.
దేశభక్తి… దైవభక్తి… ఇదే ఇప్పుడు భారతీయ సినిమా కొత్త ట్రెండ్..! ఒకప్పుడు దేశభక్తి సినిమాలు వస్తే… “ప్రొపగాండా” అని కొట్టిపారేసేవారు. ఇప్పుడు అదే దేశభక్తి సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి.
ఒకప్పుడు దేవుళ్ల కథలు తీస్తే “పాతకాలం సినిమా” అనేవారు. ఇప్పుడు రామాయణం నుంచి శివాజీ మహారాజ్ వరకు… భారత చరిత్ర, భారత వీరులు, భారతీయ సంస్కృతి వెండితెరపై మళ్లీ పునర్జన్మ పొందుతున్నాయి.
Ads
ప్రేక్షకుడి అభిరుచి మారిందా…? లేక సినిమా ప్రపంచమే ప్రేక్షకుడి మనసును ఇప్పుడు అర్థం చేసుకుందా…? ఈ చర్చ జరుగుతుండగానే మరో సినిమా సంచలనానికి సిద్ధమవుతోంది. ‘చౌహాన్’
అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌లో ఒక్క డైలాగ్ చాలు… “పఠానులకు చెప్పండి… చౌహాన్ వస్తున్నాడు!” అని వినిపించగానే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఈ సినిమా 2018లో జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన వివాదాస్పద ఘటనను స్ఫూర్తిగా తీసుకున్నదనే ప్రచారం సాగుతోంది.
ఆ రోజు… సాధారణ విధుల్లో వెళ్తున్న భారత సైన్యంపై భారీ రాళ్లదాడి జరిగింది. సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌పై దాడి జరిగింది. ప్రభుత్వ ఆయుధాలను లాక్కునే ప్రయత్నం జరిగిందని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.
పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో సైన్యం ముందుగా హెచ్చరిక కాల్పులు జరిపింది. అయినా గుంపు వెనక్కి తగ్గకపోవడంతో కాల్పులు జరిగాయి. ముగ్గురు పౌరులు మరణించారు. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా పెద్ద వివాదం మొదలైంది.
అప్పటి మేజర్ ఆదిత్య కుమార్, ఆయన యూనిట్‌పై FIR నమోదైంది. కానీ AFSPA అమల్లో ఉన్న ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న సైనికుడిపై కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా క్రిమినల్ చర్యలు తీసుకోలేరని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఆ వ్యవహారంలో జోక్యం చేసుకుంది.
ఆ తర్వాత ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు మేజర్ ఆదిత్య కుమార్‌కు శౌర్య చక్ర కూడా లభించింది.

ఇప్పుడు… ఆ సంఘటనకు సినీ రూపం ఇవ్వబోతున్నారని టీజర్ చెబుతోంది. ఈ సినిమా ఎలాంటి కథ చెబుతుందో విడుదలైన తర్వాతే తెలుస్తుంది. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిందే…
- సరిహద్దులో తుపాకీ ఎదుర్కొనే సైనికుడు… రాళ్లదాడి ఎదురైనా ఎంతవరకు ఓపిక పట్టాలి? తన తోటి జవాన్ ప్రాణం ప్రమాదంలో పడితే… చట్టాన్ని కాపాడాలా? లేక ముందుగా సహచరుడి ప్రాణాన్ని కాపాడాలా? ఇలాంటి క్లిష్ట నిర్ణయాలే సైనిక జీవితాన్ని సాధారణ ఉద్యోగం నుంచి దేశసేవగా మార్చేస్తాయి.
ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
దేశభక్తి…
దైవభక్తి…
చరిత్ర…
నిజ జీవిత వీరుల కథలు…
ఇవే ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్న అంశాలు. అందుకే ‘చౌహాన్’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా అవుతుందా… లేక దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసే చిత్రంగా నిలుస్తుందా… అనేది 2027 అక్టోబర్ 1న తేలిపోతుంది.
కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు… మన సైనికులు సరిహద్దుల్లో నిలబడి ఉంటేనే… మన ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. వారిపై సినిమా తీసినా… తీసుకోకపోయినా… వారి త్యాగానికి సెల్యూట్ మాత్రం ఎప్పటికీ తగ్గదు…
Share this Article