‘‘తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం కీలక అధికారిగా ఉన్న ఒకరితోపాటు, గతంలో అదే పదవిలో ఉండిన మరో అధికారి కీలక పాత్ర పోషించారు. ఈ ఇరువురు అధికారులు ముఖ్యమంత్రి తరఫున రాయబారం నడిపారు. దీంతో జగన్‌రెడ్డి దంపతులను ప్రత్యేకంగా కలుసుకోవడానికి జస్టిస్ రమణ అంగీకరించారని తెలిసింది. ఈ సందర్భంగా గతంలో జరిగినదానికి తనను క్షమించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆయనను వేడుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘‘నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకు సారీ అంటే సరిపోదు. కొంతమంది అప్పట్లో నన్ను తప్పుదారి పట్టించారు. వారి మాటలు నమ్మి నేను మీకు వ్యతిరేకంగా లేఖ రాశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి’’ అని జగన్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రాధేయపడినట్టు తెలిసింది…’’
……. ఆంధ్రజ్యోతిలో యధావిధిగా ఆర్కే రాసుకొచ్చిన ఆదివారం వ్యాసంలోని ఓ పేరా ఇది… తన వ్యాసంలోని ఇతరత్రా చెప్పినట్టు ఇవన్నీ జరుగుతాయనే అనుకుందాం ఓసారి… త్వరలో వివేకా హత్య కేసులో సీబీఐ చార్జి షీట్ దాఖలు చేయబోతోంది… ఈడీ కేసుల విచారణలో వేగం పెరగబోతోంది… జగన్ చక్రబంధంలో ఇరుక్కుపోనున్నాడు… అందుకే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నాడు… షర్మిల స్వరం పెంచుతోంది… తెలంగాణ బరి వదిలేసి ఏపీలో అడుగుపెట్టబోతోంది… అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రిని సీబీఐ అరెస్టు చేస్తుంది… జగన్ భార్య భారతీరెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది..’’ ఆర్కే ఆశించినట్టు ఇవన్నీ జరుగుతాయనే అనుకుందాం…
ఈ స్థితిలో జగన్ వేరే దిక్కులేక, సుప్రీం చీఫ్ జస్టిస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి సతీసమేతంగా వెళ్లి సారీ చెప్పాడు, మన్నించండి అంటూ వేడుకున్నాడని ఆర్కే తేల్చేశాడు… జగన్ తనను ఏమని వేడుకున్నాడో సుప్రీం చీఫ్ బహుశా చెప్పి ఉండకపోవచ్చు… జగన్‌కు ఎలాగూ ఆర్కే పేరంటేనే ఏవగింపు కాబట్టి తనూ ఫోన్ చేసి ‘ఇలా సారీ చెప్పాను ఆర్కే గారూ’ అని చెప్పి ఉండకపోవచ్చు… భారతీరెడ్డి అసలే చెప్పకపోవచ్చు… మరి ఆర్కేకు ఈ సారీ ఎపిసోడ్ గురించి అంత పూసగుచ్చినట్టు ఎవరు చెప్పి ఉంటారబ్బా..? సరే, జగన్ సారీ ఎందుకు చెప్పాడో, జగన్ దేనికి భయపడుతున్నాడో, ఎందుకు సీజే పట్ల తన పాత ధోరణికి, తన పాత చర్యలకు పశ్చాత్తాపపడుతున్నాడో పాయింట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు… సరే, కానీ..?
ఇంతకీ సుప్రీం చీఫ్ క్షమించేసినట్టేనా..? ‘సరే జగన్, గతం గతః మరిచిపోదాం’ అని పెద్ద మనస్సుతో మన్నించినట్టేనా..? రాజధానిలో పనులు మళ్లీ స్టార్ట్ కావడం వెనుక సీజే హితబోధ ఏమైనా ఉండి ఉంటుందా..? ఈ క్లారిటీ ఒక్కటి మిస్సయింది ఆర్కే వ్యాసంలో..! కానీ సీజే జగన్ పట్ల ఏమాత్రం సానుభూతితో ఉండకూడదు సుమీ అన్నట్టుగా… ‘‘స్వాగతసత్కారాలకు, ‘సారీ’లకు భారత న్యాయవ్యవస్థ పొంగిపోదు-, లొంగిపోదు. ప్రశంసలకు పడిపోయి విమర్శలకు కుంగిపోతే అది న్యాయవ్యవస్థ ఎలా అవుతుంది? భావోద్వేగాలకు, రాగద్వేషాలకు అతీతంగా న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్నది కూడా. జగన్‌రెడ్డిపై ఎంతటి తీవ్రమైన అభియోగాలు నమోదైనప్పటికీ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కనుక కలుసుకోవడానికి జస్టిస్ రమణ అంగీకరించి ఉండవచ్చు. జగన్‌రెడ్డి ప్రస్తుతం నిందితుడు మాత్రమే. దోషిగా నిర్ధారణ కాలేదు. భారత ప్రధాన న్యాయమూర్తిని కలుసుకున్నంత మాత్రాన ఆయనపై విచారణకు వస్తున్న కేసులలో తీర్పులు తారుమారవుతాయని ఎవరూ భావించకూడదు. జగన్‌రెడ్డి కానీ, ఆయన తరఫున జస్టిస్ రమణతో సమావేశం ఏర్పాటు చేయించినవాళ్లు కానీ అలా భావిస్తే పప్పులో కాలేసినట్టే…’’ అని రాసుకొచ్చాడు… ‘‘రానున్న రోజులలో ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చే తీర్పులు గానీ, జగన్‌రెడ్డిపై విచారణకు రానున్న కేసులలో తీర్పులు ఎలా ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థను జగన్ అండ్ కో శంకించలేరు…’’ అంటూ జగన్ మీద వ్యతిరేక తీర్పులు వచ్చినా ఎవరూ ఇక న్యాయవ్యవస్థను తప్పుపట్టలేరు గనుక, ఇక కోర్టులు ఏ ఒత్తిడీ లేకుండా తీర్పులు చెప్పవచ్చుననే పరోక్ష కర్తవ్యబోధ కూడా చేశాడు…
Ads
ప్చ్, ఇన్ని చెప్పాడు… కానీ, జగన్ బెయిల్ రద్దవుతుందా..? మళ్లీ జైలుకు వెళ్తాడా..? ఏపీ జైలు అయితే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కాబట్టి, మళ్లీ అదే చంచల్‌గూడ జైలులోని, అదే సెల్‌కు పంపిస్తారా..? మా నాయన వారసత్వం, ఆ కుర్చీపై నేనే కూర్చుంటాను అని షర్మిల పంచాయితీ పెడుతుందా..? చంద్రబాబు చెబుతున్నట్టుగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడా..? జైలుకు వెళ్తే ఈ ప్రణాళికల్లో కూడా యూటర్న్ తీసుకుంటాడా..?…. పనిలోపనిగా వీటికీ జవాబులు రాస్తే ఓ పనైపోయేది కదా ఆర్కే సార్..?!
Share this Article