నిన్ననే కదా మనం చెప్పుకున్నది… తెలుగు టీవీ సీరియళ్లు మరీ సూసైడ్ బాంబర్స్ స్థాయికి ఎదిగిపోయాయి, వాటి రచయితలు, దర్శకులు జక్కన్న రేంజులో క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారని అనుకున్నాం కదా… ప్రేమ ఎంత మధురంలో థాను సూసైడ్ బాంబింగ్ పోలిన సీన్ ప్రోమో గురించి కూడా చెప్పుకున్నాం కదా… చివరకు ఏదో ట్విస్టు ఇచ్చి, ప్రేక్షకుల్ని ఎడ్డి మొహాల్ని చేస్తాడనీ సందేహించాం కదా… ఎస్, అసలు ఈ సీన్ ఎలా తీశాడో చూద్దామని జీటీవీ ట్యూన్ చేశాను… అక్కడికి భయపడుతూనే…
భయపడినంతా జరిగింది… టీవీ సీరియళ్ల ప్రోమోలు అంటేనే ఒక చెత్త… వాటిని చూసి కథను అంచనా వేస్తారురా అని మొహం మీదే మనల్ని ప్రశ్నించినట్టుగా… సదరు సీరియల్ దర్శకుడు తన చెత్త క్రియేటివిటీని మరోసారి బయటపెట్టుకున్నాడు… ఎందుకుర భయ్, ఇలాంటి చెత్తను ప్రేక్షకుల మెదళ్లలో నింపుతారు..? సరే, విషయం అర్థం కావాలంటే నిన్నటి స్టోరీ ఓసారి చదవండి…
తెలుగు టీవీ సీరియళ్లలోకి సూసైడ్ బాంబర్స్… ప్రతి దర్శకుడూ ఓ జక్కన్నే…
Ads
థాను లేదు, సూసైడ్ బాంబూ లేదు… హీరో ఆర్యవర్ధన్‌ను చంపబోయిన రాగసుధ అనే పాత్రను రాజనందిని ఆత్మ ఆవహించిన హీరోయిన్ అనురాధ ఎటో లాక్కుపోతూ ఉంటుంది… స్టెయిర్ కేసును గట్టిగా పట్టుకుంటుంది రాగసుధ… తన నడుంలో దోపి ఉంచిన ఓ అలారమ్ ప్రెస్ చేస్తుంది… అది అక్కడెక్కడో సెల్లార్‌లో బంధించబడి ఉన్న ఓ సెమీ విలన్ వింటాడు… వెంటనే రెండు వైర్లను కలిపేస్తాడు… ఆక్సిజన్ సిలిండర్ ఓపెన్ చేస్తాడు… వైర్లకు గ్యాస్ సిలిండర్ మూతి దగ్గర కనెక్షన్ ఇస్తాడు… స్విచ్ వేస్తాడు, అంతే, పేలిపోతాయి…
అక్కడ గ్యాస్ సిలిండర్ ఎందుకు ఉంది వంటి పిచ్చి ప్రశ్నలు మనం వేయకూడదు… పేలిన తరువాత కూడా జస్ట్, మంచానికి కాస్త మంటలు అంటుకుంటాయి… అలా నీళ్ల పైపుతో నీళ్లు పిచికారీ కొట్టగానే ఆరిపోతాయి… ఈ పేలుడు జరిగేదాకా రాజనందిని ఆత్మ అలా నిలబడిపోయి, టైమ్ ఇస్తుందన్నమాట… పేలుడు అయిపోగానే ఆత్మ కూడా పారిపోతుంది అన్నమాట… అనూరాధ మళ్లీ మామూలు మనిషి అయిపోతుంది… ఎటొచ్చీ ప్రేక్షకుడే కొంతసేపు మామూలు మనిషి కాలేకపోతాడు…
నువ్వు ఊరుకోవద్దు డైరెక్టరూ… ఎలాగూ బాగా ఎదిగిపోయావు కాబట్టి… తొక్కలో టీఆర్పీలు ఎవడికి కావాలి..? ఈసారి ఇంకాస్త భీకరంగా పేలేలా… డర్టీ బాంబ్… అనగా మినీ ఆటమ్ బాంబ్ ప్లాన్ చేయి… అబ్బే, పెద్ద విధ్వంసాన్ని చూపాల్సిన పనేమీ లేదు… రెండు కుర్చీలు, రెండు అల్మారాలు, ఓ మంచం అంటుకున్నట్టు… తరువాత నీళ్లు జల్లితే ఆరిపోయేట్టు చూపించు… ఏ నీరజ్ అత్తగారితోనో ‘‘ఏమండీ ఆర్యవర్ధన్ గారూ, ఏమిటీ పేలుళ్లు… మేం నిద్రపోవాలా వద్దా’’ అనే ప్రశ్న వేయించు… బస్, సీన్ ఖతం… అన్నట్టు, ఇంకేమైనా కొత్తరకం మర్డర్ ప్లాన్లు, డిఫరెంట్ బాంబుల ప్లాన్లు ఉంటే అవీ సీరియల్‌లో పెట్టేద్దాం… ఇన్నిరకాల మర్డర్ ప్లాన్లు ఉంటాయా అని రియల్ నేరగాళ్లు, హంతకులే ఠారెత్తిపోవాలి… వోకేనా..?!
Share this Article