.
ముందుగా Bhavanarayana Thota తన వాల్ మీద షేర్ చేసిన Annapragada Bollamraju పోస్టు ముఖ్యాంశాలు ఓసారి చదవండి… తరువాత చివరలో మాట్లాడుకుందాం… జయలలిత టు ది పవర్ ఆఫ్ మనీ…
ఆస్పత్రికెళ్లి మరీ బూతులు తిట్టిన జయమ్మ… 1990ల చివరి అంకంలో అన్నాడీఎంకే విపక్షంలో ఉండేది. కేంద్రంలో మాత్రం సంకీర్ణంలో కొనసాగింది. స్వతహాగా ఆడిటర్ అయిన రాజ్యసభ సభ్యుడు ఆర్కే కుమార్ కేంద్ర ఆర్థిక, రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. అన్నాడీఎంకే మీడియా వ్యవహారాలు కూడా చూసేవారు. జయలలితకు నమ్మిన బంటు అన్న పేరు ఉండేది.
Ads
కాకపోతే ఒక విషయంలో మాత్రం పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతుందన్నట్లుగా తొందరపాటును ప్రదర్శించి ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఒక పని కోసం అంబానీ రెండు కోట్ల రూపాయల నగదును ఆర్కే కుమార్ కు పంపించారు. అది మొత్తం తనకే అనుకుని కేంద్రం మంత్రి కుమార్ ఇంటికి తెచ్చేసుకున్నారు. అంబానీ అంబానీ కదా. ఆయన జయలలితకు ఫోన్ చేసి రెండు కోట్లు పంపాను అందాయా అని వాకబు చేశారు.
జయలలిత తక్షణమే ఎంక్వయిరీ చేయించారు. అప్పుడు డబ్బులు ఆర్కే కుమార్ కు చేరినట్లుగాను, ఆయన జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ కు పంపకుండా తన వద్దే అట్టే పెట్టుకున్నట్లుగా తేలిపోయింది. దానితో ఆ సమాచారం తెచ్చిన వారినే జయమ్మ చెడామడా తిట్టేశారు. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం విషయం ఆర్కే కుమార్ కు తెలియడం, భయంతో ఆయనకు గుండె పోటు రావడం, ఒక కార్పోరేట్ ఆస్పత్తిలో చేరడం గంటల వ్యవధిలోనే జరిగిపోయింది.
ఈ లోపు ఆర్కే కుమార్ తన వద్ద ఉన్న నగదును పోయెస్ గార్డెన్ కు పంపించేశారు. ఐనా పురచ్చి తలైవి ఆయన్ను వదిలిపెట్టలేదు. ఆమె ఆస్పత్రికి బయలుదేరితే పేషెంటుగా ఉన్న ఆర్కే కుమార్ ను పలుకరించడానికి వెళ్తున్నారని అందరూ భావించారు. జయలలిత మాత్రం ఆస్పత్రికి వెళ్లి.. ఆర్కే కుమార్ ను అనరాని మాటలు అనేశారు. నా దగ్గరే నీ తెలివితేటలు చూపిస్తున్నావా అని నిలదీశారు.
ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఆర్కే కుమార్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని అప్పటి ప్రధాని వాజ్ పేయికి పురచ్చి తలైవి లేఖ పంపడం, ఆయన మంత్రి పదవిని కోల్పోవడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి. ఆ తర్వాత ఆర్కే కుమార్ ఎక్కువ రోజులు బతకలేదు. ఆయన శవయాత్రలో కనీసం అన్నాడీఎంకే సాధారణ కార్యకర్తలు కూడా పాల్గొనలేదు. ఈ ఘటన 1999 ప్రాంతంలో జరిగింది…
మంత్రి కన్నప్పన్ కు షాక్… జయలలిత తొలి సారి సీఎంగా ఉన్నప్పుడు 1991 నుంచి 1996 మధ్య అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. మంత్రులంతా కరెప్ట్ అన్న పేరు ఉండేది. అలాంటి వారిలో కన్నప్పన్ అని ఒకాయన ఉండేవారు. ఒకసారి కొందరు పారిశ్రామికవేత్తల నుంచి భారీగా క్యాష్ వచ్చి పడింది. దాన్ని దక్షిణ తమిళనాడులోని తన సొంతూరు తరలించాలని కన్నప్పన్ డిసైడయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి.
ఒక వ్యాన్ లో క్యాష్ రవాణా మొదలైంది. ఆ సంగతి ఇంటెలిజెన్స్ బ్యాచ్ జయలలితకు చేరవేశారు. అదేంటి మనకు ఇవ్వకుండా మొత్తం కన్నప్పన్ తీసుకెళ్లడమేంటని ఆమె కోప్పడ్డారు. ఆ డబ్బు పట్టుకు వచ్చెయ్యమని జయలలిత ఆదేశించారు. వెంటనే ఫోన్ల మీద ఫోన్లు వెళ్లిపోయాయి. తిండివనం పరిసరాల్లోని ఒక చెక్ పోస్టు దగ్గర డబ్బులున్న వ్యాన్ ను పోలీసులు ఆపేశారు. నగదును పోలీసు జీపులోకి ట్రాన్స్ ఫర్ చేసి.. నేరుగా తీసుకొచ్చి పోయెస్ గార్డెన్ లో జమచేశారు. ఆ సంగతి మొత్తం తెలిసినా కన్నప్పన్ ఏమీ చేయలేక ఊరుకున్నారు. జయలలితా మజాకా..
మాజీ ఆడిటర్ ను చెప్పుతో కొట్టిన జయ… తన ఆస్తులు, తన దగ్గర ఉన్న నగదు వ్యవహారాలను ఎవరైనా బయటకు చెబితే జయలలితకు మహా చెడ్డ కోపం వచ్చేస్తుంది. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేశారంటూ వారిని సంగతి తేల్చేందుకు ఆమె ఎంతకైనా వెనుకాడరు. 1999 మార్చి ప్రాంతంలో జరిగి ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిందే.
ఒకప్పుడు రాజశేఖర్ అనే చార్టెర్డ్ అకౌంటెంట్ జయలలిత ఆర్థిక వ్యవహారాలు చూసేవారు. తర్వాత ఆయన్ను తొలగించి వేరే ఆడిటర్ ను పెట్టుకున్నారు. అయితే రాజశేఖర్ తన ఆర్థిక లావాదేవీలన్నీ అప్పటి సీఎం కరుణానిధికి లీక్ చేస్తున్నారని జయలలిత అనుమానించారు. దానితో తన నివాసానికి పిలిపించుకుని చీవాట్లు పెట్టారు. అంతటితో ఊరుకోకుండా జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, శశికళ బంధువు మహదేవన్ కలిసి తనపై దాడి చేశారని రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జయలలిత ఇంట్లో తనను కింద కూర్చోబెట్టి హైహిల్స్ చెప్పులతో పిచ్చి కొట్టుడు కొట్టారని, మహాదేవన్ చేతిలో ఉన్న లాఠీని లాక్కుని జయలలిత తనను బాది పడేశారని రాజశేఖర్ లబోదిబోమన్నారు. పైగా నొప్పితో బాధ పడుతున్న తన నుంచి ఒకసారి 30 లక్షలు, మరో సారి 20 లక్షలు అప్పు తీసుకున్నట్లుగా నోట్లు రాయించుకున్నారని చెప్పుకొచ్చారు.
రాజశేఖర్ ను ఇంట్లో వదిలిపెడతానని చెబుతూ తీసుకెళ్లిన మహాదేవన్.. కారులోనే తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడట. విషయం బయటకు పొక్కితే రాజశేఖర్ కు అదే ఆఖరి రోజు అవుతుందని హెచ్చరించారట. ఐనా దెబ్బలు భారీగా తగలడం.. ఆర్థోపెడిక్ సర్జరీ చేయాల్సి రావడంతో రాజశేఖర్ ఆస్పత్రిలో చేరిన తర్వాత మొత్తం వ్యవహారం బయట పడింది. జయలలిత మాత్రం చాలా నింపాదిగా.. కరుణానిధి కుట్ర పన్ని కట్టు కథ అల్లారని చెప్పుకొచ్చింది…
మచ్చుకు ఇవి ఉదాహరణలు… వేల కోట్లు, విపరీతమైన అవినీతి, సంపాదన… వందల ఎకరాల ఎస్టేట్లు, కిలోల కొద్దీ బంగారం… అట్ఠహాసం, ఆడంబరం… పైసాపైసాకు ముడివేసి ఆర్జించింది… కానీ..? పెళ్లి లేదు, పిల్లల్లేరు… కుట్రో, నిజమో తెలియదు గానీ జారిపడింది ఇంట్లో, హాస్పిటల్‌లో రోజుల తరబడీ జీవచ్ఛవంలా ఉంచారు… ఓ దిక్కులేేని చావు నిజంగానే…
తరువాత ఆమె సంపద కుక్కలు చింపిన విస్తరి… ఎవడెంత దోచుకుని పోయాడో, చివరకు శశికళ ఎంత కాజేసిందో ఎవరికీ తెలియదు, ఇక బయటికి రాదు… ఆమె ఎస్టేట్ నుంచి కట్టల కొద్దీ నగదు దోచుకుపోయారట… అనేక కథనాలు… ఇక ఎప్పుడూ బయటపడని మిస్టరీ… కర్కోటక అవినీతిపరురాలు మరేం సాధించినట్టు..? ఓ వికృత, విఫల జీవన ప్రస్థానం..!!
Share this Article