.
తాను చెప్పదల్చుకున్న విషయం ఏదైనా సరే, పాఠక జన అంగీకారంగా చెప్పడం. దానికి సరిగ్గా సహజంగా అతుక్కుపోయే ఉదాహరణలు ఇవ్వడం ఒక గొప్ప రచయిత లక్షణం అయితే… అటువంటి లక్షల లక్షణాలు యండమూరి కలం వెనుక ఇప్పటికీ దాగి ఉన్నాయి…
ఆ రాతలో ఉన్న మ్యాజిక్ ఇదే! ఒక చిన్న “బేహారి” అనే పదాన్ని పట్టుకుని… సినిమా చీర నుంచి అన్నమయ్య వరకు, అక్కడి నుంచి జీవితం– కర్మ వరకు తీసుకెళ్లాడు ఓ పోస్టులో…. చదువుతుంటే “అరే… ఈ కోణంలో కూడా చూడొచ్చా!” అనిపించింది…
Ads
శరీరాన్ని చీరతో పోల్చడం, ఎంత అందమైన చీర కూడా చిరిగి పోతుంది అని మనకు అన్వయించడం చాలా బాగుంది…. సూపర్ Veerendranath Yandamoori సర్..
ఆ పోస్టు ఇదుగో…
చాలా ఏళ్ల క్రితం రాజ్‌కపూర్ ఒక ఇంటర్వ్యూలో, “సినిమావారు ‘సప్నోంకా సౌదాగర్’… కలలను సృష్టించి ప్రేక్షకులకు అందించే కలల బెహారులు” అన్నారు. ఆ ‘బేహారీ’ అన్న పదం చాలా నచ్చింది.
సినిమా అంటే అంతే కదా. ప్రేమను, ద్వేషాన్ని, కోపాన్ని, ఆనందాన్ని, విషాదాన్ని కలిపి, రెండు గంటల అందమైన అబద్ధాన్ని(!) తయారు చేస్తాడు రచయిత. కథకుడు ఇచ్చిన ఆ భవంతి ప్లాన్‌కి మెరుగులు దిద్దుతాడు స్క్రీన్‌ప్లే రచయిత. దర్శకుడు భవంతిని నిర్మిస్తాడు. నటులు ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు. సంగీత దర్శకుడు భవంతి చుట్టూ అందమైన తోట వేస్తే, ఛాయాగ్రాహకుడు కిటికీలు తెరిచి ఇంటిని వెలుతురు నింపుతాడు. దాన్ని ప్రేక్షకుడు మార్కెట్‌లో డబ్బులిచ్చి చూస్తాడు.
ఈ వ్యాపారoలో అమ్మేది బియ్యం, వస్త్రం, బంగారం కాదు. కల. కళ..!
** ** **
‘బేహారీ’ అనే సాధారణ పదంలో ఇంత కవితాత్మకమైన అర్థం ఉండటంతో బాల్యంలోనే అది మనసులో లోతుగా స్థిరపడి, ‘నల్లంచు తెల్లచీర’ నవలలో ఆ పదం వాడటం జరిగింది.
ఆ తరువాత ఆ నవల సినిమాగా (దొంగమొగుడు) వచ్చింది. అందులో హీరో- వ్యాపార నేపథ్యం ఉన్న వస్త్రాల బేహారీ..! అతడి దాంపత్య జీవితం అసంతృప్తిగా ఉంటుంది. మరో వైపు వ్యాపారంలో అద్భుతంగా ఎదుగుతూ ఉంటాడు. అతడి ప్రత్యర్థులు రావుగోపాలరావు మొదలైనవారు తమ ప్లాన్‌లో భాగంగా భానుప్రియ పాత్రను ఒక పావుగా అతడి జీవితంలోకి ప్రవేశపెడతారు. ఇక్కడే ఇబ్బంది వచ్చింది.
అందులో చిరంజీవి హీరో. అప్పటికే చిరంజీవి మాస్ హీరోగా చాలా పటిష్టమైన స్థానంలో ఉన్నాడు. శోభన్‌బాబు అయితే ఓకే గానీ, చిరంజీవికి మరో స్త్రీతో సంబంధం ఏర్పడే పరిస్థితిని చూపించడం రిస్క్‌తో కూడుకున్న విషయం. అందువల్ల ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో అనే సందేహం ఉండేది. చిరంజీవి ‘వోకే, చేద్దాం’ అనగానే, ఆ రిస్క్ తీసుకున్నాం. బ్యాలెన్స్ చేయటానికి రాధిక పాత్రని కొత్తగా సృష్టించాము. ఆపై సినిమా విడుదలై, చాలా పెద్ద విజయం సాధించింది. ప్రేక్షకులు సానుకూలంగా స్వీకరించారు.
ఇది జరిగిన చాలా కాలం తర్వాత ‘బేహారీ’ మరో రూపంలో ఎదురయ్యాడు. ఈసారి మరింత గొప్ప స్థాయిలో!
అన్నమయ్య అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది భక్తి, శృంగారం. అది సహజమే. కానీ ఆయన కీర్తనల్లో భక్తితో పాటు అద్భుతమైన జీవన తత్వశాస్త్రం ఉంది.
మనకు రోజూ కనిపించే చిన్న చిన్న వస్తువుల ఉదాహరణతో గొప్ప తత్త్వం చెప్పాడు ఆయన. తత్వం చెప్పటానికి కఠినమైన సంస్కృత పదాలు అవసరం లేదు. వేదాంత గ్రంథాలు తెరవాల్సిన పనిలేదు. ఒక చీర- ఒక నేతగాడు- ఒక సంత- ఒక వ్యాపారి- అనే నాలుగు అంశాల మధ్య పట్టి ఒక పెద్ద జీవిత సత్యాన్ని చెప్పాడు.
“వాడల వాడల వెంట… చీరలమ్మే నేత బేహారి” అనే ఆయన కీర్తనలో పరమాత్మ ఒక నేతగాడు; చీరెలు అమ్మే బేహారి.
అతడు నేసేది మామూలు చీర కాదు. మన శరీరం. దానికి వాడిన ‘నూలు’ భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలు. “పంచభూతములనెడి పలువన్నె నూలు- చంచలపు గంజి వోసి చరిసేసి” – ఈరోజు మనం అద్దంలో చూసుకుని ‘నేను’ అనుకుంటున్న శరీరం నిజానికి పంచభూతాలతో నేసిన ఒక వస్త్రం మాత్రమే. కానీ నూలు ఒక్కటే ఉంటే చీర గట్టిగా, ఆకర్షణీయంగా కనిపించదు. దానికి గంజి కావాలి. అక్కడ అన్నమయ్య ఉపయోగించిన మరో అద్భుతమైన భావం ‘చంచలపు గంజి’.
చీరకు గంజి పెట్టినప్పుడు అది కొత్తగా, గట్టిగా, మెరుస్తూ ఉంటుంది. కొంతకాలం తర్వాత గంజి వదులుతుంది. చీర మెత్తబడుతుంది. రంగు వెలుస్తుంది. నూలు బలహీనపడుతుంది. చివరకు చిరుగుతుంది. ‘చంచలపు’అంటేనే నిలకడ లేనిది. మన శరీరం కూడా అంతే కదా!
యవ్వనంలో మనిషికి అందం, బలం, ఆకర్షణ శాశ్వతమని అనిపిస్తుంది. కానీ అవన్నీ చీరకు వేసిన గంజిలాంటివే. గంజి వదిలినట్టే యవ్వనం వదులుతుంది. రంగు వెలిసినట్టే అందం మారుతుంది. నూలు సడలినట్టే శరీరం బలహీన పడుతుంది. చీర చిరిగినట్టే శరీరం కూడా పనికి రాకుండా పోతుంది.
ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఆ చీరను నేసే బేహారి మనకు ఉచితంగా ఇవ్వడు. అయితే ఆయన ధనం, బంగారం అడగడు. ఆ కీర్తనలోనే, “వెచ్చపు కర్మ ధనము విలువ చేసి” అనే భావం వస్తుంది. జీవి చేసిన కర్మే అతడి దగ్గర ఉన్న ధనం.
“కర్మమనేటి మైల సంత”లోన
వెచ్చపు కర్మధనము వెలువచేసి
ఆ చీర మనదే అని మురిసిపోతాం. ‘నా అందం, నా శరీరం, నా బలం, నా యవ్వనం, నా సంపద, నా జీవితం’ అంటూ మురిసిపోతాం. కానీ అన్నమయ్య చెప్పే సత్యం ఒక్కటే—”నువ్వు చీరవి కాదు. నీకు ఒక చీర ఇవ్వబడింది అంతే”..!
మరణంతో ఆ చీర వదిలేస్తాం.
అప్పుడు బేహారి లెక్క చూసేది నీ చీర ఎంత అందంగా ఉందో కాదు. నువ్వు ఎంత ధనవంతుడివో కాదు. నీకు ఎంత పేరు వచ్చిందో కాదు. నీ కర్మకు ఎంత విలువ ఉందో.
అన్నమయ్య కేవలం వెంకటేశ్వరస్వామి భక్తుడు కాదు. ఆయన మనిషిని చూశాడు. అతడి మోహాన్ని, యవ్వనాన్ని, అహంకారాన్ని, బలహీనతలను, కర్మను, మరణాన్ని చూశాడు. వాటిని భయపెట్టే తత్వశాస్త్రంగా చెప్పలేదు. ఒక చీర కథగా చెప్పాడు. అదే అన్నమయ్య ప్రతిభ.
కల నుంచి కళకు… కళ నుంచి దేహానికి… దేహం నుంచి కర్మకు —ఒకే పదం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది…
Share this Article