Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?

July 10, 2026 by M S R

.

ఎస్, డెఫినిట్‌గా యండమూరి నవలారచన కెరీర్‌లో అంతుర్ముఖం ఓ మంచి నవల… కమర్షియల్ వాసనల్లేని ఓ లోతైన రచన… అది యండమూరిలో కాలక్రమేణే క్రమేపీ పెరిగిన పరిణతినీ బయటపెట్టిన నవల… సినిమాల కోసం రాసిన నవలలు, వీక్లీ సీరియల్స్ కోసం, అప్పట్లో నవలల మీద పాఠకుల్లో ఉన్న క్రేజును సొమ్ము చేసుకోవడం కోసం రాసిన నవల కాదు…

Naresh Gadapa ఫేస్ బుక్‌లో అంతర్ముఖం నవలపై రాసిన ఓ డిఫరెంట్ రివ్యూను యండమూరి షేర్ చేసుకున్నారు. సదరు రివ్యూయర్‌ను అభినందిస్తూ… తన ఫేస్ బుక్ వాల్ మీద… ఇంట్రస్టింగు… (ఆ ఇద్దరికీ ధన్యవాదాలతో ఓసారి ఇలా… ఇదుగో… యథాతథంగా…)

Ads



మనసు లోతుల్లోకి ఒక ప్రయాణం – యండమూరి ‘అంతర్ముఖం’ గురించి… నిజ జీవితంలో ఒక ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన సంఘటన…. తను చూసిన స్టోరీ…

నా బి.టెక్ క్లాస్‌మేట్, నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు, హైదరాబాద్‌కు వచ్చిన మొదట్లో మాతోనే ఉండేవాడు. తర్వాత స్వంత ఊరు గన్నవరం వెళ్ళిన తర్వాత కొంత కాలం అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. తరువాత ఒక రోజు అతను స్వంత ఊరిలో చెడు స్నేహాలతో అయిన మద్యపాన వ్యసనంతో ఆరోగ్యం దెబ్బతిని మరణదశలో ఉన్నాడని తెలిసింది. నేను, మా మరో స్నేహితుడు వెంటనే విజయవాడ వెళ్లి అతన్ని చూశాం.

చిన్న వయసులోనే జీవితం చేతులారా జారిపోతున్న అతని పరిస్థితి చూసి కన్నీళ్లు ఆగలేదు. అతను తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఇద్దరు పెళ్లైన అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ముందే చనిపోయారు, తల్లి అతన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నిస్తుంది.

అతన్ని ఎలా అయినా కాపాడాలని మేము కూడా ప్రయత్నించాం. వైద్యులు చెప్పింది ఒక్కటే, కాలేయ మార్పిడి జరిగితే బ్రతికే అవకాశం ఉందని. అవసరమైతే నేను గానీ, నా స్నేహితుడు గానీ కాలేయం దానం చేయడానికి సిద్ధమే అనుకున్నాం.

కానీ సమస్య డబ్బు. అది నోట్ల రద్దు కాలం. కుటుంబానికి ఆస్తులు ఉన్నా, వాటిని నగదుగా మార్చడం అంత సులభం కాదు. ఈ విషయాన్ని అతని అక్కతో మాట్లాడితే, “అవసరం లేదు, డాక్టర్లు కూడా చనిపోతాడనే చెప్పారు”అన్నట్లుగా నిర్లిప్తంగా స్పందించింది. కానీ వైద్యులు మాతో చెప్పింది మాత్రం వేరే. సరైన దాత దొరికితే అతను బ్రతికే అవకాశముందని స్పష్టంగా చెప్పారు.

ఆ క్షణంలో ఒక చేదు నిజం అర్థమైంది. అతని మద్యపానం వల్ల కుటుంబం అనుభవించిన బాధలు, పరువు నష్టం, నిరాశలు, ఇవన్నీ కలసి వారి ప్రేమను అలసిపోయేలా చేశాయి. కొన్నిసార్లు మనిషి మీదున్న ప్రేమకన్నా, అతని వల్ల కలిగిన బాధలే పెద్దవిగా మారిపోతాయి. అతను లేకపోతే ఆస్తులు మాకే పూర్తిగా వస్తాయి అనే స్వార్ధం కూడా వారిలో ఉంది. నాలుగు రోజుల తర్వాత అతను చనిపోయాడు. నిర్జీవంగా అతన్ని చూడలేక నేను అంత్యక్రియలకు కూడా వెళ్లలేదు.

ఆ సంఘటన తర్వాత ఒక ప్రశ్న నన్ను చాలా కాలం వెంటాడింది. మనల్ని నిజంగా, అమితంగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?

మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, మనం వారికి ఉపయోగపడుతున్నప్పుడు ప్రేమించడం సులభం. కానీ ఒక్కసారిగా అన్నీ కోల్పోతే? మంచానికే పరిమితమైతే? మనం ప్రేమను తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉంటే? అప్పటికీ ఎవరైనా మన పక్కనే ఉంటారా? లేక “ఎప్పుడు ముగుస్తుందా ఈ భారము?” అని ఎదురు చూస్తారా?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికిన నవలే యండమూరి వీరేంద్రనాథ్ రచించిన “అంతర్ముఖం”.

ముఖం మనిషి మనసుకు ప్రతిరూపమని అంటారు. కానీ ప్రతి మనిషికీ రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ప్రపంచానికి కనిపించే ముఖం, కృత్రిమ చిరునవ్వులతో, మర్యాదలతో అలంకరించబడినది. ఇంకొకటి ఎవరికీ కనిపించని లోపలి ముఖం, మన నిజమైన స్వరూపాన్ని, మన బలహీనతలను, మన స్వార్థాలను, మన ప్రేమను ప్రతిబింబించేది. అదే అంతర్ముఖం.

ఆ కాలంలో యండమూరి రచనలు ఎక్కువగా పత్రికల్లో ధారావాహికలుగా వచ్చేవి. అయితే అంతర్ముఖం అందుకు భిన్నంగా నేరుగా నవల రూపంలో వచ్చింది. దానికి కారణం కూడా ఆయనే చెప్పారు. ధారావాహిక అయితే ప్రతి వారాంతంలో ఉత్కంఠ రేపే ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ కథ యొక్క ఆత్మ అలాంటి నిర్మాణాన్ని అంగీకరించదని ఆయన భావించారు.

కథ మంచానపడి మరణానికి సిద్ధంగా ఉన్న ఓ వృద్ధుడి ఆలోచనలతో ప్రారంభమవుతుంది. కొద్దిసేపటికే అతను మరణించి స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ దేవుడితో ఒక వాదన చేస్తాడు. మరణం తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు తనను ప్రేమతో గుర్తు చేసుకుంటారని, ఆ ప్రేమను దేవుడు కూడా చెరపలేడని వాదిస్తాడు. తన మాట నిజమని నిరూపించుకోవడానికి మళ్లీ భూమ్మీదికి వస్తాడు.

కానీ ఒక పొరపాటు వల్ల అతను పూర్తిగా మంచానికే పరిమితమైపోతాడు.

అక్కడి నుంచి కథ మనిషి సంబంధాల అసలు స్వరూపాన్ని ప్రశ్నించడం మొదలుపెడుతుంది. తన కోసం ప్రాణం ఇస్తామని చెప్పినవాళ్లు క్రమంగా దూరమవుతారు. అతని మరణం కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులే చివరకు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేస్తారు. అక్కడి నుంచి అతన్ని బయటికి తోసేస్తారు. ఆ దయనీయ పరిస్థితుల్లో అతనికి ఒక నిర్ణయం వస్తుంది, దేవుడే నిజం చెప్పాడేమో; ప్రతి ప్రేమ వెనుకా ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుందేమో అని.

అప్పుడు అతను దేవుడిని మరణాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు.

దారిలో కనిపించిన ప్రణవి తన అభిప్రాయాన్ని మారుస్తుంది.

ఆమె ఎవరు? సెంటిమెంట్లను ఎగతాళి చేసే, ప్రతి మనిషిలోనూ లోపాలనే వెతికే అతని జీవితంలో ఆమె ప్రవేశం ఎలా జరిగింది? “మనుషుల బలహీనతలను నువ్వు లోపాలుగా చూస్తున్నావు” అని అతని ఆలోచనలను ఎలా మార్చింది? మనుషులను ప్రేమించేవాడిగా ఎలా మలిచింది. దేవుడి దగ్గరకు వెళ్లి “నేనే తప్పు” అని ఒప్పుకోబోయే క్షణంలో ప్రణవి అతనికి ఏమి చెప్పింది?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే అంతర్ముఖం.

ఈ నవల మొత్తం మొదటి వ్యక్తి దృష్టికోణంలో, “నేను” అనే స్వరంతో సాగుతుంది. అందువల్ల కథానాయకుడి ఆలోచనలు, సందేహాలు, కోపాలు, నిరాశలు, జీవిత విశ్లేషణలు అన్నీ పాఠకుడి మనసులోనే జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి. ఇది కేవలం కథ కాదు; మనుషుల ప్రవర్తనపై, బంధాలపై, ప్రేమపై, స్వార్థంపై ఒక లోతైన మానసిక విశ్లేషణ.

మనిషి బాహ్య ప్రవర్తనకీ, అంతరంగంలో దాగి ఉన్న భావాలకీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని; ప్రేమలోని ఔన్నత్యాన్ని, ప్రేమ పేరుతో తమను తాము మోసం చేసుకునే మనుషుల బలహీనతలను, స్వార్థం, అబద్ధాలు బంధాలను ఎలా నెమ్మదిగా శిథిలం చేస్తాయో యండమూరి అత్యంత సహజంగా, అసాధారణమైన పరిశీలనతో చిత్రించారు.

నిజాయితీ లేని ప్రేమ ఎంత భయంకరంగా మారుతుందో, ఎంతో ప్రేమతో పెంచిన పిల్లలే ఓపిక క్షీణిస్తే వృద్ధ తల్లిదండ్రుల హృదయాలను ఎలా గాయపరుస్తారో, ప్రేమ ముసుగులో మనుషులు ఎంత నాటకీయతను ప్రదర్శిస్తారో కళ్లకు కట్టినట్లు చూపించే నవల ఇది. ఒక రియాలిటీ.

చదివిన తర్వాత ఈ నవల మనకు ఒక కథను మాత్రమే ఇవ్వదు. మన జీవితంలోని బంధాలను, మన ప్రేమలను, మన స్వార్థాలను ఒక్కసారి మనమే మన అంతర్ముఖంలో చూసుకునేలా చేస్తుంది.

నవలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు

“మాటా చేతా ఒకటవటమే నిజాయితీ. నీ వ్యక్తిత్వంతో నువ్వు బ్రతుకు. నిన్నిష్టపడేవాళ్లే నీతో ఉంటారు. నిన్నిష్టపడని వాళ్లు నీకు దూరంగా పోతారు.”

“ప్రేమ అంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు. ఎప్పుడైతే నీలో కేవలం తీసుకోవడం ప్రారంభమవుతుందో, అప్పుడు అవతలి వారికి నీపై ప్రేమ నశించడం ప్రారంభమవుతుంది.”

“అంతర్ముఖం” కేవలం ఒక నవల కాదు; ప్రేమ, స్వార్థం, నిజాయితీ, మానవ బంధాల గురించి మనం నమ్మిన అనేక భ్రమలను ప్రశ్నించే ఒక ఆత్మపరిశీలన.

ఇలాంటి అద్భుతమైన నవల రాసిన Yandamoori Veerendranath  గారికి ధన్యవాదాలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!
  • మరో రాజ్యాంగ పోరాటం! ఆ బిల్లును గెలుకుతున్న సీఎం విజయ్!!
  • అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!
  • ఐదు పెళ్లిళ్లు – డజను అఫయిర్స్… కానీ చివరకు ఏమయ్యాడు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions