అనేక రకాల పెళ్లిళ్లు ఉంటాయి… మహిళల్ని నిర్బంధంగా పెళ్లిచేసుకునే ఉదాహరణలు కోకొల్లలు… వాటికి రాక్షస వివాహమనో, పిశాచ వివాహమనో పేర్లు పెట్టారు… మరి మగవాడికి నిర్బంధంగా పెళ్లిచేస్తే దాన్నేమనాలి..? ఎత్తుకుపోయి, మెడ మీద కత్తిపెట్టి, తాళి కట్టిస్తే దాన్ని ఏమంటారు..? బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లను పకడ్వా పెళ్లిళ్లు అంటారు… యుక్త వయస్సు వచ్చిన అబ్బాయిల్ని కాపాడుకోవడం కొన్ని జిల్లాల్లో తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష…
ఇప్పుడు ఇలాంటి పెళ్లి ఒకటి వార్తల్లోకి వచ్చింది… బెగూసరై జిల్లాలో ఓ పశువుల డాక్టర్… పెళ్లీడుకొచ్చాడు… కొందరి కన్నుపడింది… దగ్గరలోని గ్రామంలో ఓ పశువు హఠాత్తుగా అనారోగ్యం పాలైందని ఫోన్ చేశారు… ఇంకేముంది..? కిడ్నాప్… పెళ్లిబట్టలు తొడిగారు… బలవంతంగా పెళ్లి చేసేశారు… అబ్బాయి తల్లిదండ్రులు ఇప్పుడు కేసు పెట్టారు… ఇదీ వార్త…
Ads
ఎయిటీస్‌లో బెగూసరై మాత్రమే కాదు, లఖిసరై, ముంగర్, మొకామా, జెహానాబాద్, గయ తదితర జిల్లాల్లోనూ ఈ పెళ్లిళ్లు జరిగేవి అధికంగా… చాలామంది బయటకు చెప్పుకునేవాళ్లు కాదు… పోలీసు కేసు పెడితే ఇంకా చిక్కులు పెడతారని భయం… ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకుండా పెళ్లీడు అబ్బాయిలకు తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతూనే ఉంటారు… కానీ అనేకమంది తెలియకుండా చిక్కుకునేవాళ్లు…
ఇలాంటి పెళ్లిళ్లకు కారణాలు అనేకం… ప్రధానమైంది కట్నం… డబ్బు… ఒకవేళ అమ్మాయి తరఫు వాళ్లకు డబ్బులేదనుకొండి… కాస్త నదురుగా కనిపించిన అబ్బాయి మీద కన్నేస్తారు… ఒంటరిగా దొరికితే ఎత్తుకొచ్చేస్తారు… అప్పటికప్పుడు పెళ్లి వేదిక ప్రిపేర్ చేసి, అమ్మాయికి అలంకరించేసి, అర్జెంటుగా ముత్తయిదువలను కూడగట్టేసి హడావుడిగా పెళ్లి చేసేస్తారు… పెళ్లి ప్రమాణాలు చేయించేస్తారు…
ఒకవేళ అబ్బాయి తరఫు వాళ్లు గొడవలకు వస్తారేమోనని బంధుమిత్రులతో ఘర్షణకు కూడా రెడీ అయిపోతారు… కొన్నాళ్ల తరువాత అబ్బాయిని వదిలేస్తారు… చాలా పెళ్లిళ్లు రాజీతో ముగుస్తాయి… ఆల్‌రెడీ ఈ పెళ్లి జరిగాక అబ్బాయి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తే, అమ్మాయి తరఫు వాళ్లు ఆ పెళ్లిళ్లు జరగనివ్వరు… అందుకని ఏదో పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు…
అమ్మాయి, అబ్బాయి వయస్సు… చదువు సంధ్య… ఎత్తు, ఇష్టాయిష్టాలు జాన్తానై… అబ్బాయి దొరకడమొక్కటే ముఖ్యం… దొరికితే ఇక పెళ్లే… చేసుకోను అని భీష్మించుకున్నా కుదరదు… ఎయిటీస్‌లో చాలా ఎక్కువగా జరిగేవి… తరువాత ఇవి క్రమేపీ తగ్గిపోయాయి… ఐనాసరే ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నయ్… వార్తల్లోకి వచ్చేవి తక్కువ… పేదరికం తాండవించే ప్రాంతాల్లో, కట్నం అనే మహమ్మారి ఉన్నన్నిరోజులూ ఈ పెళ్లిళ్లు కూడా ఉంటాయేమో…!!
Share this Article