….. By… పార్ధసారధి పోట్లూరి……….. మా జైల్లో ఉండి మా బిర్యానీ తిని మాకే ఎదురుచెప్తావా ? అంటూ హాక్కానీ నెట్వర్క్ నాయకులు తాలిబాన్ల మీద విరుచుకుపడి బాగా కొట్టారు. చివరకి కాబోయే అధ్యక్షుడు బారాదరిని కూడా బలంగా నెట్టి వేశారు దాంతో కింద పడి గాయపడ్డాడు బారాదరి. గత శుక్రవారం ఉదయం పదవుల పంపిణీ విషయమై తాలిబన్లు, హాక్కానీ నాయకులు అధ్యక్ష భవనంలో సమావేశం అయ్యారు. ఎవరెవరికి ఏ మంత్రి పదవులు ఇవ్వాలో బారాదరి లిస్ట్ చదవడం మొదలుపెట్టాడు కానీ ఆ లిస్ట్ లో తమకి ఏ మాత్రం ప్రాధాన్యం లేని పదవులు ఉండడంతో ఆగ్రహించిన హాక్కానీ నాయకులు వాదోపవాదలకి దిగారు తాలిబన్లతో. అది కాస్తా వేడెక్కి చివరికి బల ప్రదర్శనకి దారి తీసింది. ఒక దశలో మా జైల్లో మా తిండి తిని బలిసి మాకే ఎదురు చెప్తావా అంటూ ఏకంగా బారాదరి మీదకి వెళ్లారు హాక్కానీ నాయకులు. కానీ ఇతర తాలిబన్ నాయకులు వారించబోగా వాళ్ళని నెట్టేసి, ఏకంగా బారాదరి కూర్చున్న కుర్చీని వెనక్కి తోయడంతో కింద పడ్డ బారాదరి వెంటనే లేవలేకపోయాడు. ముందు స్వల్పంగా గాయపడ్డాడు అనుకున్నారు కానీ కింద పడడంతో షాక్కు గురయిన బారాదరి వెన్నుముకకి గాయం అయ్యింది.
కోపంతో అధ్యక్ష భవనం నుండి బయటికి వచ్చిన హాక్కానీ నాయకులని చూసి కాబూల్ లోని హాక్కానీ అనుచరులు ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. దాంతో కనీసం 14 మంది అమాయక జనం చనిపోయారు. కానీ ఈ విషయం మీడియాలో మాత్రం పంజషీర్ లో తాలిబాన్ల విజయం మీద తాలిబన్లు సంతోషం పట్టలేక గాలిలోకి కాల్పులు జరిపినట్లుగా ప్రచారం జరిగింది. ఇది గత శుక్రవారం రోజున జరిగింది కానీ అప్పటికి దాదాపుగా 450 తాలిబన్లు పంజషీర్ ఫైటర్స్ చేతిలో మరణించారు. మరో 150 మంది తాలిబన్లు బందీలుగా పట్టుబడ్డారు. అలాంటప్పుడు కాబూల్ లో సంతోషంతో తాలిబన్లు ఎలా కాల్పులు జరుపుతారు ? కాల్పులకి పాల్పడింది హాక్కానీ నెట్ వర్క్ వర్గం వారు. చనిపోయింది అమాయక ప్రజలు. విషయం వెనక ఉండి నడిపించింది ISI చీఫ్. బారాదరి ని కొట్టిన ఘట్టం ముగియగానే సాయంత్రానికి ISI చీఫ్ కాబూల్ చేరుకున్నాడు. తరువాత ప్రభుత్వ ఏర్పాటులో సహకారం అందించడానికి కాబూల్ వచ్చానని చెప్పుకున్నాడు. ఇలాంటి ఘటనలు నిత్యం మన దేశంలో కూడా చూస్తూనే ఉండేవాళ్లం గుర్తుందా ? గాంధీ భవన్ లో కాంగ్రెస్ లోని రెండు వర్గాలు కొట్టుకొని ,కుర్చీలు పగలకొట్టి, బయటికి విసిరేసిన సంఘటన (?) తరువాత ఇరు వర్గాల నాయకులు మైకుల ముందుకి వచ్చి, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అందువల్ల వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు అంటూ ముగించేవారు. ముందు తమ అనుచరులని రెచ్చగొట్టి ఎవరిది పై చేయి అయితే వాళ్ళకి పదవి వస్తుంది అన్నమాట ! సేమ్ ! ఇలాగే కాబూల్ లో జరిగింది.
Ads
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు బారాదరికి అక్కడ పూచిక పుల్ల విలువ లేదు. పాకిస్థాన్ ఎట్లా చెప్తే అట్లా ఆడాల్సిందే . ఆ మాటకొస్తే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల సంఖ్య 20 వేలకి మించదు. పాకిస్థాన్ కేంద్రంగా నడిచే హాక్కానీ నెట్వర్క్ దే సంఖ్య ఎక్కువ. పాకిస్థాన్ ISI కనుసన్నల్లో పెరిగిన హాక్కానీ హింసకి పాల్పడడం లో పెద్ద రికార్డ్ ఉంది. కేవలం తాలిబన్లని బూచిగా చూపి పాకిస్థాన్ ఆడిస్తున్న నాటకం ఇదంతా ! నిజంగా తాలిబాన్ల కి అంత దృశ్యం ఉంటే కాబోయే అధ్యక్షుడి మీద దాడి చేస్తుందా హాక్కానీ ? రేపు ఏదన్నా ప్రభుత్వం ఏర్పడితే అది పేరుకే ఉంటుంది కానీ దానిని నడిపేది పాకిస్థాన్ మాత్రమే. తాలిబన్లు నిలదొక్కుకుంటే రేప్పొద్దున తమ మాట వినకుండా అమెరికా మాట వినే ప్రమాదం ఉంది కనుకనే కీలమయిన రక్షణ,ఆర్ధిక,విదేశాంగ శాఖ లని హాక్కానీ కి ఇవ్వమని బెదిరిస్తున్నది పాకిస్థాన్. రక్షణ శాఖ తన హాక్కానీ అధీనంలో ఉంటే తాలిబన్లు మాట వినకపోతే సైన్యం సహాయంతో బారాదరీ ని దింపేసి హాక్కానీ నాయకుడిని అధ్యక్షుడిని చేస్తుంది పాకిస్థాన్. బారాదరీ పారిపోవాలంటే ఏ దేశమూ రానివ్వదు వెళితే పాకిస్థాన్ వెళ్ళాల్సిందే. ఇదీ పాకిస్థాన్ తాలిబాన్ల మీద వేసిన ఉచ్చు. ఇంతకీ కాబోయే అధ్యక్షుడు బారాదరీ దగ్గర ఉన్నది పాకిస్థాన్ పాస్పోర్ట్ ! పాకిస్థాన్ నేషనల్ గుర్తింపు కార్డు కూడా ఉంది. తాలిబాన్ల కి పక్కలో బల్లెం లాగా హక్కాని నెట్ వర్క్ ని పెట్టింది పాకిస్థాన్. రక్షణ, విదేశాంగ,ఆర్ధిక శాఖలని హాక్కానీ కి ఇస్తే విదేశాల నుండి వచ్చే సహాయం లో 75% పాకిస్థాన్ కి వెళ్ళిపోతుంది దొడ్డి దారిన. పక్కా ప్లాన్ తో పాకిస్థాన్ వేసిన స్కెచ్ ఇది. ఇప్పటికీ కేవలం టైటల్స్ మాత్రమే చూశాం చూడాల్సిన సినిమా ముందు ఉంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉండబోతున్నది !
Share this Article