నిన్న పదే పదే పలు సైట్లలో, సోషల్ మీడియాలో కనిపించి విపరీతంగా విసుగు తెప్పించిన ఓ వీడియో గురించి చెప్పుకోవాలి… విశ్వక్సేన్ అనబడే ఓ హీరో అశోకవనంలో అర్జునకల్యాణం అనే సినిమాలో హీరో… ఆ టైటిలే ఓ అబ్సర్డ్… సరే, ఏదో తీసి ఉంటారులే అనుకుందాం… అది విడుదల కావాల్సి ఉంది… అక్కడిక్కడా ప్రమోషన్ యాక్టివిటీస్‌లో కనిపిస్తున్నట్టున్నాడు కూడా…
అయితే ఈ వీడియో ఏమిటంటే..? ఒకతను హఠాత్తుగా ఆ హీరో కారుకు అడ్డం పడి, పెట్రోల్ క్యాన్ పట్టుకుని, నేను చచ్చిపోతా చచ్చిపోతా అని వీరంగం వేస్తున్నాడు… నీ బాధేమిట్రా అంటే 33 ఏళ్లు వచ్చినయ్, పెళ్లి కావడం లేదు అంటాడు… అంటే పరోక్షంగా విశ్వక్సేన్ పాత్ర గురించి అన్నమాట… ఎప్పుడైతే నువ్వు విశ్వక్సేన్ బ్రో, నాకు అర్జునుడు కావాలి అని అరుపులు మొదలెట్టాడో అది ఉత్త ఫేక్ వీడియో అనీ, ప్రాంక్ అనీ ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతోంది… ప్రాంక్ వీడియోలు తీయడం కూడా ఓ ఆర్ట్… ఫాఫం, ఆ యువరత్నానికి తెలియనట్టుంది… (అన్నట్టు, అది వైట్ పెట్రోలా మాస్టారూ..?)
ప్రాంక్ వీడియోలకు కూడా మంచి స్క్రిప్ట్ కావాలి… వీడియో చివరి వరకూ అది ప్రాంక్ అని చూసేవాడికి, అక్కడ సీన్లో ఉన్నవాడికి తెలియకూడదు… కానీ ఈ వీడియోలో అందరూ నవ్వుతూ కనిపిస్తున్నారు… సరే, ఏదో ఓ దేడ్ దిమాక్ ప్రాంక్ వీడియో అనుకుందాం… అయితే..?
Ads
ఇది ఎవరో యూట్యూబ్ వ్యూస్ కోసం చేసిన ప్రాంక్ వీడియోనా..? లేక సినిమా నిర్మాతలో, హీరోనో ప్రోత్సహించి చేయించిన ప్రమోషన్ వర్కా..? ఈ డౌట్ దేనికీ అంటే..? ఆ టైంకు విశ్వక్సేన్ కారు అక్కడికి వస్తుందని సదరు యూట్యూబర్‌కు ఎలా తెలుసు..? విశ్వక్‌కు ఇది ముందే తెలుసు… అందుకే తన మొహంలో వీసమెత్తు ఆశ్చర్యం, ఆందోళన లేదు… నిజంగా సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటివి చేస్తే ఇది ఓ పెద్ద చీదర యవ్వారం… మరీ ఈ స్థాయి ప్రమోషన్ అవసరమా విశ్వక్ నీకు..? మొన్న ప్రమోషన్ కోసం తెలుగు ఇండియన్ ఐడల్ షోకు వచ్చావు, హుందాగా ఉన్నావు… మరి ఇదేమిటి..?!
అసలు విషయానికి వస్తే… అది రద్దీ రోడ్డు… పైగా వీవీఐపీల మూవ్మెంట్ ఉండే రోడ్డు… మరి ఏదో ప్రాంక్ వీడియో పేరిట ట్రాఫిక్ ఉన్నప్పుడు ఓ న్యూసెన్స్ సీన్స్ క్రియేట్ చేస్తుంటే… పోలీసులు ఏం చేస్తున్నట్టు..? సరే, అప్పుడక్కడ లేరు అనుకుందాం… తరువాతైనా యాక్షన్ ఉండాలిగా… ప్రపంచం అంతటా ప్రాంక్ వీడియోస్ చేస్తారు, కొత్తేమీ కాదు, తప్పేమీ కాదు… కానీ పబ్లిక్ న్యూసెన్స్, నాన్సెన్స్ లేకుండా చూసుకుంటారు… ట్రాఫిక్‌కు అంతరాయం గట్రా ఉంటే పోలీసులు ఊరుకోరు… హైదరాబాద్ అంటే… అన్నింటికీ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అనుకోవాలా..? అంతా అశోకవనంలో అర్జునకల్యాణం అన్న టైటిల్‌లాగే ఉంది…!!
Share this Article