బెంగాల్ 42 సీట్లు… మమతకు ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి వారసుడు అభిషేక్ బెనర్జీ రెడీ… ప్రస్తుతం ఎంపీ కూడా…
తమిళనాడు 39 సీట్లు… స్టాలిన్‌కు కూడా ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి కొడుకు ఉదయనిధి రెడీ… ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా…
మహారాష్ట్ర 48 సీట్లు… ఉద్దవ్ ఠాక్రేకు ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి కొడుకు ఆదిత్య రెడీ… ఆల్రెడీ ఇప్పుడు మంత్రి కూడా…
Ads
ఉత్తరప్రదేశ్ 80 సీట్లు… ములాయంకు ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి కొడుకు అఖిలేష్ ఉండనే ఉన్నాడు… తను మాజీ సీఎం…
బీహార్ 40 సీట్లు… లాలూ ప్రసాద్‌కు ప్రధాని పదవి కావాలి… అక్కడ సీఎం కావడానికి కొడుకు తేజస్వి రెడీ… ఆల్ రెడీ ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత…
కర్ణాటక 28 సీట్లు… 88 ఏళ్ల వయస్సులోనూ ప్రధాని పదవికి దేవెగౌడ రెడీ… అక్కడ సీఎం కావడానికి కొడుకు కుమారస్వామి మళ్లీ రెడీ…
…… జస్ట్, ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే… కేవలం 17 సీట్లు మాత్రమే ఉన్న తెలంగాణకన్నా ఎక్కువ లోకసభ సీట్లున్న రాష్ట్రాల సంఖ్య 12… ప్రధాని పదవి కావాలనుకునే వాళ్ల సంఖ్య బోలెడు… ఇప్పుడు ఈ ప్రస్తావన, చర్చ ఏమిటంటే..? కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలన్నీ కూడగట్టి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటున్నాడు కదా… యాక్టివ్ అయిపోయాడు కదా… ఈ 17 సీట్లలో తను గెలిచేవెన్ని..? నిన్ను ఎవరు ప్రధానిని చేస్తారు..? అంటూ కొద్దిరోజులుగా సోషల్ ప్రచారం కనిపిస్తోంది… కానీ..?
పరిస్థితులు అనుకూలిస్తే ప్రధాని కుర్చీలో కూర్చోవడం పెద్ద సమస్యేమీ కాదు… వీపీ సింగ్, గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ… ఎందరు పాలించలేదు…? వాళ్లకేమైనా సొంత మెజారిటీ ఉందా..? లేదు కదా…! ఒక్కసారి దేవెగౌడ ఎలా ప్రధాని అయ్యాడో చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో అప్పుడప్పుడు కేవలం లెక్కలు మాత్రమే కీలకపాత్ర పోషిస్తాయని అర్థమవుతుంది…
1996… ఈ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీకి వచ్చిన సీట్లు కేవలం 46… బీజేపీకి 161 సీట్లు వచ్చినయ్, వాజపేయి మెజారిటీ కూడగట్టలేక చేతులెత్తేశాడు… కాంగ్రెస్ గెలిచిన సీట్లు 140… ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పేసింది… అప్పుడు టీడీపీ నేత చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ అని ఓ దుకాణాన్ని తెరిచాడు… చిన్నాచితకా పార్టీలన్నీ అందులోకి చేర్చాడు… వీపీసింగ్, జ్యోతిబసు, లాలూ ప్రసాద్, ములాయం సింగ్, మూపనార్, కరుణానిధి… ఇలా అందరూ ప్రధాని పదవిని తిరస్కరించారు… కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు అంటే అది నిత్యనరకం అని వాళ్లకు తెలుసు…
దేవెగౌడను తీసుకొచ్చి ప్రధానిని చేశారు… అనుకున్నట్టే కాంగ్రెస్ తన కింద చాపను లాగేసింది… తరువాత గుజ్రాల్ ప్రధాని అయ్యాడు… చివరకు 1998లో కాంగ్రెస్ ఆ ప్రభుత్వాన్ని కూడా మింగేసింది… మళ్లీ ఎన్నికలు జరిగాయి… ఇక్కడ విషయం ఏమిటంటే… దేవెగౌడ, గుజ్రాల్‌కు ఏం బలముందని..? పరిస్థితులు అలా అనుకూలించినయ్… కుర్చీ ఎక్కించినయ్… సో, తెలంగాణలో 17 సీట్లు మాత్రమే ఉండటం అనేది కేసీయార్‌కు బలహీనత ఏమీ కాదు…
తనకు నిజంగా ప్రధాని కావాలని ఉంటే, హంగ్ వస్తే, ఏ ఫ్రంటో ఎక్కువ సీట్లు గెలిస్తే… ఇక తను ఎవరెవరి మద్దతును ఎలా సమీకరిస్తాడనేదే ముఖ్యం అవుతుంది… ప్రత్యేకించి మమత..!! ఏమో గుర్రమెగురావచ్చు… ఎందుకంటే మన సిస్టం ప్రకారం అసలు ఎంపీ కాకపోయినా సరే, పార్టీ లేకపోయినా సరే ప్రధాని కావచ్చు… ఆరు నెలల్లో లోకసభలోనో, రాజ్యసభలోనో సభ్యత్వం పొందాలి… మెజారిటీ ఎంపీలు లీడర్ ఆఫ్ ది హౌజ్‌గా ఎన్నుకోవాలి… అంతే…!! కానీ ప్రస్తుత ఎన్నికల్లో గనుక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే చాలా సమీకరణాలు మారిపోతయ్, కొద్దిరోజులపాటు కొందరు లీడర్లు కనిపించకపోవచ్చు… వారిలో కేసీయార్ కూడా ఉండొచ్చు…!!
Share this Article