ఇదే మరి, గాలికి పోయే కంపను డ్యాష్కు తగిలించుకున్నట్టు… నిన్నామొన్నటివరకు ప్రేక్షకుల్లో నాని పట్ల ఓ సదభిప్రాయం ఉండేది… ఆచితూచి మాట్లాడతాడు, వివాదాల జోలికిపోడు, కాస్త నటన కూడా తెలిసినోడు, దిగువ స్థాయి నుంచి ఎదిగాడు, డిఫరెంట్ పాత్రలు చేస్తాడు అనేది ఆ సదభిప్రాయం… కానీ తను కూడా కొన్నాళ్లుగా పక్కా కమర్షియల్ అయిపోయాడు… దాంతోపాటు సగటు సినిమా హీరోల తాలూకు ‘దైవత్వం’ కూడా బాగానే అంటినట్టుంది… టికెట్ రేట్ల తగ్గింపు అనేది ఓ సంక్లిష్టమైన, సున్నితమైన సబ్జెక్టు… ప్లస్ జగన్తో టాకిల్ చేయడం అంత వీజీ కాదు… అసలే మంట మీదున్నాడు… అందుకే పెద్ద పెద్ద స్టార్లు, నిర్మాతలు, దర్శకులు కూడా జాగ్రత్తగా డీల్ చేయాలని ప్రయత్నించారు… సాధ్యం కాలేదు… కొందరు ఎగ్జిబిటర్లు కోర్టుకు పోయారు… కోర్టు ఆ టికెట్ రేట్ల తగ్గింపు జీవోను స్థూలంగా రద్దు చేసిందనే వార్తలు వచ్చాయి కానీ కొన్ని మెలికలు ఉన్నయ్…
జిల్లాల్లో సినిమాటోగ్రఫీ వ్యవహారాలు చూసేది జాయింట్ కలెక్టర్… తను అనుమతించాలి రేట్ల పెంపునకు… ఒకవేళ అలా అనుమతిస్తే సాయంత్రానికి ఆ జాయింట్ కలెక్టర్ అక్కడ ఆ పోస్టులో ఉండడు… పోనీ, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అనుకుని ఎవరైనా ఎగ్జిబిటర్లు తలెగరేస్తే, రెండుమూడు రోజులుగా అధికారుల దాడులు, థియేటర్ల సీజ్ చూస్తున్నాం కదా… జాయింట్ కలెక్టర్ల అధికారాల్ని ఎవరూ సవాల్ కూడా చేయలేరు… సో, టికెట్ల ధరలపై ఈ అనిశ్చితి పోవాలంటే జగన్ ప్రభుత్వంతో ఇండస్ట్రీ ‘సరైన పద్ధతిలో’ డీల్ చేయాల్సిందే… అదెలాగో తెలియక పెద్ద తలకాయలు కిందామీదా పడుతున్నాయ్… ఈ స్థితిలో నాని చేసిన వ్యాఖ్యలు కొన్ని కోణాల్లో అబ్సర్డ్, తలబిరుసు కూడా…
థియేటర్ల కలెక్షన్లను కిరాణాకొట్ల కలెక్షన్లతో పోల్చడం సరికాదు… కిరాణాకొట్లు అంటే సినిమా టైపు ‘చిల్లర వ్యవహారం’ కాదు… అవి లేకపోతే లైఫ్ లేదు… బడా మాల్స్ ధాటిని తట్టుకుని కిరాణాషాపులు ఈరోజుకీ నిలబడ్డవి, ప్లస్ మొన్నటి కరోనా ఉధృతిలో కూడా జనానికి అండగా నిలబడ్డవి… నిలబడతాయి..! కరోనా పీరియడ్లో నీ థియేటర్లు మూసేస్తే జనానికి ఏం నష్టం వాటిల్లింది..? పైగా జనం హేపీగా ఉన్నారు… ఐనా సినిమావాళ్లకు కడుపునొప్పి ఉండవచ్చుగాక, వాళ్ల తరఫు వాదన వినిపించనివ్వండి, ఎవరూ వద్దనరు… కానీ ఇలాంటి పిచ్చి పోలికలతోనే జనానికి మండేది… పైగా టికెట్ రేట్ల తగ్గింపు ప్రేక్షకులకు అవమానించడమే అని మరో వ్యాఖ్య… ఎందుకు..? మేం తెగబలిసిపోయి ఉన్నాం, టికెట్ రేట్లు తగ్గిస్తే, అది మా చెల్లింపు సామర్థ్యాన్ని ప్రభుత్వం అవమానించినట్టే అని ప్రేక్షకులు కోపంగా ఉన్నారా..? అలా అనుకుంటున్నాడా నానిగా పిలవబడే ఈ నటుడు..? పిచ్చి వ్యాఖ్య కాదా… నిజానికి ప్రేక్షకుల్లో సినిమావాళ్ల మీద వీసమెత్తు సానుభూతి లేదు…
Ads
నాని వ్యాఖ్యల వార్తలు, వీడియోల కింద కామెంట్లు ఓసారి పరిశీలిస్తే… కనీసం 95 శాతం ప్రేక్షకులు సినిమా వాళ్ల మీద వ్యతిరేకంగా స్పందిస్తున్నారు… నాని వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు… ప్రత్యేకించి, ప్రేక్షకులను అడ్డగోలుగా దోచి, హీరోలకు వందల కోట్లు కట్టబెడుతున్నారనే భావన ప్రబలంగా ఉంది జనంలో… నిజానికి పంచాయతీల పరిధుల్లో మాత్రం మరీ తక్కువగా టికెట్ రేట్లను ఖరారు చేశారనీ, థియేటర్ మెయింటెనెన్స్కు ఆ సొమ్ము, కలెక్షన్లు అస్సలు సరిపోవనే అభిప్రాయం ఉంది, అందులో నిజముంది, కానీ కార్పొరేషన్లలో రేట్లను ప్రభుత్వం రీజనబుల్గానే ఉంచిందంటున్నారు… (అసలు సినిమా వ్యాపారంలోకి ప్రభుత్వం ఎందుకు ఎంటర్ కావాలనే ఓ వాదన వినిపిస్తోంది కానీ అదనపు షోలు, అడ్డగోలు రేట్లు, బెనిఫిట్ షోల పేరిట ఇష్టారాజ్యం వసూళ్లను ప్రజాప్రభుత్వాలు ఎందుకు చూస్తూ ఊరుకోవాలనేది దానికి కౌంటర్ వాదన… అదంతా వేరే చర్చ…)
పోనీ, నాని ఒక్కడే ధైర్యం చేశాడు, ప్రభుత్వం తీరు పట్ల వ్యతిరేకంగా మాట్లాడాడు, ఎవరూ మాట్లాడకపోతే ఎలా అనే వాదన కరెక్టే అనుకుందాం… కానీ జనంలో వీళ్ల పట్ల ఏమైనా సానుభూతి ఉందా..? ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించే పార్టీ, సినిమావాళ్లకు ప్రీతిపాత్రమైన తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో సినిమావాళ్లకు అండగా నిలబడటానికి సంకోచిస్తోంది… వాళ్ల మీడియా కూడా అంతే… ఎందుకు..? అది జనానికి నచ్చే అవకాశం లేదు కాబట్టి…! రేపు తన సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఈరోజు రేట్ల మీద వ్యాఖ్యలు చేయడం వల్ల నానికి ఇప్పటికిప్పుడు వచ్చేది కూడా ఏమీలేదు… అన్నట్టు నానీ… మీ హీరోయిజం దందాలు మానేసి, కిరాణాకొట్లు పెట్టుకుంటాం అని వెటకారంగా అంటారేమో… వద్దు, వెక్కిరింపుగానైనా మీ మనస్సుల్లోకి ఆ ఆలోచనలు రానివ్వకండి ప్లీజ్… మీ సినిమావాళ్లు ఆ రంగాన్ని కూడా నానా ఛండాలం చేసేస్తారు…!!
Share this Article