మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్ గత నెల 21న కఠినంగా ఓ ఆదేశం జారీచేసింది… తక్షణం తమిళనాడు ప్రభుత్వం ‘టూ ఫింగర్ టెస్టు’ ఆపేయాలనేది ఆ ఆదేశాల సారాంశం… 2013లోనే సుప్రీంకోర్టు ఆ టెస్టును నిషేధిస్తే, ఇంకా ఆ ప్రక్రియను పాటించడంలో అర్థమేమిటని ప్రశ్నించింది… ఐనా దేశంలో ఇప్పటికీ పలుచోట్ల ఈ పరీక్ష ప్రక్రియను నిర్వహిస్తూనే ఉన్నారు… తమిళనాడుతో సహా…
నిజానికి ఒక మహిళ లైంగిక దాడికి గురైనప్పుడు, కోర్టు గానీ, పోలీసులు గానీ బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపించినప్పుడు… ఈ టూ ఫింగర్ టెస్టు నిర్వహిస్తున్నారు… ఇది అనాగరికం, అశాస్త్రీయం అని చాలాకాలంగా మహిళాసంఘాలు మొత్తుకుంటూనే ఉన్నాయి… లైంగిక దాడి ఆరోపణ రాగానే సదరు బాధితురాలి యోనిలోకి రెండు వేళ్లు చొప్పించి, కన్నెపొర ఉందా లేదా, యోని కండరాల బిగువు ఎంత ఉంది అనేవి కనిపెట్టి, అంచనా వేసి రిపోర్ట్ ఇస్తుంటారు…
వాస్తవంగా దీన్ని మించి అశాస్త్రీయ, తప్పుడు పరీక్ష పద్ధతి మరొకటి ఉండదు… ఇప్పుడు మళ్లీ ఎందుకు చర్చల్లోకి వచ్చిందంటే… తమిళనాడులో ఓచోట దిగువకోర్టు ఓ మైనర్‌పై లైంగికదాడి జరిపిన ఓ నేరగాడికి జీవితఖైదు విధించింది… దీన్ని అప్పీల్ చేస్తూ సదరు క్రిమినల్ హైకోర్టుకు వచ్చాడు… ఈ సందర్భంగా హైకోర్టు ఈ టూఫింగర్ టెస్టు ఇంకా కొనసాగుతున్నట్టు గమనించి ప్రభుత్వానికి అక్షింతలు వేసింది… పర్టిక్యులర్‌గా మైనర్లపై లైంగికదాడి జరిగితే ఈ టెస్టు ఖచ్చితంగా చేస్తున్నారు…
Ads
ఈ టెస్టులు బాధితురాళ్లను శారీరకంగా, మానసికంగా డిస్ట్రబ్ చేయడమే… వాళ్ల గౌరవాన్ని తగ్గించడం… అని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది… లైంగిక దాడుల బాధితురాళ్లకూ హక్కులుంటాయని గుర్తుచేసింది…
మెడికల్ పరిభాషలో ఈ టెస్టును per-vaginum examination అంటారు… వర్జినిటీ టెస్టు అని కూడా… అంటే అచ్చ తెలుగులో శీలపరీక్ష… ఇదెందుకు అశాస్త్రీయం అంటే… కన్నెపొర ఆ వ్యక్తి శరీరతత్వాన్ని బట్టి చిన్నప్పుడే చిరిగిపోవచ్చు, ఆటలాడే సమయాల్లో కూడా… మరి కన్నెపొర లేకపోతే వర్జిన్ కాదని ఎలా నిర్ధారిస్తారు..? పైగా లైంగిక దాడికి గురైందా లేదా కనుక్కోవడానికి వర్జినిటీ టెస్టు దేనికి..? ఆల్రెడీ వర్జినిటీ కోల్పోయిన వాళ్లపై లైంగికదాడి జరగకూడదని ఏముంది..? అది నేరం కాదా..?
ఒకవేళ యోని కండరాలు బిగువుగా లేవనే అనుకుందాం… ఆమెకు గతంలో లైంగిక అనుభవం ఉండి ఉండవచ్చు… అయితేనేం..? లైంగికదాడి నేరమే కదా… మరి ఈ టూఫింగర్ టెస్టు తేల్చేదేమిటి..? ఇదీ ఈ టెస్టును వ్యతిరేకిస్తున్న డాక్టర్ల అభిప్రాయం… అశాస్త్రీయమే కాదు, ఈ పరీక్షలు పెయిన్‌ఫుల్, అనైతికం అనేది వాళ్ల భావన… లైంగిక ప్రక్రియలో పాల్గొన్నా సరే, మరీ అసాధారణంగా కొంతమందిలో కన్నెపొర యథాతథంగా ఉంటుందని కూడా వాళ్లు గుర్తుచేస్తున్నారు…
నిజానికి లైంగికదాడి జరిగితే, వెంటనే వైద్యపరీక్షలకు పంపిస్తే ఫోరెన్సిక్ ఆధారాల కోసం వెతుకుతారు… రెండుమూడు రోజులు గడిస్తే అవీ దొరకవు… అందుకని ఫోరెన్సిక్ పరీక్ష కూడా పూర్తిగా బాధితురాలి పక్షాన నిలబడుతుందని అనుకోలేం… ఇన్నిరకాల చిక్కులు, సందేహాలు, నిషేధాలు ఉన్నా సరే, ఇప్పటికీ అనేకచోట్ల ఇంకా ఇంకా ఆ పరీక్షలు జరుగుతూనే ఉండటం విస్మయకరమే… మధురై బెంచ్ సరిగ్గా స్పందించి, సరైన ఆదేశాలను జారీచేసినట్టే లెక్క…!! (స్టోరీ సౌజన్యం :: thenewsminute)
Share this Article