Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిధి దొరికింది! ‘మనిషి ఆశ’ల్లో ఇరుక్కుంది! ఎవరు సొంతదారు!!

June 30, 2026 by M S R

.

ఒకప్పుడు (సత్యకాలంలో) ఒక రైతుకు తన పొలంలో లంకె బిందెలు దొరికితే, అతను ఆశ్చర్యపోయి “ఇది నా శ్రమతో సంపాదించినది కాదు, కాబట్టి ఇది నాది కాదు, నాకు అమ్మిన పాత యజమానికే ఇచ్చేయండి” అని ఆనాటి రాజు వద్దకు తీసుకెళ్తాడు. దానికి ఆ భూమిని గతంలో అమ్మిన వ్యక్తి, “నేను ఆ భూమిని అమ్మేశాను కాబట్టి, ఆ భూమిలో ఏమున్నా అది ఇప్పుడు ఆ కొత్త రైతుకే చెందుతుంది, నాది కాదు” అని అంటాడు.

మరుసటి రోజే కలికాలం వచ్చేసింది… ఆ ఇద్దరూ రాజు దగ్గరకు వస్తారు… “నేను అమ్మిన భూమిలో దొరికింది కాబట్టి అది నాకే చెందాలి” అని పాత యజమాని, “లేదు, ఇప్పుడు ఆ భూమి నాది, కాబట్టి అది నాకే చెందాలి” అని కొత్త యజమాని కొట్లాడుకుంటారు. చివరికి వాళ్ళ ఆశను చూసి విసిగిపోయిన రాజు, “ఇది ఎవరికీ చెందదు, ఇది రాజ్యాధికారం కిందకు వస్తుంది” అని చెప్పి వారిద్దరినీ వెళ్లగొడతాడు…

Ads

సరే, వర్తమానంలోకి వద్దాం… వరంగల్ జిల్లా కోపాకులపాడు గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో బయటపడిన బంగారం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన కేవలం నిధి దొరకడమే కాకుండా, ఆ నిధి కోసం పాత, కొత్త యజమానుల మధ్య మొదలైన గొడవతో మరింత ఆసక్తికరంగా మారింది.

ఏం జరిగింది?
ఈ నెల 24న కోపాకులపాడులోని 6 ఎకరాల వ్యవసాయ భూమిలో కూలీలు కలుపు తీస్తుండగా, భూమిలో పాతిపెట్టిన పాతకాలపు బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దీని విలువ సుమారు 50 తులాల బంగారం ఉంటుందని అంచనా. అయితే, ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయకుండా, ప్రస్తుత భూ యజమాని, అక్కడ పనిచేస్తున్న కూలీలు ఆ బంగారాన్ని రహస్యంగా పంచుకున్నారు. కానీ నిజం ఆగదు కదా…

మలుపు తిప్పిన పాత యజమాని ఫిర్యాదు
ఈ విషయం తెలిసి, ఐదేళ్ల క్రితం ఆ భూమిని విక్రయించిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆ భూమిలో ఉన్న నిధిపై తనకు హక్కు ఉందని, తాను భూమిని అమ్మినప్పుడు ఆ బంగారం అక్కడే ఉందని, కాబట్టి తనకు కూడా వాటా ఇవ్వాల అని ఫిర్యాదు చేశాడు. గతంలో ఆ ప్రాంతంలో ఆలయాలు ఉండేవని, అందువల్ల భూగర్భంలో ప్రాచీన నిధి ఉండి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. (ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని ప్రజలు ఆ పొలంలో వెతుక్కుంటున్నారు కూడా)…

చట్టం ఏం చెబుతోంది?
భారత నిధుల చట్టం (Indian Treasure Trove Act, 1878) ప్రకారం, భూమిలో దొరికే ఏ విధమైన నిధి అయినా అది ప్రభుత్వ ఆస్తి. అసలు భూమికి అల్టిమేట్ శాశ్వత యజమాని ప్రభుత్వమే… ఎవరు సాగు చేసుకున్నా, ఎవరు ఎవరికి అమ్ముకున్నా సరే… ఇలాంటి సందర్భాల్లో మరీ ముఖ్యంగా… అనుసరించాల్సిన నియమాలు ఇవే…

భూమిలో నిధి దొరికిన వెంటనే ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు లేదా సమీప పోలీసులకు తెలియజేయాలి. దాన్ని సొంతం చేసుకోవడం లేదా పంచుకోవడం చట్టరీత్యా నేరం. (పోలీసులు సెటిల్ చేస్తే అది వేరే విషయం)…

చట్టపరంగా చూస్తే, ఒకసారి భూమిని విక్రయించిన తర్వాత, ఆ భూమిలోని ప్రాచీన వస్తువుల మీద, నిధి నిక్షేపాల మీద పూర్వ యజమానికి ఎటువంటి హక్కూ ఉండదు. కాబట్టి ఆయన వాటా కోరడం చట్టబద్ధంగా నిలబడదు.

నిధిని రహస్యంగా పంచుకున్నందుకు ప్రస్తుత భూ యజమాని, కూలీల పై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, పురావస్తు శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. దొరికిన వెంటనే అప్పగించి ఉంటే, ఆ సొత్తు విలువలో కొంత సదరు భూయజమానికి (కొత్త) చట్టపరంగా ప్రభుత్వం చెల్లిస్తుంది… కానీ ఇక్కడ దొరికిన సొత్తును దాచిపెట్టాడు కాబట్టి కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది…

ప్రస్తుతానికి ఈ వివాదం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, దొరికిన బంగారాన్ని రికవరీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అంతా బహిరంగం అయిపోయింది కాబట్టి, పోలీసులు లేదా రెవిన్యూ అధికారులు తామూ చేతివాటం ప్రదర్శించి, మొత్తం సద్దుమణిగేలా చేయడం కూడా కష్టమే… ఈ ఘటనపై మరింత విచారణ తర్వాత అధికారుల నుంచి స్పష్టత రానుంది….

అన్నట్టు… ఆ నాణేలకు యాంటిక్ వాల్యూ… పాత చరిత్రతో సంబంధం ఉందని పురావస్తు శాఖ భావిస్తే… అందులోనూ కొర్రీదారులు ఉంటారు కదా, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే… ఇక ఆ సొత్తు గోడకు వేసే సున్నమే… మరిచిపొండి!!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిధి దొరికింది! ‘మనిషి ఆశ’ల్లో ఇరుక్కుంది! ఎవరు సొంతదారు!!
  • వెలుగు వివేక్‌కు అభినందనలు – హరీష్ రావుకు ప్రత్యేక ప్రశంసలు
  • SIR, భిక్షగాళ్లకు ఓట్లున్నాయా..? వారు ఓటు హక్కు‘అడుక్కోవడం’ ఎలా..?
  • 20 ఏళ్ల స్పీడ్- సక్సెస్‌ఫుల్ జర్నీ – మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా!!
  • సౌందర్య ఆ పాట ఒప్పడమే గొప్ప – ఈ దర్శకుడు పెద్ద ‘మాయలోడు!!
  • చెత్తా హీరోయిజం! ఆ డెలివరీ బాయ్ చెప్పు తీసి ఉంటే..?!
  • సెషెల్స్! అనంతసాగరంలో ఓ చుక్క! కానీ మనకు ఎందుకు కీలకం?
  • KCR పాలన మార్క్ అక్షర దుర్గతి – అక్షరాస్యతలో 31వ స్థానం !!
  • అడ్డగోలు రిజర్వేషన్ల కుదింపు- మమత మార్క్ మరో తప్పిదం దిద్దుబాటు?
  • సినిమా సెకండాఫ్ మొదలైంది – కథ ఇప్పుడే ఇక ఊపందుకుంది

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions