ఆంధ్రజ్యోతి నిన్న ఓ సినిమాకు ఆహో ఓహో అని ఫుల్లు డప్పు కొట్టింది ఓ ముప్పావు పేజీలో… అబ్బో, జూనియర్ నరేష్ అలియాస్ అల్లరి నరేష్‌కు అంత సీన్ ఉందా..? అసలు సందర్భమేమిటబ్బా అని లోపలకు వెళ్తే… భజనను ఇరగదీశాడు ఆ రచయిత ఎవరో గానీ… సాధారణంగా సినిమా పేజీల్లో ఏం వేస్తున్నారో చూసేంత ఓపిక, తీరిక సంపాదకులకు ఉండదు, అందులోనూ ఆంధ్రజ్యోతిలో అస్సలు ఉండదు… ఈమాట ఎందుకు అనుకోవాలీ అంటే…
ఓ మంచి సినిమాను స్మరించుకునే సందర్భం వస్తే ఖచ్చితంగా గుర్తుచేసుకోవాలి… బాగుంటుంది… ఒక మాయాబజార్, ఒక పాతాళభైరవి, ఒక మిస్సమ్మ, ఒక గుండమ్మ కథ, ఒక దేవదాసు వంటి బోలెడు సినిమాల గురించి సందర్భం వచ్చిన ప్రతిసారీ ఏదో రాస్తూనే ఉంటారు… కొత్త తరం పాఠకులకు డెఫినిట్‌గా ఇంట్రస్టింగ్… కానీ అల్లరి అనే సినిమాలో ఏముంది..?!
ఓహో… దానికి ఇరవై ఏళ్లు నిండాయి కాబట్టి కాదు… ఆ పేరిట అల్లరి నరేష్ ప్రెస్‌మీట్ పెట్టాడు కాబట్టి భజించాలి… అంతేనా..? అసలు అల్లరి అనే సినిమాయే ఓ వెగటు… అల్లరి చిల్లరగా కాదు, చిల్లరగానే ఉంటుంది… అదో గొప్ప సినిమా అన్నట్టు ఆయన గారేదో ప్రెస్ మీట్ పెట్టేయడం, దాన్ని అన్నమయ్య కీర్తనను తలపించే స్థాయిలో పాఠకుల నెత్తికి రుద్దడం… ఏమండీ ఆర్కే గారూ… వాటీజ్ దిస్… రోజూ మీ పత్రిక పెద్దలు చదవడం లేదేమో, కనీసం మీ పేపర్ మీరైనా చదువుతున్నారా అసలు..?! జగన్ సాక్షి చదవడం లేదు, వదిలేశాడు… రామోజీ కూడా ప్రస్తుతం చదవడం లేదు, ఆయనా వదిలేశాడు… నేనూ అంతే అనుకుని తమరూ చదవడం మానేశారా..?!
Ads
ఈ నరేష్ సారు చాలారోజులుగా ప్రచార తెర మీద లేడు… కొత్తగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే ఓ సినిమా చేస్తున్నాడు… దాని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు… దాని గురించే చిడుతలు వాయిస్తూ, నేరుగా రాయొచ్చు కదా… సారీ, రాయించుకోవచ్చు కదా… పాత అల్లరి సినిమా 20 ఏళ్ల పండుగ అన్నంత షో దేనికి..? దాని పేరు చెప్పి నరేష్‌ను మళ్లీ ప్రచార తెర మీదకు తీసుకురావడం దేనికి..?
ఎలాగూ సినిమా పేజీలు అంటేనే, సినిమాల ప్రమోషన్ పేజీలు, సినిమా సెలబ్రిటీల ఇమేజీ బిల్డింగ్ పేజీలు… ఎవడు కవరిస్తే వాడి కవరేజీ… కవర్ బరువును బట్టి కవరేజీ లెంత్… కాస్త మంచి మర్యాదను బహుకరిస్తే థమన్ బీజీఎం స్థాయిలో కవరేజీ మోతెక్కిపోవాల్సిందేనా..? అంతేనా..? సినిమా రిపోర్టింగ్ అక్కడే ఆగిపోవాలా..? దిశ అనే ఈపేపర్ కావచ్చు, ఈరోజు మదర్ థెరిస్సా మరో కోణం గురించిన వ్యాసం రాసింది… ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్ పేరిట తీసిన డాక్యుమెంటరీ సీరీస్ మీద… ఇదే కాదు, టీవీలు, వెబ్ సీరీస్, షార్ట్ ఫిలిమ్స్ అసలు టీవీ, సినిమా మాధ్యమాలు సముద్రాలు కదా…)
ప్రెస్‌మీట్ పెడితే చాలు, కంటెంట్ ఏదైనా సరే, కుమ్మిపారేయాలా పత్రికలో..? ఆ సూత్రం ఏమైనా ఉందా..? ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అందరూ పబ్లిష్ చేశారు ఆ అల్లరి సినిమా గురించి… సినిమా పేజీల్లో కంటెంటు మీద సమీక్ష అనేదే ఉండదా సార్లూ..? లేక ఆ పేజీని చూడడమే ఓ పనికిమాలిన పని అనుకుంటారా..? విలేఖరి తీసుకొచ్చిందే వార్త అనుకునే పక్షంలో మరిక సబ్ ఎడిటర్లు దేనికి..? వడబోతలు దేనికి..? డెస్కులు దేనికి..? ఇన్‌ఛార్జులు దేనికి..? ఎంచక్కా పేజీనేషన్ ఆర్టిస్టులకు అప్పగిస్తే సరిపోదా ఏం..?
Share this Article