Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టైమ్ ట్రావెల్… ఇండియన్ సినిమాలో ఈ కథతో ఇదే తొలిసారి…

June 11, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. The first time- travel movie in Indian cine industry . మనకు తెలుగులో సైన్స్ ఫిక్షన్స్ సినిమాలు చాలా తక్కువ . అందులో టైం మెషీన్ అనే కాన్సెప్టే సాధారణ తెలుగు ప్రేక్షకులకు ఇంకా కొత్త . అలాంటి కధాంశాన్ని సినిమాగా మలిచిన కె వి రెడ్డి గారి శిష్యుడు సింగీతం శ్రీనివాసరావు గారికి తప్పక చప్పట్లు కొట్టాల్సిందే . గురువు గారి మాయాబజార్ సింగీతం గారిని ఆవహించి ఉండి ఉండాలి .

కె వి రెడ్డి గారు యన్టీఆర్ని పికప్ చేస్తే సింగీతం వారు ఆయన కుమారుడు బాలకృష్ణని ఎంచుకున్నారు . అప్పటి వరకు రొమాంటిక్ , ఏక్షన్ సినిమాలకు పాపులరయిన బాలకృష్ణని ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా యన్టీఆర్ అంత అందంగా చూపారు సింగీతం . ముఖ్యంగా తెనాలి రామకృష్ణ , బాలకృష్ణ మెకతోక పద్యం అప్పుడు బాలకృష్ణ నవ్వు తెనాలి రామకృష్ణ సినిమాలో యన్టీఆర్ నవ్వుని గుర్తుకు తెస్తుంది .

Ads

ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా చారిత్రక కధల కాస్ట్యూమ్సుకు కొత్తయిన బాలకృష్ణ ప్రాక్టీస్ కొరకు తన షూటింగ్ లేకపోయినా ఉదయమే వచ్చి కూర్చునే వాడట ఆ కిరీటంతో . 30 ఏళ్ళ కింద నటులకు అంత క్రమశిక్షణ ఉండేది . కాబట్టే ఈ సినిమాలో బాలకృష్ణకు అంత గొప్ప పేరొచ్చింది . అతని కెరీర్లో ఈ ఆదిత్య 369 ఒక మైలురాయిలాగా నిలిచింది . ఇప్పటికీ చాలా తరచుగా టివిలో వస్తూ ఉంటుంది .

సింగీతం వారు తన టైం మెషీన్లో గతం , భవిష్యత్తు చూపటం వినూత్న ఆలోచన . అందులో గతానికి 1526 లోని శ్రీకృష్ణదేవరాయలుని ఎంచుకోవటమే ఈ సినిమా విజయానికి ప్రధమ కారణం . కాబట్టే బాలకృష్ణని అంత అందంగా చూపగలిగారు . అష్టదిగ్గజాలను ప్రవేశ పెట్టగలిగారు . తెనాలి రామకృష్ణుడిని చూపగలిగారు .
సినిమాలో హాస్య సన్నివేశాలన్నీ ఈ గతంలోనివే . సుత్తి వేలు , శ్రీలక్ష్మి సన్నివేశాలు మరచిపోలేం .

అంతేనా ! రాజనర్తకి సిల్క్ స్మిత పాత్ర . ఆమె హొయలు , స్మిత- మోహినిల పోటీ నృత్యం , ఆ పోటీ చివర్లో బాలకృష్ణ మోహినిల రాకెన్ రోల్ హడావుడి !! వ్వాహ్ !!! ఆ మొత్తం సీన్ సినిమాకు గుండెకాయ .

అలాగే మూడవ ప్రపంచ యుధ్ధం అయిపోయాక మొత్తం ప్రపంచం విధ్వంసం అయ్యాక , భూతలంపై రేడియేషన్ ఘోరంగా పెరిగి జనం బతికేందుకు భూగర్భంలోకి వెళ్ళిపోవడం , భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా ఉండబోతుందో రుచి చూపించటం సింగీతం వారి సృజనాత్మకతకు పరాకాష్ట .

ఈ సినిమా విజయానికి ఇతర ప్రధాన కారణాలు ఇళయరాజా సంగీతం , వేటూరి , సిరివెన్నెల , వెన్నెలకంటి పాటల సాహిత్యం , సుందరం మాస్టారు , అతని ఇద్దరు కుమారులు ప్రభుదేవా , రాజుల నృత్య దర్శకత్వం .
మొదటగా చెప్పుకోవలసింది రాయల వారి సభలో స్మిత , మోహినిల నృత్య పోటీయే . వేటూరి విరచిత సుర మోదము శుభ నాట్య వేదము నటియించగ తరమా అంటూ సాగే పాటకు వారిరువురి నాట్య ప్రదర్శన అద్భుతం . ఇద్దరూ పోటాపోటీగా నృత్యించారు . స్మితతో దీటుగా 16 ఏళ్ళ మోహిని నృత్యించటం గొప్ప విషయమే .

ఆదిత్య 369 అనగానే ఎవరికయినా గుర్తుకొచ్చే మధురాతి మధురమైన పాట జాణవులే వర వీణవులే కిలికించితాలలో . అసలు ఈ పదాన్ని ఉపయోగించిన వేటూరిని తప్పక అభినందించాలి . ఈ పాటలో స్మిత నృత్యం , నటన , మహాద్భుతం .

అలాగే మరో శ్రావ్యమైన పాట రాసలీల వేళ రాయబారమేల . బాలకృష్ణ మీద సెంచరీలు కొట్టే వయసు మాది బౌండరీలు కొట్టే మనసు మీది గ్రూప్ డాన్స్ కూడా హైలైటే . ఈ డాన్సుని ప్రత్యేకంగా ప్రభుదేవా కంపోజ్ చేసాడట . మరో పాట చిలిపి యాత్రలో చల్ చల్ చల్ చల్ .

పాటల్ని అత్యంత శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , జానకమ్మ , జిక్కి , చిత్ర , శైలజ అభినందనీయులు . ఈ సినిమాకు ముగ్గురు దర్శకులు ఫొటోగ్రఫీని హేండిల్ చేసారు . వి యస్సార్ స్వామి చారిత్రక గతాన్ని , కబీర్ లాల్ భవిష్యత్తును , పి సి శ్రీరాం ప్రస్తుతాన్ని హేండిల్ చేసారు .

1895 లో H G Well వ్రాసిన ది టైం మెషీన్ నవల ఈ సినిమాకు స్ఫూర్తి . భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అనే దాని మీద మద్రాసు అమెరికన్ లైబ్రరీలో ఉన్న సైన్స్ ఫిక్షన్ పుస్తకాలను పరిశోధించారట . అంత కష్టపడ్డారు కాబట్టే మాస్టర్ పీస్ అయింది . హిందీలోకి మిషన్ 369 గా , తమిళంలోకి అపూర్వ శక్తి  369 గా డబ్ చేయబడింది .

ప్రధాన పాత్రలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం , మోహిని ,సిల్క్ స్మిత , టినూ ఆనంద్ , అమ్రీష్ పురి , చలపతిరావు , సుత్తి వేలు , శ్రీలక్ష్మి , జె వి సోమయాజులు , చంద్రమోహన్ , శుభలేఖ సుధాకర్ , బ్రహ్మానందం , కిన్నెర తదితరులు నటించారు . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చిచ్చర పిడుగు తరుణ్ . అతనితో పాటు తర్వాత కాలంలో హీరోయినుగా భాసిల్లిన రాశి బాల నటిగా నటించింది .

సుమారు కోటిన్నర రూపాయల ఖర్చుతో తీయబడిన ఈ సినిమాకు కలెక్షన్లు , ప్రశంసలు , అవార్డులు వచ్చాయి . ఉత్తమ కళా దర్శకునిగా పేకేటి రంగాకు , ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనరుగా అల్లాడ సాంబశివరావులకు నంది అవార్డులు వచ్చాయి .

It’s a master piece in not only Telugu film industry but also in the then Indian film industry . A great entertainer too . An unmissable one . ఎన్ని సార్లయనా చూడబుధ్ధి వేసే అందమైన సినిమా కూడా . యూట్యూబులో ఉంది . Enjoy it ..,. నిన్న బాలకృష్ణ పుట్టినరోజు

నాకు బాగా నచ్చిన బాలకృష్ణ సినిమా ఈ ఆదిత్య 369 . రాయల వారిగా తండ్రితో సమానంగా కనిపిస్తాడు బాలకృష్ణ ఈ సినిమాలో . అందుకే ఈ సినిమా  విశ్లేషణ… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టైమ్ ట్రావెల్… ఇండియన్ సినిమాలో ఈ కథతో ఇదే తొలిసారి…
  • ఫాఫం విష్ణుప్రియ..! చివరకు ఆ చీప్ జబర్దస్త్ షోలోనూ సెటైర్లు..!!
  • హక్కుల బాలగోపాల్ స్మృతి… ఒక వాస్తవిక గణితం…
  • అమ్మ కుర్చీ..! శూన్య నేత్రాలు… శుష్క నిరీక్షణలు… ఇప్పటి అమ్మ…!!
  • మాయదారి సంత..! రేయ్, ఎవుర్రా మీరంతా..? యాణ్నుంచి వచ్చార్రా..!!
  • భారతీరాజా గొప్ప దర్శకుడే… కానీ కొన్ని వివాదాలు కూడా…
  • సర్కారు ఉంటేనేం, పోతేనేం… డీఎంకే లిక్కర్ వసూళ్లపై విజయ్ నజర్..!
  • తెలుగు వెండితెరపై 30 ఏళ్ల క్రితమే ‘హక్కుల కాక్రోచ్‌లు…
  • వినకుండానే నామినేషన్ రద్దా..? రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన తప్పేంటంటే..?
  • నత్వానీకి, మీనాక్షికి వేర్వేరు న్యాయాలు… డబుల్ స్టాండర్డ్స్..! సీట్ చోరీ…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions