Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే అక్క పురుషద్వేషి… చెల్లెలికీ ఆ రోగం అంటిస్తుంది… తర్వాత..?

June 13, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందంట . పురుష ద్వేషంతో ప్రతి మగవాడినీ అనుమానించటమే కాకుండా చెల్లెల్ని కూడా పురుష ద్వేషిగా మార్చే ప్రయత్నం చేస్తుంది అక్క . ప్రతి మగవాడూ తన వంకే చూస్తున్నట్లు , తనను తాకేందుకే ప్రయత్నిస్తున్నట్లు , తనకు లైనేస్తున్నట్లు ఒక చిత్త భ్రమలో ఉంటారు కొందరు ఆడవారు .

అలాంటి స్త్రీయే ఈ అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో జయసుధ పాత్ర . అనుమానప్పక్షి భార్యను భరించలేక పారిపోతాడు జయసుధ భర్తేశ్వరుడు . ఆ అనుభవంతో చెల్లెలు అపర్ణని అతి జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటుంది . టైం వచ్చాక ఎంత కాపలా కాసినా ఎవరో ఎక్కడో వ్రాసిపెట్టబడినోడు తారసపడగానే ప్రేమ ప్రారంభం అవుతుందిగా .

Ads

ఈ సినిమాలో కూడా అదే జరుగుతుంది . ఈజీ గోయింగ్ రాజేంద్రప్రసాద్ అపర్ణకు తారసపడటం , పరస్పరం ఆకర్షించుకోవడం , సవాలక్ష షరతులతో పెళ్లి అయిపోతుంది . పెళ్లి అయిన మరుసటి క్షణం నుండి డిటెక్టివ్ పని ప్రారంభిస్తారు అక్కాచెల్లెళ్ళు .

అనుకోకుండా విశాఖపట్టణం వెళ్ళిన హీరో రాజేంద్రప్రసాదుకి తన ప్రాణస్నేహితుడు విక్రమ్ (అపరిచితుడు ఫేం) కనపడటం , తన కాబోయే భార్య శ్రీకన్యను పరిచయం చేయటం , వారి పెళ్ళి సమయంలో లారీ ప్రమాదంలో విక్రం చనిపోవటంతో శ్రీకన్య బరువు బాధ్యత రాజేంద్రప్రసాద్ మీద పడుతుంది .‌

అపర్ణకు బిడ్డ పుట్టాక అక్కాచెల్లెళ్ళు చెప్పకుండా విశాఖపట్టణం వచ్చేస్తారు . అక్కడ అదే సమయంలో హాస్పిటల్లో శ్రీకన్య ప్రవించటం , తర్వాత అనుమానాలు ఇంకా పెరగటం , క్లైమాక్సులో నిజాలు తెలిసాక అందరూ అనుమానప్పక్షి జయసుధనే తప్పు పడతారు . ఖచ్చితంగా ఆ టైంకు పారిపోయిన జయసుధ భర్తేశ్వరుడు రావటంతో సినిమా శుభాంతం అవుతుంది .

తమిళంలో పొండట్టి రాజ్యం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో శరవణన్ , రంజిత , చిత్ర ప్రధాన పాత్రల్లో నటించారు . నటుడు సుధాకర్ , ప్రభు ఫిలింస్ అంటే దాసరి నారాయణరావు కంపెనీ కలిసి తెలుగులో రీమేక్ చేసారు . రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించవలసిన సినిమాకు దాసరి నారాయణరావే దర్శకత్వం వహించటం విశేషం .

రాజేంద్రప్రసాద్ , జయసుధ , అపర్ణ , కోట శ్రీనివాసరావు , వై విజయ , జయలలిత , సుత్తి వేలు , బాబూమోహన్ , విక్రమ్ , శ్రీకన్య  తదితరులు నటించారు . విక్రమ్ , శ్రీకన్యలకు ఇదే మొదటి తెలుగు సినిమా అనుకుంటా . అపర్ణకు రెండో సినిమా , ఆఖరి సినిమా . (సుందరకాండ సినిమాలో మంచి మార్కులు కొట్టేసిన అపర్ణకు సూటయ్యే పాత్ర మాత్రం కాదు ఈ సినిమాలో చెల్లెలి పాత్ర…)

జయసుధకు , రాజేంద్రప్రసాదుకు ఇలాంటి సినిమాలు కొట్టిన పిండే . ఆడుతూ పాడుతూ చేసేసారు . అమాయక చెల్లెలుగా , అక్క చేతిలో బొమ్మగా అపర్ణ బాగా నటించింది . కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ల కాంబినేషన్ సరదాగా సాగుతుంది .

వాసూరావు సంగీత దర్శకత్వంలో సి నారాయణరెడ్డి , భువనచంద్ర , జాలాది వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , వాణీ జయరాం , చిత్ర శ్రావ్యంగా పాడారు . అక్కాచెల్లెళ్ళ ఆరళ్ళు భరించలేక రాజేంద్రప్రసాద్ పాడే హే కృష్ణా ముకుందా మురారీ నా కొంపే కొల్లేరాయె శ్రీహరీ రీమిక్స్ సరదాగా ఉంటుంది .

మేఘమా చూసిపో , చెవిలో చెప్పాలమ్మా ఒక చిన్న మాట అంటూ సాగే డ్యూయెట్లు బాగుంటాయి .
1993 అక్టోబరులో వచ్చిన ఈ హాస్యరస భరిత సినిమా చూడబులే . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు ట్రై చేయవచ్చు .



అపర్ణ... ఈ రెండు సినిమాల తరువాత పెళ్లి చేసుకుంది, అమెరికాలో స్థిరపడింది...

అపర్ణ

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అసలే అక్క పురుషద్వేషి… చెల్లెలికీ ఆ రోగం అంటిస్తుంది… తర్వాత..?
  • అయోధ్యపై అఖిలేష్ కొత్త రచ్చ… ఆది నుంచీ యాంటీ- హిందూయే కదా…
  • పాపం త్రిష… ఆశ అడియాసేనా? విజయ్– సంగీత బంధంపై కొత్త ట్విస్ట్..!
  • C 295 … మేడ్ ఇన్ ఇండియా… తొలి స్వదేశీ సైనిక రవాణా విమానం…
  • చేసుకున్నవాడికి చేసుకున్నంత… నో బెయిల్, నో రిలీజ్… కటకటాల్లోనే…
  • బూతు, వెగటు, రోత, జుగుప్స… ఈ-తరం స్టాండప్ కామెడీ తీరు…
  • పువ్వులను గాలి ముద్దాడితే వాటికి సన్నగా నవ్వొచ్చిందట …!
  • *ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక* ఎందుకు సక్సెస్ అంటే..?!
  • కొడుకు మాటే నెగ్గింది… పగ్గాలన్నీ లోకేష్ చేతుల్లోకి వచ్చేసినట్టే…
  • Unsolved Mystery … ఇందిరా గాంధీ 60 లక్షల బ్యాంకు సొమ్ము కథ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions