ఒక వీడియో చూసి ఆశ్చర్యమేసింది… మంచి మెజారిటీతో ఈ దేశాన్ని రెండు టరమ్స్గా పాలిస్తున్న పార్టీయేనా ఇది అనే ఆశ్చర్యం… ఒక ప్రాంత మనోభావాల్ని నిర్దయగా దెబ్బతీస్తున్న ఆశ్చర్యం… ఆ పార్టీ వ్యూహరాహిత్యం మీద ఆశ్చర్యం… అసలు తెలంగాణలో పార్టీ ఎదగకపోవడానికి కారకులు ఈ ప్రాంత నాయకులు కాదనీ, బాధ్యులు ఢిల్లీ పెద్దలేననే ఆశ్చర్యం… ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే..? ఇదీ…
ఇది టీఆర్ఎస్ సోషల్ వింగ్ సర్క్యులేషన్లో ఉన్నదే… కానీ హోం మంత్రి, పార్టీని తన చెప్పుచేతల్లో నడిపిస్తున్న అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతున్న వీడియో… మొన్నమొన్ననే కదా, మోడీ తెలంగాణ విభజనను ఆక్షేపించాడు… సగటు తెలంగాణవాది తెల్లబోయి తిట్టుకున్నాడు… దీన్నెలా సమర్థించుకోవాలో తెలియక సగటు బీజేపీ అభిమాని లోలోపల కుమిలిపోయాడు… మళ్లీ ఇప్పుడు అమిత్ షా అలాగే మాట్లాడాడు… ఒకవైపు మేం తెలంగాణ విభజనను ఆక్షేపించడం లేదు అంటూనే తెలంగాణవాదుల్ని హర్ట్ చేసే పనిలో పడ్డారు వీళ్లు…
మేం సామరస్యంగా మూడు రాష్ట్రాలను విభజించాం, కాంగ్రెసోళ్లకు అది చేతకాలేదు, ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఇష్టారాజ్యంగా బిల్లు పాస్ చేసుకున్నారు… అని కాంగ్రెస్‌ను ఏదో బోనులో నిలబెట్టినట్టు తెలివి ప్రదర్శిస్తున్నారు… కానీ జరుగుతున్న నష్టం అర్థం కావడం లేదు…
Ads
- ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన విభజన తీరును ఇప్పుడు పదే పదే తప్పుపట్టడం వల్ల పార్టీకి ఏం లాభం..?
- ఓహో, అంత కష్టమైనా సరే, సోనియా తన మాట మేరకు విభజన బిల్లు పాస్ చేయించిందనే క్రెడిట్ ఇస్తున్నట్టేనా మీరు..?
- కాంగ్రెస్ వ్యతిరేక తెలంగాణవాది కూడా సోనియా పట్ల మరింత అభిమానం పెంచుకోవాలా మీ మాటలతో…?
- ఆ మూడు రాష్ట్రాల విభజన సులభంగా చేయగలిగారు, కానీ ఆంధ్రా లాబీని వంచడం అంత ఈజీ కాదనీ, ఐనా వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును ఆమోదించిందని ఇప్పుడు సోనియాను మెచ్చుకోవాలా..?
- ఒక ఉండవల్లి, ఒక కిరణ్‌కుమార్‌రెడ్డి, ఒక లగడపాటి వంటి వీర సమైక్యవాదులు కూడా ఈ భాషలో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకించినట్టు లేదు… మీరెందుకు పదే పదే పుండును కెలుకుతున్నట్టు..?
- విభజన తీరు సరిగ్గా లేదు అంటుంటే… వీళ్లు ఈరోజుకూ తెలంగాణ మీద విషం కక్కుతున్నారు, వీళ్లకు తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదనే సంకేతాన్ని తెలంగాణ సమాజంలోకి పంపిస్తున్నట్టు కాదా..?
- పోనీ, కాంగ్రెస్ సరిగ్గా విభజించలేదనే అనుకుందాం… ఆరోజు, బీజేపీ ఎంపీలు సభలో లేరా..? మద్దతు ఇవ్వలేదా..? మరి ఆరోజు ఉన్న బీజేపీ పెద్దలకు మోడీకి, అమిత్ షాకు ఉన్నంత తెలివి లేదని అనుకోవాలా..? అదేనా వీళ్లిద్దరి ఉద్దేశం..?
- లోకసభలో మైకులు ఆపేయడం, పెప్పర్ స్ప్రేలు, తలుపులు మూయడాలు దుర్మార్గమే అనుకుందాం… రాజ్యసభలో పాస్ చేశారు కదా, మరి దాని మాటేమిటి..?
- చర్చ జరగలేదు అనే మాటే అబద్ధం, పాత రికార్డులు చూస్తే తెలుస్తుంది… చాలామంది మాట్లాడారు, ఆ తరువాతే బిల్లును పాస్ చేశారు, పాత రికార్డులు చూసినా తెలుస్తుంది…
- అసెంబ్లీ తిరస్కరించినా, అంగీకరించినా, కేంద్రం తలుచుకుంటే పార్లమెంటు ఆమోదం ద్వారా ఒక ప్రాంతాన్ని విభజించవచ్చుననే బేసిక్ రాజ్యాంగ నిబంధన కూడా తెలియదా వీళ్లకు..?
- ఐనా ఇన్నేళ్లుగా ఏపీ, తెలంగాణ ప్రజలు దాని గురించి మాట్లాడుకోవడం మరిచిపోయారు, ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు, మళ్లీ ఈ ఇద్దరూ ఎందుకు కెలుకుతున్నారు..? దేనికోసం..?
- ఇక్కడ బజార్లలో టీఆర్ఎస్ శ్రేణులతో బీజేపీ శ్రేణులు పోరాడుతుంటే… ఇంకోవైపు కేసీయారే నయం అనే భావనకు బలం చేకూరుస్తున్నారా వీళ్లిద్దరూ..? దీని భావమేంటి..?
Share this Article