రైతు బియ్యం పండించడు… ధాన్యాన్ని పండిస్తాడు… బాయిల్డ్ రైస్, రా రైస్ అని విడివిడిగా పండించడు… వరి వేస్తాడు… తనకు కాస్త మంచి దిగుబడి ఇవ్వగలవీ, రేటు వచ్చే వీలున్నవీ, తెగుళ్లను తట్టుకునేవి చూసుకుంటాడు… మీడియాలోనే చాలామందికి అసలు బాయిల్డ్ రైస్ ఏమిటి..? రా రైస్ ఏమిటి..? తేడా తెలియదు… ఎఫ్‌సీఐ సేకరణ తీరు తెలియదు… పార్టీలు చేసే గాయిగత్తర మాయలోనే వాళ్లూ పడిపోతున్నారు… అసలు ఏమిటివి..? రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయం ఏమిటి..? ఆ మూలాల్లోకి వెళ్లాలి ముందు… ధాన్యం పడించడం వరకూ రైతు బాధ్యత, అవసరం, జీవనవిధానం, కడుపు నింపే వృత్తి… దాన్ని నూకలు చేయాలా..? రా రైస్ చేయాలా..? బాయిల్డ్ రైస్ చేసి అమ్ముకోవాలా..? అనేది మిల్లర్ తలనొప్పి, లేదా కొనుగోలుదారు తలనొప్పి..! బాయిల్డ్ రైస్, అనగా ఉప్పుడు బియ్యం… పారాబాయిల్డ్ మిల్లులో కాస్త ఉడకబెట్టి, తరువాత మిల్లింగ్ చేస్తే వచ్చేది బాయిల్డ్ రైస్… నేరుగా మరాడిస్తే వచ్చేది పచ్చిబియ్యం, ముడిబియ్యం, రా రైస్… మనం తినేది ఇదే…
గతంలో బాయిల్డ్ రైస్ తినేవాళ్లు పలుచోట్ల… ధాన్యం పంట తక్కువ… ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా పుష్కలంగా పంట… పైగా అందరూ రా రైస్ మాత్రమే తింటున్నారు… దాంతో బాయిల్డ్ రైస్‌కు మార్కెట్ లేదు, దాన్ని కొనుగోలు చేయబోమని చాలాకాలంగా ఎఫ్‌సీఐ చెబుతోంది… పంజాబ్ రైతులు తెలివైనవాళ్లు… వానాకాలం ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, రా రైస్ చేసి ఎఫ్‌సీఐకి ఇచ్చేస్తారు, యాసంగిలో గోధుమకు వెళ్లిపోతారు, అదీ ఎఫ్‌సీఐకే అధికంగా ఇస్తారు… ఎఫ్‌సీఐకి కూడా రా రైస్ కొనడానికి ఇబ్బంది లేదు… తెలంగాణ ప్రభుత్వానికి ఇవన్నీ తెలియక కాదు, అన్నీ తెలుసు… తనే బాయిల్డ్ రైస్ ఇవ్వబోమనీ, ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామనీ ఎఫ్‌సీఐ వద్ద అంగీకరించి వచ్చింది… రైతుల్ని జాగ్రత్తగా ప్రత్యామ్నాయ పంటల వైపు ఎలా తీసుకెళ్లాలో ఓ పాలసీ లేదు, దానిపై దృష్టీ లేదు, ఈలోపు హుజూరాబాద్ ఫలితం వచ్చిపడింది… బీజేపీ మీద విరుచుకుపడటానికి ఈ కొత్త పాట అందుకుంది… కేంద్రంలోని బీజేపీ వరి కొనదట, అందుకే మేమేం చేయాలె, మేం కూడా కొనం అని రాగం అందుకుంది… కేసీయార్, బండి సంజయ్ దాకా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేసుకుంటున్నారు… అంతా రాజకీయం…
నువ్వెందుకు కొనవు అని రాష్ట్రాన్ని బీజేపీ అడుగుతుంది… అసలు నువ్వే వద్దంటున్నవ్, నువ్వు కొంటే కదా, రాష్ట్రంలో నేను కొనేది అంటుంది టీఆర్ఎస్… మరి ఇన్నేళ్లూ నువ్వే పంటంతా కొన్నట్టు ఫోజులు కొట్టింది ఎవరు..? కేంద్రం కొంటేనే కదా, నువ్వు ఇక్కడ కొన్నది, నీ గొప్పేం ఉంది, ఇప్పుడైనా రా రైస్ ఇవ్వు, కొంటుంది అనేది బీజేపీ వాదన… దాన్నైనా సరిగ్గా చెప్పుకునే తెలివి కనిపించడం లేదు, అది వేరే కథ… టీఆర్ఎస్ గొంతు పెంచి కొన్ని అబద్ధాల్ని చెబుతూ, అవే నిజాలని జనాన్ని నమ్మమంటోంది… బీజేపీకి ఆ నిజాలు చెప్పే సోయి కూడా లేదు… ఎమోషన్ పెంచడం కోసం టీఆర్ఎస్ ‘‘పంజాబ్‌లో మొత్తం పంట కొంటారు, తెలంగాణలో కొనరు, ఇదేం వివక్ష..? తెలంగాణ రైతును బతకనివ్వరా..?’’ అనడుగుతోంది… నిజానికి పంజాబ్‌లో జరిగేది వేరు… ఒక్కసారి ఎఫ్‌సీఐ అధికారిక సైటులోకి వెళ్లి చెక్ చేయండి, ఈ వివరాలు కనిపిస్తయ్…
Ads
అక్కడ రా రైస్ తీసుకుంటున్నారు… ఈ ఆరేళ్ల లెక్కలు చూస్తే అర్థమయ్యేది అదే… మరి అదే రా రైస్ ఇస్తే తెలంగాణ నుంచి కూడా తీసుకుంటాం అంటున్నది కదా కేంద్రం… కానీ ఇవేవీ బయటికి ఎవరూ చెప్పరు… పరస్పరం తిట్టుకోవడమే రాజకీయం… ఒకరి మీద మరొకరు నిందమోపడం… రైతుల్ని ఆగం చేయడం… పంటలతో రాజకీయం చేయడం తాజా విషాదం… అసలు టీఆర్ఎస్ను అడగాల్సింది ఏమిటంటే… రా రైస్ ఎందుకు మిల్లింగ్ చేయించవు, ఎఫ్‌సీఐకి ఆ రైస్ ఎందుకు ఇవ్వవు, ఈ బాయిల్డ్ రైస్ మీద ప్రేమేంటి..? ఆ కథేంటి..? బీజేపీ, టీఆర్ఎస్ మెడలు విరుచుకొండి, వంగబెట్టి దభీదభీ దంచుకొండి… కానీ రైతులకు నిజాలు చెప్పండి… ఎఫ్‌సీఐ సొమ్ము వృథా అయితే, అది కూడా మన సొమ్మే, మనం కట్టే పన్నుల నుంచే అది సబ్సిడీలు భరించేది… ఆమాత్రం సోయి లేని రాజకీయ పార్టీలు, నేతల జ్ఞానాలు మన తాజా విషాదాలు…!!
Share this Article