గాడ్సే..! భయం వద్దు… గాంధీని చంపిన గాడ్సే బయోపిక్ ఏమీ కాదు ఇది… నిజానికి ఈ సినిమాకు పెద్దగా రివ్యూ అవసరం లేదు… కానీ కొన్ని పాయింట్లు చెప్పుకోవాలి… ఈ సినిమా దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి ఓ బేసిక్ పాయింట్ మరిచిపోయాడు… తనలో మంచి ఫైర్ ఉంది, తపన ఉంది… కానీ సినిమా అనేది దృశ్యమాధ్యమం అని మరిచిపోతున్నాడు… సినిమా అంటేనే సీన్… అంటే దృశ్యం…
కళ్ల ముందు కనిపించే దృశ్యంతో కనెక్ట్ కావాలి ప్రేక్షకుడు… దానికి నేపథ్య సంగీతం, కథ, కథనం, కథానేపథ్యం, మాటలు, నటన గట్రా తోడవుతాయి… అంతేతప్ప కేవలం పదునైన డైలాగ్స్‌తో సినిమా నడవదు… డైలాగ్స్ అసలు వంటకు తోడయ్యే కాస్త మసాలా… కేవలం డైలాగ్స్ కావాలంటే థియేటర్ దాకా ఎందుకు రావాలి ప్రేక్షకుడు..?
చిన్న ఉదాహరణ… మహేష్ బాబు సినిమా… విలన్‌తో తాడోపేడో తేల్చుకోవడానికి బయల్దేరాడు… హీరోయిన్ నేనూ వస్తా అంటుంది… హీరో నేనే వస్తా అంటాడు… అదీ సీన్… ఆ అర్థవంతమైన రెండు పదాలతో బ్రహ్మాండంగా ఎలివేటైంది సీన్… అఖండలో బాలయ్య పంచులకొద్దీ, ఠాన్లకొద్దీ డైలాగులు కొడతాడు… బోత్ ఆర్ నాట్ సేమ్ డైలాగ్స్ ఎపిసోడ్ బ్రహ్మండంగా పేలింది… కానీ అది మాటలతో మాత్రమే కాదు… బాలయ్య వేషం, అప్పియరెన్స్, తన పాత్ర, అప్పటిదాకా నడిచిన కథ, సందర్భం… అన్నింటికీ మించి బీభత్సమైన బీజీఎం…
Ads
దర్శకుడు గోపీ గణేష్ ఈ గాడ్సే సినిమాలో బోలెడు డైలాగ్స్ వదిలాడు… వ్యవస్థలోని అవినీతి మీద, కుట్రల మీద, స్వార్థం మీద తూటాలు వదిలాడు… కానీ అవి ప్రేక్షకుల్లోకి బలంగా ఎక్కాలంటే వాటికి తగిన సీన్ల చిత్రీకరణ జరగాలి కదా, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు… పైగా ఇలాంటి సినిమాలు గతంలో కూడా చూశాంలే అనే ఫీలింగ్ ప్రేక్షకుడిని నిరాశపరుస్తుంది… అప్పట్లో తెలుగులోనే వచ్చిన ప్రతినిధి ఛాయలు కూడా కనిపిస్తాయి… అసలు కొరియాలో వచ్చిన నెగోషియేషన్ దీనికి మూలం కావచ్చు బహుశా…
తమిళంలో ఈమధ్య బోలెడు అవకాశాలతో ఇరగదీస్తున్న నటి ఐశ్యర్య లక్ష్మి… ఇందులో పర్లేదు… పాత్ర ప్రాధాన్యం ఆమెకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు… మొత్తం సత్యదేవ్ మీదే ఆధారపడి కథ నడుస్తుంది… ఎస్, ఇక్కడే మనం కాస్త సినిమా మంచీచెడూ వదిలేసి సత్యదేవ్ గురించి చెప్పుకోవాలి… (హీరో సత్యదేవ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్… హీరోయిన్ ఐశ్వర్య ఎంబీబీఎస్ చదివిన డాక్టర్… వాళ్ల నిజ జీవితాల్లో… )
మంచి మెరిట్ ఉన్న నటుడు… పదేళ్లుగా ఇండస్ట్రీలో కిందామీదా పడుతున్నాడు… వచ్చిన అవకాశాన్ని బాగానే వాడుకుంటున్నాడు… లుక్కు, వాచికం, ఎఫర్ట్ కోణాల్లో వంకపెట్టలేని నటుడు… కానీ గ్రహచారం బాగాలేనట్టుంది… పవర్‌ఫుల్‌గా పేలే పాత్ర దొరకడం లేదు తనకు… ఆమధ్య బ్లఫ్ మాస్టర్ (ఈ దర్శకుడే) కాస్త పేరు తెచ్చింది… ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా పర్లేదు… లాస్ట్ ఇయర్ వచ్చిన తిమ్మరుసు… ఇప్పుడీ గాడ్సే…
మంచి ఇంటెన్స్ ఉన్న పాత్ర దొరకాలే గానీ కుమ్మేయగలడు… కానీ ఏం లాభం… దొరికితే కదా…! ఇంతకీ గాడ్సే సంగతేమిటీ అంటారా..? భలేవారే… డైలాగ్స్ థియేటర్‌లోనే వినాలా ఏం..? ఓటీటీల్లో వినలేమా..? టీవీల్లో వినలేమా..? ఏం… ఓపిక లేదా..?!
Share this Article