Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!

June 10, 2026 by M S R

.

అమ్మ కుర్చీ – మహమ్మద్‌ ఖదీర్‌బాబు …. ‘సీనియర్‌ సిటిజన్స్‌ హోమ్‌’లో మా అమ్మనో, మీ అమ్మనో, మిత్రుడి అమ్మనో, మన వీధిలోని పరిచయస్తుని అమ్మనో చేర్పించాక, అది కాస్త నయమైన హోమ్‌ అయితే, ఒక గది ఇచ్చి బయట కుర్చీ కూడా ఇలా వేసి పెడతారు.
అమ్మ రోజంతా గదిలో ఉండలేదు కదా.
అప్పుడప్పుడు వచ్చి బయట కూచుంటుంది.

అమ్మకు ఎన్నేళ్లుంటాయో! ఆరోగ్యం అంత బాగోదు. చురుగ్గా కదల్లేదు. మెల్లగా, అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి కుర్చీలో చతికిల పడుతుంది.
చిన్నప్పుడు అమ్మకు కుటుంబం ఉంది. పెళ్లయ్యాక ఉంది. ఇప్పుడు కూడా ఉంది… కాకపోతే లేనట్టుగా ఉంది.
కాస్త దూరంలో మరో కుర్చీ ఉంది కదా. అక్కడా ఒక అమ్మ కూచుంటుంది. మరో కుర్చీలో మరో అమ్మ. ఎవరూ ఏమీ మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకుంటారు? కదిలిస్తే అవే ప్రశ్నలు.

Ads

– మీ అబ్బాయి ఫోన్‌ చేశాడా?
– మీ కూతురు ఎప్పుడు వస్తానంది?
– మనవలు వీడియో కాల్‌ చేస్తున్నారా?
– ఈసారి వెళితే పదిరోజులైనా ఉండొస్తారా?
జవాబులు ఆశాజనకంగా ఉండవు. ఉండవని తెలుసు. అడిగి చిన్నబుచ్చడం ఎందుకు. అందుకని ఎవరూ పలకరించుకోరు. అంతటా నిశ్శబ్దం. తోడుగా మాట పెగలని కుర్చీలు. నయం అవైనా మోస్తున్నాయి.

ఈ వయసులో జ్ఞాపకాలు శత్రువులు. ఉండి ఉండి వస్తుంటాయి. అమ్మ అలా శూన్యంలోకి చూస్తున్నట్టుగా కూచుని ఉంటుందా?… కాదు కాదు వద్దన్నా వచ్చే జ్ఞాపకాలతో పోరాడుతూ ఉంటుంది.
గారం చేసిన నాన్న, బుగ్గల్ని పుణికే అమ్మ, బజారు నుంచి పకోడీ పొట్లం తెచ్చిచ్చి ‘తినవే’ అనే అన్న, బెల్లు లేని సైకిల్‌ మీద కాలేజీకి వెళుతుంటే క్యారేజీ పట్టుకుని ఆపి తన పాకెట్‌ డబ్బుతో రిపేరు చేయించిన చిన్నన్న… గుర్తుకొస్తూ ఉంటారు. ‘ఏం తల్లీ… నిన్ను నీ కొడుకు అక్కడ పడేశాడా’ అని ఎవరో బంధువు ఫోన్‌ చేసి ఏడుస్తుంది. ‘నిన్ను ఎలా చూసి ఉంటాను?’ జ్ఞాపకాలను రాజేస్తూ ఉంటుంది.

అబ్బో… అమ్మ ఫలాతున్‌లా ఇంటిని నిలబెట్టి ఉంటుంది. భర్త తెచ్చిన ప్రతి పైసాను బెత్తంతో అదిలించి అదుపాజ్ఞల్లో పెట్టి ఉంటుంది. నలుగురు పిల్లల్ని ఎలా పెంచిందో పదహారు చెట్లనూ అలాగే పెంచి పెరడంతా అజమాయిషీ చేసి ఉంటుంది. పెరుగు సాయానికి వొకరూ పైకం సాయానికి ఒకరూ అమ్మ దగ్గరకు వస్తే కాదన్న పాపాన పోదు. పెళ్ళిళ్లలో బంధువులకు చేదోడై నిలిచింది. పండుగల్లో పెత్తనం చేసింది. కన్నబిడ్డల్ని కళ్లల్లో పెట్టుకుని సాకి, పెళ్లిళ్లు చేసి, వారి సుఖాన్ని ఆశించి….

ఏనాడూ ఒకరి సాయాన్ని కోరని అమ్మను నిస్సహాయురాల్ని చేసి…. వయసొచ్చిందనీ, అంతగా నడవలేదనీ, కళ్లు కానరావడం లేదనీ, ఇంట చోటు లేదనీ, అక్కడైతే బాగా చూసుకుంటారనీ… మాట్లాడగలిగిన అమ్మను మాటలేని చోటకు చేర్చి, అనుభవాల మూటైన అమ్మను చేష్టలిడిగే స్థితికి తెచ్చి….

శని, ఆదివారాలొస్తే అమ్మ గదిలోకి వెళ్లదు. కుర్చీలోనే ఉండిపోతుంది. విజిటర్స్‌ వచ్చి వెళ్లే రోజులవి. చూస్తూ ఉంటుంది… పిల్లలొసారని… చూస్తూ ఉంటుంది పలకరించే వాళ్లొస్తారని…. ‘కడుపుతో ఉన్నాను తోడుండమ్మా’ అని కూతురు పిలిస్తే కీళ్లవాతం నొప్పులు ఉన్నా వెళ్లి ఆరునెలలు కూలి చేసి వచ్చింది. ఇవాళ ఆ కూతురికి క్షణం తీరిక లేదు. ‘నాకు ఆ అమ్మాయే నచ్చింద’ని కొడుకు చెప్తే భర్తను ఒప్పించి మరీ పెళ్లి చేసింది. ఆ కొడుకు ఇల్లు అమ్మకు మూలనైనా మిగల్చదు.

  • ‘హోమ్‌లో బాగుంటుందమ్మా’ అని చేర్చాడు. నిజమే. ఈ హోమ్‌లో ‘టైమ్‌టేబుల్‌’ ఉంది. టిఫిన్‌ ఎనిమిదికి, లంచ్‌ ఒంటి గంటకి, టీ ఐదింటికీ…. కంపల్సరీ. కానీ ‘కొడుకు వచ్చే టైమ్‌’ కంపల్సరీ కాదు.
    అమ్మకు ఇబ్బంది ఏమిటంటే ఒకోసారి ఉదయాన్నే నిద్ర లేస్తే భ్రాంతి వస్తుంటుంది. ‘అమ్మాయి ఇంట్లో ఉన్నానా?’… ‘అబ్బాయి ఇంట్లో ఉన్నానా?’. రెండు మూడు నిమిషాలు. అంతే. ఓహో… హోమ్‌లోనే ఉన్నానన్న మాట. ఏమంటే తీసుకెళ్లి చాలా రోజులై ఉంటుంది కదా.

అమ్మ ఫోన్‌లో ‘కాంటాక్ట్స్‌’ చాలా ఉన్నాయి. కానీ ‘కాల్‌’ చేసేవాళ్లే లేరు.
ఇలాంటి చోట ఉండే తండ్రుల బాధ వేరు. పాతిక కోట్ల ఆస్తులున్న ఒక తండ్రి గది తీసుకుని ఉండి రోజూ చేసే ఆరాధన ఒకటే ‘దేవుడా… ఎవరి చేతా చేయించుకోకుండా నన్ను పిలుచుకో’.  శివభక్తుడట. నిత్యం శివునితో మొర అట.

ముగ్గురు కొడుకులు. వచ్చి చూడరు. ఆ కోడళ్లు. అబ్బే… ఆ రోజు ఉదయాన్నే లేచాడు. తల స్నానం చేశాడు. మంచి బట్టలు కట్టుకున్నాడు. పూజ కోసం నుదుటున విభూతి రాసుకున్నాడు. చేతులు ముకుళించే లోపు ప్రాణం విడిచాడు. కన్న బిడ్డలంత కఠినాత్ముడు కాదు దేవుడు. ఆ రోజు సోమవారం. అది కార్తీకమాసం.

అయితే సీనియర్‌ సిటిజన్స్‌ హోమ్‌లో ఉంటే ఒక అడ్వాంటేజ్‌ ఉంది. పోయినప్పుడు నలుగురు మనుషులు తప్పక ఉంటారు. ఫలానా గదిలోని ఆమె పోయిందని తెలిస్తే పార్థివ దేహం దగ్గరకు వచ్చి అందరూ అంజలి ఘటిస్తారు. బాధ పడతారు. తామే బంధువులై శోకిస్తారు. కాకపోతే ఆ రోజంతా ఒకలా ఉంటుంది. తర్వాత తమ నంబరేమోనని దిగులుగా ఉంటుంది. చావుకు భయం లేదు. కాకుంటే ఆ సమయంలో పిల్లలు ఎక్కడ ఉంటారోనని. వారు అప్పుడైనా వస్తారో రారోనని.

కుర్చీలు… కుర్చీలు… కుర్చీలు….
అంతటా ఉన్న ఈ కుర్చీలు విన్న గాథల బరువును భూమి మరెంతో కాలం ఓపలేదు.
అది బద్దలవ్వక ముందు ఈ కుర్చీ ఖాళీ అవ్వాలి.
అమ్మ ఇల్లు చేరాలి.
లేకపోతే రేపు ఈ కుర్చీ ఎదురు చూస్తూ ఉంటుంది… వడ్డీ లెక్కతో…. తప్పక మన కోసం.

కుర్చీ
.
ఫొటో: మేడ్చల్‌లోని సీనియర్‌ సిటిజన్‌ హోమ్‌. నాల్రోజుల క్రితం అక్కడికి వెళ్లాను. మా అమ్మ ఎప్పుడూ హోమ్ లో లేదు. మా అన్న దగ్గర ఉండి రెండేళ్ల క్రితం వెళ్ళిపోయింది.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…
  • అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!
  • మాయదారి సంత..! రేయ్, ఎవుర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా..!!
  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…
  • సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
  • తెలుగు వెండితెరపై 30 ఏళ్ల క్రితమే ‘హక్కుల కాక్రోచ్‌లు…
  • వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
  • నత్వానీకి, మీనాక్షికి వేర్వేరు న్యాయాలు… డబుల్ స్టాండర్డ్స్..! సీట్ చోరీ…!
  • ఆ సీఎంకు ముందే ఎలా తెలుసు..? ఇదంతా ముందస్తు ప్లానేనా..!
  • ఆ నందగోపాలుడు చూపిన బాటే… ఇండియాను నిలబెడుతోంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions