బహుశా రాజకీయ పార్టీల సభలు, కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటి చర్చ ఇదే మొదటిసారేమో…!! ‘‘అంత పెద్ద మీటింగు పెట్టిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వం మీద గానీ, కేసీయార్ మీద గానీ, టీఆర్ఎస్ మీద గానీ పల్లెత్తుమాట కూడా ఎందుకు అనలేదు..?’’ ఈ ప్రశ్న మీద సోషల్ మీడియాలో, మీడియా డిబేట్లలో బోలెడంత చర్చ సాగుతోంది… కొందరి వాదనలు నవ్వు తెప్పిస్తుంటే, మరికొందరి వాదనలు వెర్రినాగన్నల మాదిరి…
సోషల్ మీడియా, మీడియా అభిప్రాయాల ఆధారంగా రాజకీయ పార్టీల సిద్ధాంతాలో, నాయకుల మాటలో ఉండవు… కేసీయార్ పేరు ఎత్తకపోవడానికి మోడీకి ఓ స్ట్రాటజీ ఉన్నట్టే… మోడీని పదే పదే విమర్శల బజారులోకి లాగడానికి కేసీయార్‌కూ ఓ ఎత్తుగడ ఉంటది…
ఊరంతా ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, వెహికిల్ ర్యాలీలతో బీజేపీ ప్రచారాన్ని తగ్గించడానికి ఓ శుష్క, హుందారాహిత్య ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ చివరకు ఏపీలో అల్లూరి విగ్రహావిష్కరణనూ వదల్లేదు…
Ads
తెలంగాణ క్షత్రియ సేవాసమితి ఓ పెద్ద యాడ్ విడుదల చేసింది… మోడీ ఆవిష్కరించబోయే విగ్రహానికి అటూఇటూ కేసీయార్, కేటీయార్ బొమ్మలు పెట్టి, కలర్ఫుల్గా ప్రిపేర్ చేశారు… పైపైన చూసి వదిలేస్తే అల్లూరి విగ్రహావిష్కరణ క్రెడిట్ కూడా వాళ్లదే అన్నంత క్రియేటివ్‌గా డిజైన్ చేశారు… తీరా చూస్తే హైదరాబాదులో మా భవనానికి ల్యాండ్ ఇచ్చారు థాంక్స్ అని ఇప్పటికిప్పుడు సదరు సేవాసమితికి అర్జెంటుగా థాంక్స్ చెప్పాలనిపించిందట… అదీ అల్లూరి విగ్రహావిష్కరణకు మోడీ వస్తున్నరోజే… ఆ విగ్రహం ఫోటో పెట్టి మరీ…!!
ఇక కేసీయార్ మీద ఏమీ మాట్లాడని మోడీ తీరుకి సంబంధించి కొందరి సమర్థనలు ఇలా ఉన్నయ్… 1) ‘‘ఓ పెద్దమనిషి తలెత్తుకుని ఠీవిగా బజారులో వెళ్తుంటాడు… ఓ చోటా గల్లీ లీడర్ ఎదురుగా వచ్చి, ఏ మొహం పెట్టుకుని నా అడ్డాకు వచ్చినవ్, నా ప్రశ్నలకు జవాబులు చెప్పి కదులు అంటాడు… సదరు పెద్దమనిషి చికాకుగా చూసి, ఎడమ చేత్తో పక్కకు నెట్టేసి, ఏదో అడుగుతున్నాడు చూడండంటూ వెనుకవాళ్లకు చెప్పి, తను హుందాగా ముందుకు సాగాడు’’
2) అది చాణక్యం… ఎదుటివాడి అహానికి మంటబెట్టే ఎత్తుగడ… తన పేరు ఎత్తలేదు అంటేనే నిన్ను నేను అసలు ఓ నాయకుడిలాగే గుర్తించడం లేదనడం… తిట్టడంకన్నా ఇదెక్కువ గాయపరచడం… వాగుడుకు మౌనసమాధానం… నేను నీ స్థాయికి దిగజారను అని పరోక్షంగా చెప్పడం…
కేసీయార్ క్యాంపు నుంచి కౌంటర్లు ఇంకోరకం… 1) అసలు సమాధానాలు చెప్పే సత్తా, తెలివి ఉంటే కదా… అందుకే కిక్కుమనలేదు… ఒక్క మాట లేదు… 2) అదీ కేసీయార్ దెబ్బ… వరుసగా ప్రశ్నలు సంధిస్తే మొహం మాడిపోయింది, ఇంకేం చెబుతాడు మోడీ…
సరే, ఎవరి విశ్లేషణలు వాళ్లవి, ఎవరి వాదనలు వాళ్లవి… కానీ ఏమాటకామాట… సభ మొత్తం కేసీయార్ కేంద్రంగానే సాగింది… అందరి ప్రసంగాల్లోనూ కేసీయారే… ఒక్క మోడీ వ్యూహాత్మకంగా కేసీయార్ పేరు ఎత్తకపోవచ్చుగాక… అనాల్సినవన్నీ జేపీ నడ్డాతో కూడా అనిపించారు… బండి సంజయ్ సరేసరి… హైదరాబాదులో జాతీయ కార్యవర్గ మీటింగు పెట్టుకుని, తెలంగాణ అధికారం మీద ఆశలు పెట్టుకుని, అడ్డుగా నిలబడి ఉన్న కేసీయార్‌ను ఎవరూ ఏమీ అనకుండా ఎలా సభ సాగుతుంది..?
మోడీ ప్రసంగంలో మాత్రం ఓ జోష్ లేదు, ఓ పంచ్ లేదు… పలుసార్లు తనేం చెబుతున్నాడో తనకే ఏమైనా అర్థమవుతోందా అనిపించింది… లక్షల మందిని సమీకరించి, అంత పెద్ద మీటింగు పెట్టి, అధికారం మీద ఆశలు పెట్టుకుని, వ్యూహాలు పన్నుతున్నప్పుడు ఎంత చైతన్యవంతంగా ఉండాలి ప్రసంగం..? అవేవో అయిదు ప్రాజెక్టులకు 35 వేల కోట్లు ఇస్తున్నాడట, ఎంత బుర్ర చించుకున్నా సమజ్ కాలేదు అవేమిటో… వేక్సిన్, రేషన్ అంటాడు, ఒక్క తెలంగాణలోనే ఇచ్చాడా..? ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ అన్నాడు, ఎక్కడో మరి..? ఏమోలే, ఆ ప్రసంగం లోతుల్లోకి వెళ్తే బుర్ర ఖరాబ్… ఉత్త ఉప్పుడుపిండి స్పీచ్…
సోషల్ మీడియాలో మరీ థర్డ్ స్టాండర్డ్ పోస్టులు కూడా కనిపించినయ్… వరంగల్ భద్రకాళి, ఆలంపూర్ జోగులాంబ, యాదగిరి నర్సింహస్వామి, భద్రాద్రి రాముడు సరే గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మలు కనిపించలేదా అని ఓ పోస్టు… ఓ గిరిజన మహిళను తొలిసారి రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెడుతున్నదే మోడీ… అడ్డుగా నిలబడ్డదే కేసీయార్… అది మరిచిపోతే ఎలా..? జైతెలంగాణ అని చివరలో అనలేదు అని మరో పోస్టు… సో వాట్..?
మరి ఈ భేటీలు సాధించింది ఏమిటి..? సింపుల్… ‘‘టార్గెట్ తెలంగాణ’’… ఇదీ తమ ప్రాధాన్య ఎజెండా అని బీజేపీ కుండబద్ధలు కొట్టేసింది… అది ఏమార్గంలోనైనా సరే…!!
Share this Article