజగోపాల్ ఆ తరువాత కాలంలో నక్కీరన్ గోపాల్ అయ్యారు. ఆ పత్రిక టాగ్ లైన్ ‘నెట్రిక్కణ్ తిరైప్పినాలుమ్ కుట్రమ్ కుట్రమే’ (మూడో కన్ను తెరిచినా తప్పు తప్పే). అలా టైటిల్ తెచ్చుకున్న గోపాల్ కు న్యూస్ ప్రింట్ అప్పు మీద దొరకటం కూడా కలిసి వచ్చింది. ఒక చిన్న గదిలో నక్కీరన్ వారపత్రిక మొదలైంది. పరిశోధనాత్మక కథానాలకు తోడు గోపాల్ లే ఔట్ కూడా ప్రత్యేకంగా ఉండటంతో పాఠకులను బాగానే ఆకట్టుకుంది. ఏ ఆటోడ్రైవర్ చేతిలో చూసినా నక్కీరన్ కనిపించేది. పత్రిక ఐదో ఏట శివసుబ్రమణ్యం అనే ఫొటోగ్రాఫర్ వల్ల ఊహించని విజయం సాధించింది.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి జనం కథలు కథలుగా చెప్పుకుంటున్న సమయమది. అసలు వీరప్పన్ అనేవాడు ప్రాణాలతో లేకపోయినా, స్మగ్లర్లు అతని పేరు చెప్పి వ్యాపారం చేసుకుంటూ ఉన్నారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో వీరప్పన్ కు దూరపు బంధువైన శివసుబ్రమణ్యం అనే ఫొటోగ్రాఫర్… చాలా కష్టం మీద వీరప్పన్ ను కలుసుకునే మార్గం సంపాదించాడు.
వీరప్పన్‌తో భేటీ… ఒక టేప్ రికార్డర్, కెమెరా తీసుకొని బయలుదేరి అంచెలంచెలుగా అడవిలో నడుస్తూ పది రోజులకు వీరప్పన్ ను కలిశాడు. వీరప్పన్ బ్రతికే ఉన్నాడనే విషయం బయటి ప్రపంచానికి తెలియాలని, అతని మనసులో మాట కూడా తెలియాలని నచ్చజెప్పాడు. అలా ఒప్పించి ఫోటోలతోబాటు అతడి మాటలు కూడా రికార్డు చేసి తీసుకొచ్చాడు. అప్పటికి ‘పోలీస్ సెయిది’ అనే పత్రికకు స్ట్రింగర్ గా పనిచేస్తున్న శివసుబ్రహ్మణ్యం మద్రాసు చేరుకొని ఇవి ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించాడు.
(వీరప్పన్ తో గోపాల్, ఫొటోగ్రాఫర్ శివసుబ్రహ్మణ్యం)
సంచాలనాలకు మారుపేరుగా ఉన్న ‘తరాసు’ గుర్తుకొచ్చింది. నక్కీరన్ కంటే ముందు గోపాల్ పనిచేసిన ‘తరాసు’ అనే రాజకీయ పత్రిక చాలా దూకుడుగా ఉండేది. అందుకే శివసుబ్రహ్మణ్యం అక్కడికెళ్లాడు. తన సాహసాన్ని వివరించి ఫోటోలు చూపించాడు. టేప్ రికార్డర్ లో వీరప్పన్ ఆడియో వినిపించాడు. కానీ ఆ పత్రిక ఎడిటర్ శ్యామ్ వాటిని ప్రచురించటానికి వెనుకాడాడు.
జయలలితకు వ్యతిరేకం… అని ముద్రపడ్డ ‘తరాసు’ మీద ఆమె అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఆమె అభిమానులు దాడి జరిపారు. ఉన్నట్టుండి అలా ఆ పత్రిక ఆఫీసు మీద దాడి జరగటంతో భయపడ్డ ఇద్దరు ఉద్యోగులు భవనం మీద నుంచి దూకి చనిపోవటం అప్పట్లో ఒక పెను విషాదం, సంచలనం. (ఆ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు శ్యామ్ ఆ తరువాత కాలంలో తప్పుకొని న్యాయవాద వృత్తిలోకి దిగారు. ఇప్పుడు టీవీ చర్చల్లో కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆ సంగతి గుర్తుచేస్తే అదొక పీడకల అని మాత్రమే అంటారు.)
ఏ పత్రికలో వేయిద్దాం..? తరాసు శ్యామ్ వద్దనటంతో శివసుబ్రహ్మణ్యం చూపు నక్కీరన్ గోపాల్ వైపు మళ్ళింది. గోపాల్ ఈ ఫోటోల విలువను క్షణాల్లో అంచనావేశాడు. అదే అతడి గొప్పదనం. 15 రోజుల కిందటే… అంటే వీరప్పన్ దగ్గరికి వెళ్ళటానికి ముందే శివసుబ్రహ్మణ్యం తమ పత్రికలో చేరినట్టు రిజిస్టర్ లో రాసి సంతకాలు పెట్టించుకొని, ఒక నెల జీతం ఇచ్చి తమ ఉద్యోగిగా ముద్ర వేశాడు. నక్కీరన్ తరఫున వీరప్పన్ దగ్గరికి పంపినట్టు చెబుతూ తమ రాబోయే సంచికలో సంచలనాత్మక ఫోటోలతో కథనం వస్తున్నట్టు పోస్టర్లు సిద్ధం చేశారు. ఈలోపు శివసుబ్రహ్మణ్యం తన సాహసం గురించి కొంతమంది ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాడు.

ఇండియాటుడే రంగంలోకి… ఇండియా టుడే లాంటి పత్రిక అయితే బాగా డబ్బులిస్తుందని, నక్కీరన్ కు ఇచ్చినవి కాకుండా వేరే యాంగిల్ ఫోటోలు ఇమ్మని వాళ్ళు సలహా ఇవ్వటంతో అక్కడికెళ్ళాడు. వాళ్ళు ఫోటో ఫిల్మ్ నెగటివ్స్ కూడా తీసుకుని, అవి ఒక ఫ్రీలాన్సర్ గా తీసిన ఫోటోలని అతనిచేత రాయించుకొని బాగానే ముట్టజెప్పారు. మొత్తానికి అటు ఇండియాటుడే, ఇటు నక్కీరన్ ఒకేసారి మార్కెట్లోకి పోస్టర్లు రిలీజ్ చేశాయి.
పోటాపోటీగా విడుదల… 1993 మే 1 నాడే రెండు సంచికలూ వచ్చాయి అంతకు ముందే ఏప్రిల్ 24 సంచికలో ఈ కథనం గురించి ప్రకటించామని, కొన్ని టేపులు మరిచిపోతే మళ్ళీ అడవికెళ్ళారని గోపాల్ చెప్పినా, శివసుబ్రమణ్యం మద్రాసులోనే ఉన్నాడని తేలింది. ఏమైనా, ఇండియా టుడే 1993 మే 1 సంచికలో వచ్చిన కథనాన్ని exclusive అని చెప్పుకోవటం మీద రచ్చ మొదలైంది.
ఇండియాటుడే దోషి… తమ రిపోర్టర్ ను ధనబలంతో కొన్నారని నక్కీరన్ ఆరోపించింది. గోపాల్ ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశాడు. ఇండియా టుడేను ఉత్తరాది పత్రికగా భావించే తమిళ పత్రికలు గోపాల్ ను సమర్థించాయి. తమిళ ఎడిటర్లు తనకు అనుకూలంగా ఇచ్చిన లెటర్స్ ను కూడా గోపాల్ ప్రెస్ కౌన్సిల్ కు పంపాడు. తాను freelance journalist అని తనే వచ్చి చెప్పుకున్నాడని, స్వయంగా ఇంటర్వ్యూ చేశానని చెప్పాడని, అతడి మీద ఎలాంటి వత్తిడీ చేయలేదని ఇండియాటుడే వాదించింది. ఏమైనా, బలహీనుల పక్షాన ఉండాలని భావించిన ప్రెస్ కౌన్సిల్ .. ఇండియాటుడేను దోషిగా తేల్చింది.
నక్కీరన్ పత్రికకు విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. దీంతో వార పత్రికను వారానికి రెండుసార్లుగా మార్చి ప్రచురించక తప్పలేదు. అప్పటివరకూ ఫోటోలు, ఆడియో టేపులు మాత్రమే అందుబాటులో ఉండగా వీరప్పన్ వీడియో ఇంటర్వ్యూ చేయాలని గోపాల్ నిర్ణయించుకున్నాడు. అలా శివసుబ్రహ్మణ్యాన్ని వెంటబెట్టుకొని స్వయంగా అడవుల్లోకి వెళ్ళి సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేసుకొచ్చాడు.
జయలలిత మీద ఘాటైన విమర్శలు ఉండటంతో 5 ఎపిసోడ్స్ గా ప్రసారం చేయటానికి సన్ టీవీ ముందుకొచ్చింది. ఆ వీడియో టేపులకు సన్ టీవీ పెద్దమొత్తంలో గోపాల్ కు డబ్బిచ్చినట్టు మీడియావాళ్ళు చెప్పుకున్నారు గానీ గోపాల్ గానీ, సన్ టీవీ గానీ ధ్రువపరచలేదు. గోపాల్ మాత్రం మీడియాలో ఒక హీరో అయ్యాడు.
( గోపాల్ డబ్బు సంచులు మోసుకెళ్ళాడన్న విమర్శలు ఎందుకొచ్చాయి? రాజ్ కుమార్ కిడ్నాప్ సమయంలో కొన్నాళ్ళకు గోపాల్ దౌత్యాన్ని వద్దని వీరప్పన్ ఎందుకన్నట్టు? వీరప్పన్ చనిపోయినప్పటి ఫోటోలమీద ఇండియా టుడే వేసిన కేసులో గోపాల్ ఎలా ఓడిపోయాడు? 200 కు పైగా కేసులు, 8 నెలలపాటు జైలు జీవితం గడపటం వెనుక ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు, సందర్భాలతో ఇంకో భాగం త్వరలో) – తోట భావనారాయణ
Share this Article