.
అయ్యా… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుల వారూ… వచ్చారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, స్వాగతం… కానీ తమరేం స్క్రిప్టు మాట్లాడుతున్నారో, దానికి సంబంధించిన క్లారిటీ మీ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి తీసుకుంటే బాగుండేది… ఎందుకంటే..?
దేశాన్ని ఏలుతున్న పార్టీకి జాతీయ అధ్యక్షులు తమరు… మీ ప్రతి మాటకూ విలువ సహజంగానే ఉంటుంది, కాదు, ఉండాలి! ఏమన్నారు మీరు..? ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా అవినీతికి వాడుకుంది, కాంగ్రెస్ ఆ అవినీతి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది’’…
Ads
ఎట్టెట్టా..? మహాశయా… తెలంగాణలో కేసీయార్ అవినీతి గురించి ఒక మోడీకి తెలుసు, ఒక అమిత్ షాకు తెలుసు… తమరు కొత్త కదా, తెలిసి ఉండదు… ఎంతసేపూ కేసీయార్‌తో దోస్తీ కోసం తహతహలాడే మీ రాష్ట్ర పార్టీ నాయకులు నిజాలేమిటో చెప్పి ఉండరు… ఏదో స్క్రిప్టు చేతిలో పెట్టి, అదే మాట్లాడమని చెప్పి ఉంటారు…
అయ్యా, కాంగ్రెస్ ఆ కేసీయార్ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం లేదు, తవ్వితే మనీలాండరింగులు, ఈడీ చూడాల్సిన యవ్వారాలు, జాతీయ దర్యాప్తు సంస్థ సీబీఐ తవ్వాల్సిన అవసరం ఉందని భావించి… సీబీఐకి అప్పగించండి, తెల్లారే అరెస్టు చేస్తామనే మీ రాష్ట్ర నాయకుల బీరాల కారణంగా… ఈ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి నిజంగానే అప్పగించింది…
సరే, మీకు తెలియాలని ఏమీ లేదు… మీకు వీళ్లు మొత్తం చెప్పి ఉంటారనీ అనుకోలేం… కేసు సీబీఐకి అప్పగించబడింది… కానీ దాదాపు ఏడాది కావస్తున్నా ఒక్క అడుగు కూడా పడలేదు మాస్టారూ… అవినీతిని కప్పిపుచ్చి, కాపాడుతుంది ఎవరు మరి..? రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమా? కేంద్రంలోని మీ ప్రభుత్వమా?
రాబోయే రోజుల్లో మీ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీయార్‌ను కాపాడాలని అనుకుంటే దాన్ని వర్తమాన రాజకీయ విలువలు- ప్రమాణాల్లో తప్పుపట్టలేమేమో… కానీ మీరే కేసీయార్ అవినీతి అంటూ, మీ కేంద్ర మంత్రే పార్లమెంటులో లక్ష కోట్లను గోదాట్లో పోసినట్టే అని వ్యాఖ్యానిస్తూ… మరోవైపు ఇక్కడ సభల్లో అది కేసీయార్ ఏటీఎం అని మీరే విమర్శిస్తూ…
మీ పంజరంలో చిలుక అలియాస్ సీబీఐని మాత్రం ఈ దర్యాప్తు విషయంలో కట్టేయడాన్ని ద్వంద్వ నీతి అంటారు… ఒక పొలిటికల్ అవినీతిపరుడిని శిక్షించాలని తెలంగాణ సమాజం కోరుకోవడంలో తప్పులేదు, అది మీకు అర్థం కాదు… ఒక మోడీ, ఒక అమిత్ షాకు తెలిసీ మాట్లాడరు… ఇదీ అసలు నిజం మాస్టారూ..!!
ఇదే కేసీయార్ మీ జాతీయ ప్రధాన కార్యదర్శిని లిఫ్ట్ చేసి, జాతీయ స్థాయిలో బీజేపీని, బాధ్యులను బజారుకు ఈడ్చాలని ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ అనే ఓ నాటకాన్ని రచించి, ప్రదర్శించిన సంగతి కూడా బహుశా మీకు తెలిసి ఉండదు, మనవాళ్లు చెప్పి ఉండరు…
అన్నట్టు, మన రాష్ట్ర పార్టీ నాయకులు ఇంకొకటి చెప్పి ఉండరు… ఫార్ములా వన్, ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా జాతీయ స్థాయి దర్యాప్తులకు, శిక్షలకు అర్హమైనవి… కాళేశ్వరం కథేమిటో తేల్చండి, విద్యుత్తు అవినీతి కేసును కూడా మీకే అప్పగిస్తాం అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి… ఈ కథనం కేవలం మీ సులభ అవగాహన కోసమే సుమండీ..!!
Share this Article