.
ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సగర్వంగా ఇతర జట్లకన్నా ముందుగానే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చూడబోతే ‘ఈ సాల కప్ నమ్దే’ రిపీట్ చేసే జోష్ కనిపిస్తోంది… ఈ విజయ ప్రస్థానంలో ఆ జట్టుకు కర్త, కర్మ, క్రియ, అసలైన స్ఫూర్తి అంతా రన్ మెషిన్ విరాట్ కోహ్లీయే.
సమకాలీన వెటరన్ స్టార్లందరూ జట్టుకు దూరమవుతున్నా, కోహ్లీ మాత్రం యువ, కొత్త క్రికెటర్లకు సైతం గట్టి పోటీనిస్తూ బ్యాటింగ్, ఫీల్డింగుల్లో అదే పాత జోష్ చూపిస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుతమైన సెంచరీ సాధించిన అనంతరం కోహ్లీ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.
Ads
క్రికెట్ ప్రముఖులతో విభేదాలు, సెలెక్టర్ల నిర్ణయాలు ఎలా ఉన్నా మైదానంలో తన కన్సిస్టెన్సీని కోహ్లీ ఎప్పుడూ తగ్గించుకోలేదు. అయితే, గత ఏడాది ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. బోర్డు నిబంధనల ప్రకారం రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత కూడా సెలెక్టర్లు కోహ్లీని తొలి రెండు టెస్టులకే ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ప్రదర్శనను బట్టి కొనసాగిస్తామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కోహ్లీ ఇప్పుడు అత్యంత స్పష్టతతో, నిర్మొహమాటంగా స్పందించాడు.

“నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో లేను!” 2027 వన్డే వరల్డ్ కప్‌లో తన స్థానంపై జరుగుతున్న చర్చలపై విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను స్పష్టంగా బయటపెట్టాడు.
- “నా స్థాయికి, విలువకు తగిన గౌరవం ఇస్తేనే ఆటలో కొనసాగుతాను, లేదంటే తప్పుకుంటాను. నేను ఇంకా ఏదో నిరూపించుకోవాల్సిన స్థితిలో లేను. 2027 వరల్డ్ కప్‌లో ఆడటం గురించి నన్ను చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధం. ఎందుకంటే క్రికెట్ నాకు నిత్యకృత్యం, నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం”
తమ ఇల్లు వదిలి కిట్‌తో బయటకు వెళ్లడం, ఎంతో కష్టపడటం అంతా క్రికెట్ కోసమేనని, భారత్ తరపున మరో ప్రపంచకప్ ఆడటం గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. అయితే, జట్టుకు తన అవసరం ఉందని భావిస్తేనే ఆడతానని, తన విలువను, స్థాయిని ప్రతిసారీ నిరూపించుకుంటూ ఆడాల్సిన పరిస్థితి వస్తే అందుకు తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పాడు.

- ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు! సెలెక్టర్ల తీరును ప్రశ్నిస్తూ కోహ్లీ మరింత ఘాటుగా స్పందించాడు. “మనం పనిచేసే చోట మన ప్రతిభ, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు అప్పగించిన తర్వాత.. వారం రోజులకే మన పనితీరును ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? నేను నిజాయితీగా పని చేస్తాను. ఆట కోసం ఎంతైనా కష్టపడతాను. వన్డేల్లో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ల మధ్య ఆ మూల నుంచి ఈ మూలకు పరిగెత్తమన్నా కచ్చితంగా చేస్తా. ప్రతి బంతినీ నా కెరీర్ చివరి బంతిలా భావించి మైదానంలో పోరాడతా. దీనిపై నేను ఫిర్యాదు చేయను” అని భావోద్వేగానికి లోనయ్యాడు.

చివరగా సెలెక్టర్లకు, విమర్శకులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు కోహ్లీ… “కేవలం ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే చెప్పేయండి. లేదా ఒకసారి అవకాశం ఇచ్చాక నన్ను నా పని చేసుకోనివ్వండి” అని తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

Share this Article